వైసీపీ నేతల దారేది?.. బెయిలా..జెయిలా.. హాస్పటలా?
posted on Mar 28, 2025 @ 12:11PM
ఒక్కసారి అవకాశం ఇవ్వండి అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి.. ఐదేళ్లు ప్రజలకు నరకం చూపించాడు. ఇక ప్రతిపక్ష నేతల గురించి చెప్పాల్సిన పనిలేదు. జగన్ కక్షపూరిత రాజకీయాల వల్ల చంద్రబాబుతో సహా అనేకమంది జైళ్లకు వెళ్లాల్సి వచ్చింది. జగన్ హయాంలో కొందరు వైసీపీ నేతలు హద్దులు మీరి ప్రవర్తించారు. బూతులతో చంద్రబాబు, పవన్, లోకేశ్ సహా వారి కుటుంబ సభ్యులపైనా విరుచుకుపడ్డారు. అసెంబ్లీ వేదికగా చంద్రబాబు కుటుంబాన్ని దారుణంగా అవమానించారు. వారిలో వల్లభనేని వంశీ, కొడాలి నాని, రోజా ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా చాలా పెద్దదిగానే ఉంటుంది.
వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఆ పార్టీ నేతలు అధికార మదంతో వ్యవహరించారు. వైఎస్ జగన్ దగ్గర నుంచి కింది స్థాయి కార్యకర్తల వరకు తాము ఏం చేసినా చెల్లుబాటు అవుతుందన్న ధీమతో హద్దులు మీరి ప్రవర్తించారు. ప్రతిపక్ష పార్టీల నేతలను ఇబ్బందులకు గురిచేయడంతోపాటు.. సామాన్య ప్రజలనుసైతం నానా రకాలుగా ఇబ్బందులు పెట్టారు. సీన్ కట్ చేస్తే గత ఎన్నికల్లో ఓటు ద్వారా వైసీపీకి ప్రజలు గట్టి గుణపాఠం చెప్పారు. కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా అర్హత లేదంటూ వైసీపీకి కేవలం 11 స్థానాలకు పరిమితం చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఐదేళ్లు అధికారం మత్తులో హద్దులుమీరి ప్రవర్తించిన నేతలపై కూటమి ప్రభుత్వం కొరడా ఝుళిపిస్తోంది. వైసీపీ హయాంలో అవినీతి అక్రమాలను వెలికితీస్తూ ఒకవైపు.. అధికారం మత్తులో నోరుపారేసుకున్న నేతలపై మరోవైపు కేసులు నమోదు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే వైసీపీ హయాంలో విర్రవీగి.. ఇష్టారీతిగా నోరు పారేసుకున్న నేతలు, సోషల్ మీడియాలో అసభ్య పోస్టులతో రెచ్చిపోయిన నాయకులు కేసుల చట్రంలో ఇరుక్కున్నారు. బోరుగడ్డ అనీల్ లో మొదలెడితే పలువురు వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు కటకటాలు లెక్కిస్తున్నారు.
ఒకళ్లా ఇద్దరా పదుల సంఖ్యలో వైసీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. అలా కేసులు నమోదైన వారిలో మాజీ మంత్రులు కొడాలి నాని, ఆర్కే రోజా, విడదల రజని, పేర్ని నాని, జోగు రమేష్, కాకాణి గోవర్ధన్ రెడ్డి, తదితరులపై కేసులు నమోదయ్యాయి. ఇంకా వల్లభనేని వంశీ, బోరుగడ్డ అనిల్, పోసాని కృష్ణ మురళి, వర్రా రవీంద్రారెడ్డి, నందిగం సురేష్, జోగి రాజీవ్ ఉన్నారు. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి, విక్రాంత్ రెడ్డి, సజ్జల భార్గవ్ రెడ్డి, గోరంట్ల మాధవ్, దువ్వాడ శ్రీనివాస్, అలాగే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, ఐపీఎస్ అధికారులు కూడా ఉన్నారు. వీరిలో పలువురు జైలు పాలయ్యారు. కొందరు బెయిలుపై ఉన్నారు. దీంతో వైసీపీ నేతల్లో భయం పట్టుకుంది. కేసులు నమోదైన వారిలో పలువురు అరెస్టయ్యారు. ఇంకొందరు బెయిలుపై ఉన్నారు. ఇంకా మరి కొందరు బెయిలు కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఇది చాలదన్నట్లు అనారోగ్యం అంటూ ఆస్పత్రుల పాలౌతున్నారు. మొత్తం మీద ఇప్పుడు వైసీపీకి బ్యాడ్ టైమ్ నడుస్తున్నట్లుగా కనిపిస్తోంది.
