Read more!

మూగజీవాల మనుగడ కోసం మానవుడి స్వరం..

ఈ ప్రపంచంలో మనుషులతో పాటు జంతువులు, పక్షులు, సరీసృపాలు ఇలా చాలా జీవులు ఉన్నాయి. జంతువులకు లేని ఎన్నో అడ్వాంటేజస్ మనుషులకు ఉన్నాయి. ఈ కారణంగానే జంతువులు మనుషుల్లా అభివృద్ది చెందలేకపోయాయి.   అయితే జంతువులకు మనసుంటుంది. అవి కూడా వాటి మనసులో ఉన్న భావాల్ని వ్యక్తం చేయడానికి విభిన్న రకాలుగా ప్రయత్నిస్తాయి. వాటికి కావలసిన స్వేచ్చ గురించి మరెన్నో విషయాల గురించి చెప్పాలనుకుంటాయి. కానీ అవి చెప్పలేవు. అందుకే వాటి  తరపున సగటు మనిషే గొంతు వినిపిస్తాడు. జంతువుల సంరక్షణ,  జంతువుల హక్కులు, అంతరించిపోతున్న జంతుజాతుల కోసం పోరాడటం వంటి ఎన్నో విషయాలను ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఒక రోజు ఏర్పాటుచేయబడింది. ఇది అక్టోబర్ 4వ తేదీన నిర్వహించబడుతుంది. ఈ రోజున జంతు ప్రేమికులు జంతువుల తరపున తమ గొంతును ప్రపంచానికి వినిపిస్తారు. అసలు ఈ జంతు దినోత్సపం ఎప్పుడు ఎలా ఏర్పడింది? మూగజీవుల కోసం ఒకరోజు ఏర్పాటు చెయ్యాలని అనిపించడం వెనుక కారణం ఏమిటి? పూర్తీ వివరాలు తెలుసుకుంటే..

చరిత్ర ఏం చెబుతోందంటే..

ప్రపంచ జంతు దినోత్సవం 1925లో హెన్రిచ్ జిమ్మెర్‌మాన్ బెర్లిన్‌లో మొదటిసారి  నిర్వహించింది. జిమ్మెర్‌మాన్, జర్మన్ జంతు ప్రేమికుల మ్యాగజైన్ “మ్యాన్ అండ్ డాగ్” ను  ప్రచురించారు.  జంతువుల పట్ల అవగాహన పెంచడానికి, ఆ అవగాహనను  మెరుగుపరచడానికి  ఈ ఈవెంట్‌ను ప్రారంభించారు. కాథలిక్కులందరూ గౌరవంగా భావించే  సెయింట్ ఫ్రాన్సిస్ జంతువులు ఇంకా ఇతర  అన్ని జీవులతో  ఎంతో గొప్ప అనుబంధాన్ని ఏర్పరుచున్నారు.   జంతువుల కోసం సెయింట్ ఫ్రాన్సిస్ ఎన్నో గొప్ప పనులు చేశారు.  ఈ రోజున కొన్ని కాథలిక్ చర్చిలు పెంపుడు జంతువులకు ఆశీర్వాదాలు అందిస్తాయి.

ప్రపంచ జంతు దినోత్సవం పర్యావరణ శాస్త్రవేత్తలకు అంతరించిపోతున్న జాతులకు సంబంధించిన సమస్యలను చర్చించడానికి ఒక వేదికగా మారింది. 2003 నుండి, UK-ఆధారిత స్వచ్ఛంద సంస్థ నేచర్‌వాచ్ ఫౌండేషన్ ఈ ఈవెంట్‌ను ఏర్పాటు  చేసింది.  ప్రపంచవ్యాప్తంగా ఉన్న జంతు ప్రేమికులు ఈ ఈవెంట్ కు మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతో దీన్ని వ్యాప్తం చేస్తూ వచ్చింది. ప్రపంచ జంతు దినోత్సం రోజున  కేవలం పెంపుడు జంతువులకు మాత్రమే కాదు అడవి జంతువులు, అంతరించిపోతున్న జాతులు,  పర్యావరణ విధ్వంసం లేదా రక్షణ లేకపోవడం వల్ల  జరుగుతున్న నష్టాన్ని చర్చించడం, దాన్ని నిర్మూలించడానికి చర్యలు తీసుకోవడం. జంతువుల హక్కులు, వాటి సంరక్షణ, ప్రజల ఆలోచనలలో మార్పు మొదలైన విషయాల గురించి అవగాహన పెంచండం దిశగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది.

