ఏపీలో ఇక నుంచి వాట్సాప్ ద్వారానే టెన్త్, ఇంటర్ ఫలితాలు
posted on Apr 4, 2025 @ 1:51PM
దేశంలోనే తొలి సారిగా వాట్సాప్ గవర్నెన్స్ ను ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాని ద్వారా అందించే సేవలను పెంచుతూ మరింత ప్రతిభామంతంగా తీర్చిదిద్దుతున్నది. ఈ ఏడాది జనవరి 30న ఏపీలో మన మిత్ర పేరుతో వాట్సాప్ గవర్నెన్స్ ను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిన సంగతి విదితమే. తొలి దశలో ఈ వాట్సాప్ గర్నెన్స్ ద్వారా 161 సేవలను అందుబాటులోకి తీసుకు వచ్చిన ప్రభుత్వం ఆ తవర్వాత వాటిని 200కు పెంచింది.
జనం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా వాట్సాప్ గవర్నెన్స్ దోహదపడుతోంది. వాట్సాప్ గవర్నెన్స్ కు ప్రజల నుంచి బ్రహ్మాండమైన స్పందన లభిస్తున్నది. ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడిక ఈ ఏడాది నుంచి టెన్త్, ఇంటర్ పరీక్షా ఫలితాలను కూడా విద్యార్థులకు వాట్సాప్ ద్వారా అందజేయడానికి సర్వం సిద్ధం చేసింది. ఈ ఏడాది నుంచి టెన్త్, ఇంటర్ పరీక్షా ఫలితాలను వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా నేరుగా విద్యార్థుల మెబైల్ నంబర్లకే అందజేయనుంది. ఈ విషయాన్ని ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ స్వయంగా వెల్లడించారు. గతంలో హాల్ టికెట్లను ఎలా అయితే మొబైల్ నంబర్లకు పంపించారో అలాగే ఈ సారి విద్యార్థులకు టెన్త్, ఇంటర్ పరీక్షా ఫలితాలను కూడా పంపిస్తారు. ఇందు కోసం ఏపీ విద్యార్థులు 9552300009 నంబర్ కు వాట్సాప్ మెసేజ్ పంపితే చాలు. వారి పరీక్షా ఫలితాలు వారి మొబైల్ కు వచ్చేస్తాయి.