ఏమిటీ మౌనం..కేసీఆర్ కు జాతీయ రాజకీయాలు తప్ప మహిళల మరణాలు పట్టవా?
posted on Sep 5, 2022 @ 7:55PM
ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా నలుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. మరో 30 మంది మహిళలు మృత్యువు అంచుల దాకా వెళ్లి ప్రాణాలతో తిరిగొచ్చారు. ఇది ఎక్కడో, కాదు, తెలంగాణ రాష్ట్రంలో,ఇబ్రహీంపట్నంలో జరిగింది. నిజమే, సామూహిక కుటుంబనియంత్రణ శస్త్ర చికిత్సలు,కంటి ఆపరేషన్ శిబిరాలు ఇతరత్రా వైద్య శిబిరాలు నిర్వహించిన సమయంలో అపశృతులు చోటు చేసుకోవడం, అమాయకుల ప్రాణాలు కోల్పోవడం, అప్పుడప్పుడు, అక్కడక్కడా జరుగుతూనే ఉన్నాయి. అయితే మరీ ఇంత ఘోరంగా, 34 మందికి కుటుంబనియంత్రణ శస్త్ర చికిత్సలు చేస్తే, అందులో నలుగురు ప్రాణాలు కోల్పోవడం మిగిలిన ౩౦ మంది ఆసుపత్రిపాలు కావడం, విషాదంలో కెల్లా విషాదం.
అదలా ఉంటే, రాష్ట్రంలో ఇంతటి విషాదం జరిగినా ఇంతవరకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఒక కన్నీటి చుక్క రాల్చలేదు సరికదా, కనీస ధర్మగా, ‘అయ్యో’ అని కూడా అనలేదు. అసలు స్పందించనే లేదు. అలాంటి సంఘటన ఒకటి రాష్ట్రంలో జరిగిందనే సమాచారం అయినా ఆయనకు వుందో లేదో కూడా తెలియని విధంగా ముఖ్యమంత్రి మౌనం ఉందని, బాధిత కుటుంబాలే కాదు,సామాన్య ప్రజలు అవేదన వ్యక్త పరుస్తున్నాయి.
నిజమే, అధికారులు చేయవలసింది ఏదో చేశారు. చనిపోయినవారు చనిపోయినా, ప్రాణాలతో మిగిలిన వారిని అయినా బతికించారు. చనిపోయిన తల్లుల పిల్లలకు సర్కార్ సహాయం అందించే ప్రయత్నాలు ఏవో జరుగుతున్నాయి. అలాగే, జాతీయ మహిళా కమిషన్ కార్యదర్శి ఆధ్వర్యంలో అధికారుల బృందం ఆపరేషనలు జరిగిన ఇబ్రహీంపట్నం ఆస్పత్రిని సందర్శించారు. ఆపరేషన్లు చేసిన థియేటర్లను పరిశీలించి డాక్టర్లు, సిబ్బందిని విచారించారు. మృతుల కుటుంబసభ్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పూర్తిస్థాయి నివేదిక వచ్చాక.. సంబంధిత డాక్టర్లపై చర్యలు తీసుకుంటామని జాతీయ మహిళ కమిషన్ కార్యదర్శి మీటా రాజీవ్ లోచన్ తెలిపారు.అలాగే రాష్ట్ర గవర్నర్’ తమిళి సై సౌందరరాజన్’ నిమ్స్’లో చికిత్స పొందుతున్న బాధిత మహిళలను పరామర్శించారు.
అయితే, ఇప్పడు అందరినీ వేధిస్తున్న ప్రశ్న.. ముఖ్యమంత్రి మౌనం.అవును. రాష్ట్రంలో అది కూడా ప్రగతి భవన్’ కొద్ది మైళ్ళ దూరంలో ఇంతటి విషాద సంఘటన జరిగినా, ముఖ్యమంత్రి కనీసం స్పందించ లేదు. ఇదొక్కటే కాదు, గతంలోనూ ఇంటర్ బోర్డు నిర్వాకం కారణంగా ఇంటర్ విద్యార్ధులు పదుల సంఖ్యలో ఆత్మహత్య చేసుకున్న సందర్భంలో అయితే నేమీ, బాసర త్రిబుల్ ఐటీ విద్యార్థులు ఆందోళన సందర్భంలో అయితే నేమీ, ముఖ్యమంత్రి స్పందించలేదు. సాక్షాత్తు గవర్నర్ తమిళసై సౌందర రాజన్ బాసర విద్యార్థులను పరామర్శించారు.
కానీ, ముఖ్యమంత్రి మాత్రం స్పందించలేదు. కొండగట్టు బస్సు ప్రమాదం జరిగినప్పుడు 60 మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పుడు అంతే, ముఖ్యమంత్రి అటు వైపు కన్నెత్తి చూడలేదు. అలాగే, ప్రపంచ సమస్యలు అన్నింటినీ గంటల తరబడి ఏకరవు పెట్టే ముఖ్యమంత్రి రైతులు, నిరుద్యోగుల ఆత్మహత్యల విషయంలోనూ ప్రభుత్వ వైఫల్యం కారణం ఇతరత్రా దుర్ఘటనలు చోటు చేసుకున్న సందర్భంలోనూ ముఖ్యమంత్రి స్పందించవలసిన రీతిలో స్పదించ లేదని సామాన్య ప్రజలు గుర్తు చేస్తున్నారు.
ఎక్కడో ఏదో జరిగితే చలించి పోయే ముఖ్యమంత్రి, రాష్ట్రంలో జరుగుతున్న దుర్ఘటనల విషయంలో ఎందుకు స్పందించరని, సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. అలాగే, తెలంగాణ ప్రజలకు ఏ కష్టం వచ్చినా కంటికి రెప్పలా కాపాడే బాధ్యత తనదని మాటిచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రభుత్వ నిర్వాకం వలన ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను ఎందుకు పరామర్శించ లేదని, ఆ అభాగ్యులు ముఖ్యమంత్రి పలకరింపుకు అయినా నోచుకోలేదా? అని అడుగుతున్నారు.
ముఖ్యమత్రి దృష్టి మొత్తంగా జాతీయ రాజకీయాల వెంట పరుగులు తీస్తోంది. అందుకే, రాష్ట్ర ప్రజలను పట్టించుకోకుండా, దేశంలో గుణాత్మక మార్పు కోసం అంటూ తెలంగాణ ప్రజల సొమ్మును ఎవరెవరికో ఇచ్చుకుంటూ పోతున్నారు. కష్టాల్లో ఉన్న ఇతర రాష్ట్రాల ప్రజలను ఆదుకోవడాన్ని ఎవరు తప్పు పట్టరు.. పట్టకూడదు. కానీ, ఎంతో విశ్వాసంతో రెండుసార్లు అధికారం ఇచ్చిన ప్రజల కష్టాలను ముఖ్యమంత్రి పట్టించుకోక పోవడం ఏమిటని మాత్రమే ప్రజలు అడుగుతున్నారు.
అందుకే కావచ్చును, ముఖ్యమంత్రి ప్రవర్తిస్తున్న తీరు రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేల్ వాయించిన నీరో చక్రవర్తి చక్రవర్తిని గుర్తుకు తెస్తోందని అంటున్నారు. ప్రజల కష్టాలు, కన్నీళ్ళు ఎందుకు ముఖ్యమంత్రి కంటికి కనిపించడం లేదని..అడుగుతున్నారు. ఇలా ఒకటని కాదు .. ముఖ్యమంత్రి ముందు ఎన్నో ప్రశ్నలు నిలుస్తున్నాయి.