వైయస్ అవినాష్ రెడ్డి ఫ్యామిలీ ఎక్కడ..?
posted on Mar 15, 2023 @ 4:01PM
ఢిల్లీ మద్యం కుంభకోణంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మార్చి 11వ తేదీన విచారణకు హాజరు కావాలంటూ ఢిల్లీలోని ఈడీ అధికారులు నోటిసులు జారీ చేశారు. అంతే ఆ రోజుకు ఒక రోజు ముందు.. కేసీఆర్ కేబినెట్‌లోని సగానికి సగం మంది మంత్రులు.. దేశ రాజధాని హస్తినకు క్యూ కట్టేశారు. మరోవైపు కల్వకుంట్ల కవితతోపాటు ఆమె సోదరుడు, మంత్రి కేటీఆర్, అలాగే కేసీఆర్ మేనల్లుళ్లైన మంత్రి హరీశ్ రావు, రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమారులు సైతం ఢిల్లీకి తరలి వెళ్లారు. ఓ వేళ నిన్ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసినా.. నీకు అండగా మేమంతా ఉన్నాం.. నీ వెనుక తెలంగాణ సమాజం ఉందంటూ ఎమ్మెల్సీ కవితకు ఓ విధమైన భరోసా కల్పించారనే ఓ చర్చ అయితే పోలిటికల్ సర్కిల్‌లో బాగానే నడిచింది.. నడుస్తోంది కూడా. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డికి ఈ తరహా మద్దతు.. భరోసాలు కల్పించే ప్రయత్నాలు అయితే జరగలేదనే ఓ చర్చ అయితే సదరు పోలిటికల్ సర్కిల్ జోరుగా... ఊపందుకొంది. అంతేకాదు వైయస్ అవినాష్ రెడ్డికి మద్దతు కరువైందంటూ సదరు సర్కిల్‌లో విశ్లేషణలు సైతం మొదలైనాయి.
వైయస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి, ఆతని తండ్రి వైయస్ భాస్కరరెడ్డిలపై సీబీఐ తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పిస్తోందని.... ఆ క్రమంలో వైయస్ అవినాష్ రెడ్డి.. ఒకటికి నాలుగు సార్లు హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయానికి విచారణ నిమిత్తం వెళ్లారని... అయితే తొలిసారి ఆయన ఈ హత్య కేసులో విచారణకు హాజరైనప్పుడు కడప జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలతోపాటు అదే జిల్లాకు చెందిన పలువురు జిల్లా నేతలు, కార్యకర్తలు తరలి వచ్చారని.. కానీ ఆ తర్వాత వరుసగా జరిగిన విచారణలకు మాత్రం వైయస్ అవినాష్ రెడ్డి వెంట ఎవరూ రాలేదని.... మరోవైపు ఆతడికి మద్దతుగా వైయస్ ఫ్యామిలీలోని సభ్యులు కానీ... ఆ పార్టీలోని కీలక నేతలు కానీ కార్యకర్తలు కానీ, చివరకు జగన్ కేబినెట్‌లోని మంత్రులు కానీ వచ్చిందీ లేదు.. మీడియా ముందుకు వచ్చి వైయస్ అవినాష్‌కు మద్దతు పలికిందీ లేదని పోలిటికల్ సర్కిల్‌లో ఓ చర్చ మాత్రం జోరందుకొంది.
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో ఆయన సోదరుడు వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నా.. వారి పార్టీనే అధికారంలో ఉన్నా.. వైయస్ అవినాష్‌కు అండ.. దండ కరువైందనే విషయం స్పష్టమవుతోందని టాక్ సైతం పోలిటికల్ సర్కిల్‌లో నడుస్తోంది. కొద్దిగా కాకపోయినా.. కనీసం వైయస్ ఫ్యామిలీలోని వారు అయినా.. నీకు మేమున్నామంటూ వైయస్ అవినాష్‌కు ఓ విధమైన భరోసా కల్పించే ప్రయత్నం చేస్తే ఏమైందనే ప్రశ్న సైతం సదరు పోలిటికల్ సర్కిల్‌లో ఉత్పన్నమైనట్లు తెలుస్తోంది.
ఇంకోవైపు వైయస్ వివేకా హత్య కేసులో తనపై సీబీఐ అధికారులు తీవ్ర చర్యలు తీసుకోకుండా.. ఆదేశాలు ఇవ్వాలంటూ వైయస్ ఆవినాష్ రెడ్డి ఇటీవల తెలంగాణ హైకోర్టును ఆశ్రయించి.. రిట్ పిటిషన్ దాఖలు చేయడం.. ఆ క్రమంలో వైయస్ వివేకా కుమార్తె వైయస్ సునీత.. ఇంప్లీడ్ పిటిషన్ వేయడం.. చకచకా జరిగిపోయాయి. అంతేకాదు తన ఇంప్లీడ్ పిటిషన్‌లో వైయస్ వివేకా హత్య కేసులో వైయస్ అవినాష్‌కు సంబంధించిన పలు కీలక అంశాలను వైయస్ సునీత ప్రస్తావించడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే వైయస్ అవినాష్‌కు అటు వైయస్ ఫ్యామిలీ నుంచి కానీ.. ఇటు పార్టీ నుంచి కానీ కనీస మద్దతు కరువై ఉంటుందనే ఓ అభిప్రాయం పోలిటికల్ సర్కిల్‌లో వ్యక్తమవుతోన్నట్లు తెలుస్తోంది.