కలర్స్ కు వ్యాధులకు సంబంధం ఏంటి? టాబ్లెట్స్ వేర్వేరు కలర్స్ లో ఎందుకుంటాయి..?
posted on Mar 1, 2025 @ 9:30AM
ఏదైనా అనారోగ్యం చేసినప్పుడు, నలతగా ఉన్నప్పుడు వైద్యుడిని కలపడం సహజమే. వైద్యులు జబ్బు నయం కావడానికి కొన్ని రకాల టాబ్లెట్స్ రాసి ఇస్తారు. అయితే ఈ టాబ్లెట్స్ అన్నీ ఒకే రంగులో ఉండవు. ఒక్కో రకం టాబ్లెట్ ఒక్కో రంగులో ఉండటం చూడవచ్చు. అసలు టాబ్లెట్స్ ఎందుకు ఇలా వేరువేరు రంగులలో ఉంటాయి? వ్యాధులకు, టాబ్లెట్ల రంగులకు లింక్ ఏంటి? ఇవన్నీ యాదృశ్చికంగా అలా తయారవుతాయా లేక దీని వెనుక ఏదైనా ప్రత్యేక కారణం ఉందా? ఈ విషయాల గురించి తెలుసుకుంటే..
ఎరుపు, నీలం, ఆకుపచ్చ, పసుపు.. ఇలా టాబ్లెట్లు చాలా రకాల రంగులలో ఉంటాయి. టాబ్లెట్లు అన్నీ ఒకే రంగులో ఉంటే వాటిని మింగడానికి ఏదైనా సమస్య ఉంటుందని ఎప్పుడైనా అనిపించిందా? టాబ్లెట్లకు ఉండే రంగు ఎప్పుడైనా మనసును ప్రభావితం చేసిందా? ఇవన్నీ చాలామంది పట్టించుకోరు. కానీ టాబ్లెట్ల తయారీ సంస్థలైన ఫార్మసీ సంస్థలు ప్రణాళికా బద్దంగానే ఇలా మందులను రంగురంగులలో తయారు చేస్తాయని అంటున్నారు.
పేషెంట్లకు జరిగే మేలు..
ఒక రోగి ఒకేసారి ఎక్కువ మందులు తీసుకున్నప్పుడు, వివిధ రంగుల మాత్రలు ఉంటే ఏ టాబ్లెట్ దేనికి వేసుకుంటున్నాం అనే విషయం గుర్తించడానికి సహాయపడుతుంది. అన్ని మాత్రలు ఒకేలా తెల్లగా ఉంటే రోగులకు మందులను గుర్తుంచుకోవడం కష్టం అవుతుంది. ఇది ముఖ్యంగా వృద్ధులకు, దృష్టి లోపం ఉన్నవారికి ఇబ్బంది. అందుకే టాబ్లెట్లు
వైద్యులు, ఫార్మసిస్ట్‌లకు సులభం..
మెడికల్ స్టోర్లలో పనిచేసే వైద్యులు, ఫార్మసిస్ట్‌లు కూడా మందులను త్వరగా గుర్తించడానికి వాటి రంగులపై ఆధారపడతారు. ఇది తప్పు జరిగే అవకాశాన్ని తగ్గిస్తుంది. సరైన ఔషధం రోగికి చేరుతుంది.
ఔషదం ప్రభావం..
చాలా సార్లు కంపెనీలు మందుల రంగును రోగి మనస్సును కూడా ప్రభావితం చేసే విధంగా ఎంచుకుంటాయి. కొన్ని ఉదాహరణలు గమనిస్తే..
నీలం, ఆకుపచ్చ మాత్రలు: సాధారణంగా నొప్పి నివారణ మందులు, ఆందోళన నివారణ, మత్తుమందుల కోసం ఈ రంగులు ఉపయోగిస్తారు ఎందుకంటే ఈ రంగులు మనసుకు ప్రశాంతతను కలిగిస్తాయి.
ఎరుపు, నారింజ మాత్రలు: శక్తిని పెంచేవి లేదా వేగంగా పనిచేసే మాత్రలలో ఈ రంగులు వాడతారు ఎందుకంటే ఈ రంగులు శక్తి, శరీర పనితీరు పెరుగుదలను సూచిస్తాయి.
నలుపు, ముదురు గోధుమ రంగు మాత్రలు: వీటిలో ఐరన్, విటమిన్ సంబంధిత మందులు ఉంటాయి. ఇవి శరీరంలో పోషకాలను పెంచడానికి పనిచేస్తాయి.
సూర్యకాంతి, ఔషధ రక్షణ..
కొన్ని మందులు ఎండలో త్వరగా చెడిపోతాయి. అందుకే కంపెనీలు ఔషధాన్ని సూర్యకాంతి నుండి రక్షించడంలో సహాయపడే రంగులను ఎంచుకుంటాయి. ముదురు రంగు పూత ఔషధ నాణ్యతను ఎక్కువ కాలం పాటు ఉండేలా చేస్తుంది.
రుచి, వాసన..
కొన్ని మందులు చాలా చేదుగా ఉంటాయి, రోగులకు వాటి రుచి నచ్చదు. ఈ రంగు పూత ఔషధాన్ని ఆకర్షణీయంగా కనిపించడమే కాకుండా దాని చేదు రుచిని దాచిపెడుతుంది. దీని వలన రోగులు దానిని మింగడం సులభం అవుతుంది.
పిల్లలను ఆకర్షించడానికి..
పిల్లలకు మందులు ఇవ్వడం చాలా కష్టమైన పని. అందుకే కంపెనీలు చాక్లెట్, స్ట్రాబెర్రీ, నారింజ రుచిగల సిరప్‌లు, రంగురంగుల చూయింగ్ టాబ్లెట్‌లను తయారు చేస్తాయి.
వ్యాధిని బట్టి మందుల రంగులు నిర్ణయించబడతాయా?
సరళంగా చెప్పాలంట, ఔషధం యొక్క రంగు వ్యాధిపై ఆధారపడి ఉండదు. కానీ రోగి మానసిక స్థితి, ఔషధం గుర్తింపు, దాని భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇది నిర్ణయించబడుతుంది. అయితే కొన్నిసార్లు వైద్యులు మానసిక ప్రభావాల కోసం నిర్దిష్ట రంగుల మందులను కూడా రాసిస్తుంటారు.
*రూపశ్రీ.