పోసాని కృష్ణమురళి వంటి వాచాలురు జైలు కెళ్లి బెయిలుపై బయటకు వచ్చారు. ఇక గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అయితే బెయిలు కూడా దొరక్క రిమాండ్ ఖైదీగా విజయవాడ జైల్లో ఊచలు లెక్కిస్తున్నారు. అనారోగ్యం, బ్యాక్ పెయిన్ అంటూ బెయిలు కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అవినీతి కేసులో మాజీ మంత్రి విడదల రజనీ హైకోర్టును ముందస్తు బెయిలు కోసం ఆశ్రయించినా ఫలితం దక్కలేదు. నేడో రేపో ఆమె కూడా అరెస్టు కాక తప్పదన్న ప్రచారం జరుగుతోంది. అదే విధంగా క్వార్జ్ ఖనిజం కొల్లగొట్టిన కేసులో మరో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ అరెస్టు భయంతో వణికి పోతున్నారు. ముందస్తు బెయిలు కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్ విచారణ వాయిదా వేసిన కోర్టు.. తాత్కాలిక ఊరట ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో ఆయన మెడపై కూడా అరెస్టు కత్తి వేళాడుతోంది. ఇక బూతుల మంత్రిగా సుప్రసిద్ధుడైన కొడాలి నాని కూడా అరెస్టు భయంతో వణికిపోతున్నారు. తీవ్ర ఒత్తిడితో అనారోగ్యం పాలై హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు గుండె సంబంధిత సమస్యలున్నాయని వైద్యులు చెబుతున్నారు. మరో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా తన అక్రమాలకు ఫలితం అనుభవించక తప్పని పరిస్థితుల్లో ఉన్నారు. ఆయన భూ కబ్జాలకు సంబంధించి దర్యాప్తు వేగం పుంజుకోవడంతో ఆయన కూడా తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. ఇటీవల తన నివాసంలో బాత్ రూంలో జారిపడి చేయి విరక్కొట్టుకుని ఆస్పత్రి పాలయ్యారు.
మొత్తంగా చూస్తుంటే జగన్ హయాంలో ఇష్టారీతిగా వ్యవహరించిన వైసీపీ నేతలకు ఇప్పుడు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. కేసులనమోదు కావడంతో ఎప్పుడు, ఏ క్షణంలో పోలీసలు వచ్చి తలుపుతడతారా అన్న భయంతో వారి హెల్త్ దెబ్బతింటోందని నెటిజనులు సెటైర్లు పేలుస్తున్నారు. అనారోగ్యం కారణంగా ముందస్తు బెయిల్ దొరికే చాన్స్ లు ఎక్కువ ఉంటాయని వైసీపీ నేతలు భావిస్తున్నట్లుగారని నెటిజనులు ఎగతాళి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ నేతల అనారోగ్యం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ముందుగా కొడాలి నాని విషయం తీసుకుంటే.. కొడాలి నాని కొడాలి నాని గ్యాస్టిక్ ట్రబుల్ తో ఆస్పత్రిలో చేరారు. ఇన్ పేషంట్ గా చేరి రకరకాల పరీక్షలు చేయించుకున్నారు. ఆయనకు గుండెనొప్పి అని ప్రచారం జరిగింది. గుండెల్లో బ్లాక్స్ ఉన్నాయని చెబుతున్నారు గుడివాడలో నమోదైన కొన్ని కేసుల్లో కొడాలి ప్రమేయంపై ఆధారాలు సేకరించారు. కొంత మంది ఖాతాల్లో డబ్బులు వేసి ఆ తరువాత తన ఖాతాల్లోకి మళ్లించుకున్నట్లుగా గుర్తించారు. ఇక అరెస్టు ఖాయమని అనుకున్న సమయంలో ఆయన ఆస్పత్రి పాలు కావడం జరిగింది.
ఇక మద్యం కుంభకోణంలో ప్రధానంగా వినిపిస్తున్న మిథున్ రెడ్డి, భూ, గనుల వ్యవహారాల్లో దోపిడీకి పాల్పడినట్లుగా ఆరోపణలు ఎదుర్కొన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై కూడా అరెస్టు కత్తి వేళాడుతోందంటున్నారు. మిధున్ రెడ్డి అయితే మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. లిక్కర్ కేసులో ఇప్పటి వరకూ ఆయన పేరు నమోదు కాలేదు. అయినా అరెస్టు భయంతో ముందస్తు బెయిలు తెచ్చుకన్నారు. తన తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతికి సర్జరీ జరిగిందంటూ మిథున్ రెడ్డి బెయిల్ తెచ్చుకున్నారు. ఇలా మొత్తంగా జగన్ హయాంలో ఇష్టారీతిగా వ్యవహరించి చట్టాలను చుట్టాలుగా చేసుకుని చెలరేగిపోయిన వారంతా ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లో ఇరుక్కుపోయినట్లుగా కనిపిస్తున్నది.