సగటు పౌరుడి భాద్యత ఏంటంటే..

చాలామంది ఇళ్ళలో పెంపుడు జంతువులు ఉంటాయి. అయితే కేవలం పెంపుడు జంతువులనే కాకుండా సమాజంలో భాగంగా ఉన్న జంతువులకు కూడా ఆహారం ఇవ్వడం వాటి సంరక్షణ దిశగా ఆలోచన చెయ్యడం, జంతు హింస మానడం, జంతువుల పట్ల అనుచితంగా ప్రవర్తించేవారిలో మార్పు తీసుకురావడం, సమాజంలో మనుషులతోపాటు నివసించే హక్కు జంతువులకు ఉందని గుర్తించడం, ఈ విషయాలను అందరికీ తెలియజేయడం ప్రతి ఒక్కరి బాధ్యత. జంతువులకు ఫీలింగ్స్ ఉంటాయి. వాటిని గుర్తించి ఆ జంతువులతో ప్రేమగా మసలుకోవడం ఎంతో ముఖ్యం. మనిషి జంతువులను ప్రేమిస్తే మనిషి కంటే ఎక్కువ ప్రేమను అవి తిరిగి ఇస్తాయి. ఈ విషయాలు అందరూ గుర్తుపెట్టుకోవాలి.


జంతు దినోత్సవం వెనుక కొన్ని ఆసక్తిర విషయాలు..


జంతువుల పట్ల తన గొంతు వినిపించడం అనేది ఇప్పటినాటి మాట కాదు. గ్రీకు తత్వవేత్త పైథాగరస్  జంతువులకు ఫీలింగ్స్ ఉంటాయని, అవి కూడా బాధపడతాయని, వాటికి కూడా ఆత్మ ఉంటుందని గుర్తించాడు. అందుకే అందరూ శాఖాహారం తీసుకోవాలని, జంతు హింస మానేయాలని  ఎప్పుడో చెప్పారు.  

లూయిస్ గోంపెర్ట్జ్ అనే వ్యక్తి జంతువుల హక్కుల కోసం వాదించడానికి మొదటిసారి ఒక పుస్తకాన్ని వెలువరించారు. ఈ పుస్తకం పేరు “Moral Inquiries on the Situation of Man and of Brutes,” ఇది 1624లో జరిగింది.

1877లో సాహిత్య పరంగా కూడా జంతువుల హక్కులు, వాటి జీవితం గురించి ఒక నవల వెలువడింది. అన్నా సీవెల్ రచించిన ఈ  నవల 'బ్లాక్ బ్యూటీ'.  మానవేతర దృక్కోణం నుండి వ్రాయబడిన మొదటి ఆంగ్ల నవల ఇదే.   గుర్రాల చికిత్సపై ఈ నవల  చర్చను రేకెత్తిస్తుంది.

ఫ్లోరెన్స్ ఇటలీలోని ఇంటర్నేషనల్ యానిమల్ ప్రొటెక్షన్ కాంగ్రెస్ ప్రపంచవ్యాప్తంగా 'ప్రపంచ జంతు దినోత్సవాన్ని' ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇది 1931 వ సంవత్సరంలో జరిగింది.

సొసైటీ ఫర్ యానిమల్ ప్రొటెక్టివ్ లెజిస్లేషన్ (SAPL) USలో హ్యూమన్ స్లాటర్ చట్టం కోసం లాబీయింగ్ చేసిన మొదటి సంస్థ. ఇది 1955లో జరిగింది.

                                                             *నిశ్శబ్ద.