సమస్యలొచ్చినప్పుడు మీరూ ఇలాగే చేస్తారా?
posted on Nov 19, 2024 @ 9:30AM
మనం ఎప్పుడూ సమస్యల నుండి పారిపోవాలని చూస్తాం. ఆ సమస్యల నుండి తప్పించుకోవడానికి ఎన్నో కారణాలు వెతుక్కుంటాం. కొన్నిసార్లు కారణాలు సృష్టించుకుంటాం. ఇలా మన మనస్సు ఏర్పరచుకునే మరొక రక్షణ పద్ధతి అసలెటు వంటి సమస్యా మనకు లేదని అనుకోవడం! ఉదాహరణకు సమస్యతో సతమతమవుతున్న ఒక వ్యక్తిని చూడండి. అతడు చాలా అశాంతిగా, బాధతో ఉంటాడు. అతని కళ్ళల్లో అలజడి కనిపిస్తుంది. కూర్చున్నప్పుడు కూడా స్థిరంగా కూర్చోలేడు. చేతివేళ్ళను మాటిమాటికీ లాగుకుంటాడు. కాళ్ళను ఊపుతుంటాడు. అప్పుడప్పుడు నిట్టూర్పులు విడుస్తుంటాడు. ఇవన్నీ చేస్తున్నా బయటికి అందరితో తనకేమీ సమస్య లేదని అంటాడు. సమస్యను తిరస్కరించడమంటే ఇదే! తనను తానే మోసగించుకుంటున్నానన్న విషయం అతనికర్థం కాదు.
అభద్రతా భావాలతోనూ, సందేహాలతోనూ కొట్టుమిట్టాడుతున్నప్పుడే ఇలాంటి పద్ధతి అవలంబిస్తాం. 'సమస్యలు లేవు' అని అనుకుంటే వాటిని ఎప్పుడూ పరిష్కరించలేమన్న విషయం మరచిపోతాం. మొట్టమొదట సమస్య ఉన్నదన్న విషయాన్ని అంగీకరించాలి. మనం పిరికివాళ్ళం, బలహీనులం అయినందు వల్ల సమస్యలను తిరస్కరించడానికి 'వంద' మార్గాల్లో ప్రయత్నిస్తాం. లోలోపల అభద్రతాభావం ఉన్నా, పైకి అదేమీ లేనట్లుగా ఉంటాం. దాన్ని అంగీకరించం. దానికి బదులుగా అది లేదని బుకాయిస్తాం. అంతేకాదు, మనం చాలా శక్తిమంతులమైనట్లూ, పూర్తి భద్రతతో ఉన్నట్లు నటిస్తాం.
సమస్య లేదని అనుకోవడం ఒక 'నిప్పుకోడి' ప్రవర్తించే విధంగా ఉంటుంది. తనను తినడానికి ఏదైనా జంతువు వస్తున్నదని చూడగానే, 'నిప్పుకోడి' తన తలను ఇసుకలో దూరుస్తుంది. అదేవిధంగా మనకు ఎవరిపైనైనా కోపం వస్తే, వారి నుంచి దూరంగా ఉందామని అనుకుంటాం. కానీ లోలోపల వారంటే అసలు ఇష్టమే ఉండదు. ఉడుక్కు పోతుంటాం.
మనకు ఎవరిపై కోపం వచ్చిందో, ఆ వ్యక్తిని అసలు లెక్కచేయమని పైకి అన్నా, వ్యక్తపరచని కోపం మనల్ని నియంత్రిస్తుంది. లోపల మండిపోతూ, పైకి మాత్రం ప్రశాంతంగా, మంచివాడిగా ఉండడమన్నది కపటానికి గొప్ప నిదర్శనం. ఈ విధంగా హృదయంలో వంచన ప్రారంభమై, మన నైతిక జీవనాన్ని నాశనం చేస్తుంది.
మానసిక తత్త్వశాస్త్రంలో దీనికొక ఉదాహరణ తరచూ చెబుతారు. ఒక త్రాగుబోతు వాని కొడుకు, తన తండ్రి త్రాగుబోతు అని అంగీకరించకపోవచ్చు. తండ్రి మద్యం త్రాగి క్రింద పడిపోతే, అనారోగ్యం వల్ల ఆయన ఆ విధంగా పడిపోయాడని ఇతరులు నమ్మాలని అతని కొడుకు అనుకుంటాడు. అంతే కాదు, తన తండ్రి అనారోగ్యానికి మందులు వేసుకున్నాడని కూడా అనవచ్చు. వాస్తవాన్ని అంగీకరించలేక దానిని పెడదోవ పట్టిస్తాడు. ఇదే విధంగా మన మనస్సు కూడా జీవిత సమస్యల నుండి తప్పించుకోవడానికి రకరకాల పద్ధతులను, మార్గాలను అవలంబిస్తుంది.
పైన చెప్పిన దానికి వ్యతిరేకమైనది నిష్కాపట్యం. మనస్సులో ఉన్నదే చెప్పగలగడం, చెప్పిందే చేయగలగడం మనస్సు యొక్క మంచి లక్షణం. దృఢమైన మనస్సే ఇలా చేయగలదు. ఆ విధంగా సమన్వయమైన మనస్సు ఎలాంటి సందిగ్ధాలకూ లోనుగాక ప్రశాంతంగా ఉంటుంది.
కాబట్టి మనిషి ఎప్పుడూ నిష్కపటంగా తన సమస్యలను అంగీకరిస్తూ వాటిని అధిగమించాలి. అంతేకానీ తనకు సమస్య లేదని బయటకు చెబుతూ సమస్య నుండి పారిపోకూడదు.
◆నిశ్శబ్ద.