విష్ణు రెడ్డిపై చెప్పుతో దాడి.. వైసీపీలో ఉలికిపాటు!
posted on Feb 24, 2021 @ 4:04PM
బీజేపీ అధికార ప్రతినిధి విష్ణువర్ధన్ రెడ్డిపై చెప్పుతో దాడి. పెయిడ్ ఆర్టిస్ట్ అన్నందుకు అమరావతి జేఏసీ నేత కొలికపూడి శ్రీనివాస్ కాలి చెప్పుతో విష్ణును కొట్టారు. మామూలుగానైతే ఈ ఘనపై బీజేపీ నేతలంతా భగ్గుమనాలి. తమ నేతపై దాడి జరిగినందుకు ఊరూరా ర్యాలీలు, ధర్నాలతో హోరెత్తించాలి. కానీ అలా జరగలేదు. విష్ణవర్థన్ రెడ్డిపై చెప్పుతో దాడి జరిగినా బీజేపీ శ్రేణులూ పెద్దగా పట్టించుకోలేదు. కాని వైసీపీలో మాత్రం ఉలికిపాటు కనిపిస్తోంది. అధికార పార్టీ నేతలెవరు బహిరంగంగా కామెంట్ చేయకపోయినా.. వైసీపీ కేడర్ మాత్రం సోషల్ మీడియాలో ఎదో జరిగినట్లుగా తెగ హైరానా చేస్తోంది. విష్ణు రెడ్డిపై జరిగిన దాడిని ఘోరం, దారుణం అంటూ ఆవేశానికి పోతున్నారు జగన్ రెడ్డి పార్టీ కార్యకర్తలు.
సింపుల్ గా ఇద్దరు బీజేపీ నేతలు దాడి ఘటనను ఖండించారు. సోము వీర్రాజు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి తప్పక స్పందించాల్సిన పరిస్థితి. విష్ణువర్ధన్ రెడ్డిపై దాడిని ఖండిస్తూ ఓ వీడియో మెసేజ్ రిలీజ్ చేశారు వీర్రాజు. బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ సైతం విష్ణుపై దాడిని తప్పుబట్టారు. అంతే. ఇంతకు మించి బీజేపీ వర్గాల నుంచి పెద్దగా స్పందన రాలేదు. కానీ వైసీపీ శ్రేణులు మాత్రం శ్రీనివాస్ పై దుమ్మెత్తి పోస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్టులతో నానా రచ్చ చేస్తున్నారు. శ్రీనివాస్ ను టీడీపీతో లింకు కలుపుతూ విమర్శలు చేస్తున్నారు. తన పార్టీ నేతపై దాడి జరిగినా బీజేపీ నేతలే పెద్దగా పట్టించుకోకపోగా.. ఫ్యాన్ పార్టీ కేడర్ ఆవేశంతో ఊగిపోవడం చర్చగా మారింది.
విష్ణువర్ధన్ రెడ్డిపై చెప్పుతో దాడి ఘటన తర్వాత.. ఎవరు పెయిడ్ ఆర్టిస్టులో.. ఎవరు ఎవరికి పెయిడ్ ఆర్టిస్టులో అనే చర్చ జోరుగా సాగుతోంది. విష్ణువర్ధన్ రెడ్డి బీజేపీ ముసుగులో ఉన్న వైసీపీ నేత అనే విమర్శ ఉంది. అతను ఎప్పుడు, ఏ డిబేట్ లో పార్టిసిపేట్ చేసినా.. ఏ టాపిక్ వచ్చినా, అందులో వైసీపీ తప్పేమీ లేదన్నట్టు మాట్లాడుతారని అంటారు. అధికార వైసీపీ కంటే ప్రతిపక్ష టీడీపీనే టార్గెట్ చేస్తుంటారు. ఏ అంశం చర్చకు వచ్చినా.. అందులోకి చంద్రబాబును లాగి విమర్శిస్తుంటారని విష్ణువర్ధన్ రెడ్డిపై విమర్శలు ఉన్నాయి. ఆయన తీరును గమనించే వారంతా అధికార వైఎస్సార్ సీపీకి పెయిడ్ ఆర్టిస్టు అని చెబుతూ ఉంటారు. విష్ణుతో పాటు సోము వీర్రాజు, జీవీఎల్ లు సైతం వైసీపీని సమర్థించే బీజేపీ నేతలని టాక్. బీజేపీ, వైసీపీ మధ్య లోపాయికారి పొత్తు ఉందని.. అందుకే ఈ ముగ్గురు దాదాపు అన్ని విషయాల్లో వైసీపీని వెనకేసుకు వస్తుంటారని చెబుతుంటారు. వైసీపీతో అంటకాగిన అలాంటి వ్యక్తి.. రాజధాని కోసం 400 రోజులకు పైగా పట్టుసడలని పోరాటం చేస్తున్న జేఏసీ నేతను పట్టుకొని పెయిడ్ ఆర్టిస్టు అనడం విడ్డూరంగా ఉందని అంటున్నారు. విష్ణువర్ధన్ రెడ్డి తీరును సహించలేక కొలికపూడి శ్రీనివాస్ పట్టరాని ఆవేశంతో అలా చెప్పుతో దాడి చేశారని చెబుతున్నారు.
చెప్పుతో దాడి జరిగినా బీజేపీ వర్గాల నుంచి పెద్దగా రియాక్షన్ రాకపోవడానికి ఇదే కారణమంటున్నారు. విష్ణువర్ధన్ రెడ్డి తీరుపై పార్టీలో ఉన్న వ్యతిరేకతే కారణమని తెలుస్తోంది. బీజేపీ నేతగా ఉంటూ.. టీవీ డిబేట్లలో వ్యక్తి గత ఎజెండా ప్రకారం మాట్లాడుతుండటం.. వైసీపీకి అనుకూలంగా ఉండటం.. సొంత పార్టీలో చాలా మందికి నచ్చడం లేదట. అందుకే, తాజా దాడిపై వారెవరూ నోరు మెదపడం లేదని అంటున్నారు. మొత్తంగా విష్ణు రెడ్డిపై జరిగిన చెప్పు దాడి ఘటన బీజేపీ కంటే వైసీపీకే ఎక్కువ బాధ కలిగించిందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.