ఇంతకీ కిడ్నాపర్ల వెనుక ఉన్నది ఎవరు ?
posted on Jun 21, 2023 @ 9:38AM
విశాఖపట్నం ఎంపీ, వైసీపీ నాయకుడు ఎంవీవీ సత్యనారాయణ ఫ్యామిలీ కిడ్నాప్ వ్యవహారం అనంతరం ఆయన వ్యవహరిస్తున్న తీరు పట్ల పోలిటికల్ సర్కిల్‌లో తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. తన వ్యాపారాన్ని విశాఖపట్నం నుంచి పక్క రాష్ట్రంలోని హైదరాబాద్ మహానగరానికి మారుస్తానని ఆయన స్పష్టం చేయడం, ఆ తర్వాత తన సొంత పార్టీ అధినేతకు చెందిన మీడియాలో ఒకే రోజు.. కోట్ల రూపాయిల విలువైన ప్రకటనలు ఇవ్వడం.. అనంతరం తన ప్యామిలీతో కలిసి ఎంపీ వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్‌ని కలసి రావడం.. చూస్తుంటే.. ఈ కిడ్నాప్ స్కెచ్ పక్కా పకడ్బందీ ప్రణాళికతోనే జరిగిందనే ఓ చర్చ పోలిటికల్ సర్కిల్‌లో వైరల్ అవుతోంది.
మరోవైపు ఎంపీ కంటే.. ఆయన ఫ్యామిలీని కిడ్నాప్ చేసిన కిడ్నాపర్లకు అండ దండ.. చాలా చాలా గట్టిగా ఉన్నాయనే ఓ టాక్ సైతం ఆ సర్కిల్స్ లో తెగ హల్‌చల్ చేస్తోంది. ఈ విషయాన్ని గ్రహించిన ఆయన.. ఇకపై వ్యాపారం.. విశాఖపట్నం నుంచి కాక.. హైదరాబాద్ కేంద్రంగా చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అదీకాక ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్ వ్యవహారం డబ్బు కోసమేనంటూ పైకి చెబుతున్నప్పటికీ.. ల్యాండ్ సెటిల్‌మెంట్లలో భాగంగా జరిగిందనే ప్రచారం సైతం వాయువేగంతో నడుస్తోంది. అలాగే ఈ కిడ్నాప్ వ్యవహారంతో తన పరువు హుళక్కి అయిందని ఎంపీ ఎంవీవీ తనలో తానే రగిలిపోతున్నారని అంటున్నారు.
అసలు అయితే రాష్ట్రంలో వైసీపీ ఎంపీలు రెండంకెల సంఖ్యలో ఉన్నా.. ఎవరి పనుల్లో వారు బిజీ బిజీగా ఉన్నారు. ప్రస్తుత విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ.. గత ఎన్నికల్లో జేడీ లక్ష్మీనారాయణ మీద పోటీ చేసి విజయం సాధించారు. ఆ సమయంలోనే ఆయన ఓ బిల్డర్ అనీ టాలీవుడ్ సినిమా ప్రోడ్యూసర్ అని అందరికీ తెలిసింది.
ఆ తర్వాత ఆయన్ని అంతగా ఎవరు పట్టించుకోలేదు. ఇంకా చెప్పాలంటే.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలంటూ.. అందులో పని చేస్తున్న కార్మికులు చేపట్టిన ఆందోళన 200వ రోజుకు చేరింది. ఈ సందర్బంగా కార్మికులు మానవ హారంగా ఏర్పడి.. తమ నిరసన తెలిపారు. ఆ క్రమంలో వారిని పరామర్శించేందుకు వెళ్లిన ఎంపీ ఎంవీవీ సత్యనారాయాణను కార్మికులు ఘెరావ్ చేశారు. దీంతో ఆయన కామ్‌గా కారెక్కి అక్కడి నుంచి వెళ్లిపోవడం గమనార్హం. ఇక విశాఖ రైల్వే జోన్ అంశంలో సైతం సదరు ఎంపీ ఏ స్థాయిలో స్పందించిందీ అందరికీ తెలిసిందేననే చర్చ సైతం నేటికి కొనసాగుతోంది.
మరోవైపు గతంలో వైసీపీ ఉత్తరాంధ్ర ఇన్‌చార్జ్‌గా ఉన్న విజయసాయిరెడ్డికి విశాఖ ఎంపీకి మధ్య కొంత గ్యాప్ వచ్చిందని.. ఈ పంచాయతీ అప్పట్లో తాడేపల్లి ప్యాలెస్‌కు చేరిందనే వార్తలు సైతం వెల్లువెత్తాయి.
ఇంకో వైపు ఎంపీ ఎంవీవీ ప్రొడ్యూసర్‌గా తెరకెక్కించిన చిత్రం గల్లీ రౌడీ. ఈ చిత్రంలో కథాంశం.. ప్రస్తుత ఎంపీ ప్యామిలీ కిడ్నాప్ వ్యవహారం కథ కమామిషు అంతా ఒకే విధంగా ఉన్నాయనే టాక్ సైతం ప్రస్తుతం హల్ చల్ చేస్తోంది.
ఈ కిడ్నాప్ వ్యవహారాన్ని సదరు ఎంపీ సత్యనారాయణ ఏ మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారని... ఆ క్రమంలోనే ఎంపీగారు ఏపీలో దుకాణాన్ని బంద్ చేసి.. తెలంగాణలో తెరిచేందుకు సన్నాహాలు చేస్తున్నారనే చర్చ వాడి వేడిగా నడుస్తోంది.
అదీకాక.. రాష్ట్రంలో అధికార పార్టీ నేతలను, ప్రజా ప్రతినిధులు టచ్ చేసేందుకు పోలీసులే జంకుతున్నారని... అటువంటి పరిస్థితుల్లో రేపో మాపో ఎగ్జిక్యూటీవ్ క్యాపిటల్‌గా అవతరించబోతున్న విశాఖపట్నానికి లోక్‌సభ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి ఫ్యామిలీని ఇలా కిడ్నాప్ చేయడం అంటే అంత అషామాషీ వ్యవహారం కాదనే ఓ చర్చ సైతం పోలిటికల్ సర్కిల్‌లో వాడి వేడిగా వైరల్ అవుతోంది.