క్షమాపణ మంచిదే.. కానీ ఎప్పుడూ మీరే క్షమాపణ చెబుతుంటే జరిగేది ఇదే..!
posted on Nov 8, 2024 @ 10:01AM
క్షమాపణ ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధాలను బలపరుస్తుంది. అపార్థాలు తొలగిస్తుంది. ప్రేమ, స్నేహం, కుటుంబ బంధాలు, వైవాహిక జీవితం ఇలా ఏదైనా కావచ్చు. ఇద్దరు వ్యక్తుల మధ్య అపార్థాలు ఏర్పడినప్పుడు ఇద్దరూ ఎడముఖం, పెడముఖం పెట్టుకుని ఉంటారు. కానీ ఇద్దరిలో ఎవరో ఒకరు కాస్త తగ్గి క్షమాపణ చెప్పడం వల్ల ఇద్దరి మధ్య బంధం మళ్లీ చిగురిస్తుంది. బంధం కోసం ఇలా తగ్గడంలో తప్పులేదని పెద్దలు, రిలేషన్షిప్ నిపుణులు కూడా చెబుతారు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య గొడవ జరిగినప్పుడు వారిద్దరిలో ఎవరైతే తమ భాగస్వామిని ఎక్కువగా ప్రేమిస్తుంటారో వారు బంధం కోసం తమ తప్పు లేకపోయినా క్షమాపణ చెప్పేస్తుంటారు. ఇది కూడా బంధం బలపడుతుందని తిరిగి తమ ఇద్దరి జీవితాలు ఒక్కటిగా సాగుతాయనే ఆలోచనతో అలా చేస్తుంటారు. అయితే గొడవ జరిగిన ప్రతి సారి ఒక్కరే ఇలా తగ్గుతూ క్షమాపణ చెప్పడం జరిగితే అది ఖచ్చితంగా తప్పే.. ఎందుకు? అలా క్షమాపణ చెబుతూ ఉండటం వల్ల జరిగే నష్టం ఏంటి? తెలుసుకుంటే..
క్షమాపణ చెబితే నీ తల మీద కిరీటం ఏమైనా పడిపోతుందా.. నీ ఆస్తులేమైనా కరిగిపోతాయా.. ఇలాంటి మాటలు తరచుగా వింటూ ఉంటాం. క్షమాపణ చెప్పడం అనేది ముమ్మాటికి తప్పు కాదు. అది ఒక బంధాన్ని నిలబెట్టే ఆయుధం. అయితే ఎప్పుడూ ఒకరే క్షమాపణ చెబుతూ అది ఆ వ్యక్తి ఆత్మవిశ్వాసాన్ని, ఆ వ్యక్తి విలువను రోజురోజుకూ తగ్గించేస్తుందనే విషయాన్ని మాత్రం గుర్తుంచుకోవాలి.
అసలు క్షమాపణ చెప్పడం తప్పు కాదని చెప్పినప్పుడు.. క్షమాపణ చెప్పడం వల్ల కలిగే ముప్పు ఏమిటో తెలుసుకుంటే..
క్షమాపణ చెప్పడం అన్నివేళలా సరైనది కాదు..
ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు.. తన తప్పును ఆ వ్యక్తి గుర్తించినప్పుడు లేదా తన తప్పు గురించి ఇతరులు చెప్పినప్పుడు.. అది నిజంగా తప్పే అని అనిపిస్తే క్షమాపణ చెప్పడంలో ఎలాంటి సంకోచం పెట్టుకోకూడదు. తను తప్పు చేశానని నిస్సంకోచంగా ఒప్పేసుకోవాలి. తప్పు చేశానని, బాధపెట్టానని చెప్పి క్షమించమని అడగడంలో ఎలాంటి తప్పు లేదు.. కానీ తప్పు లేకపోయినా తప్పు చెబితే అది ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీస్తుంది. విలువను తగ్గిస్తుంది. ముఖ్యంగా ఎదుటివారి దృష్టిలో మర్యాద అనేది లేకుండా పోతుంది. అందుకే తప్పు ఉంటేనే క్షమాపణ చెప్పాలి.
విజయాలు సాధించడం అంటే అది వ్యక్తి అభివృద్దికి సూచన. ఎప్పుడైనా ఏదైనా విజయం సాధించినప్పుడు దాని సందర్భంగా ఎవరికైనా క్షమాపణ చెప్పాల్సి వస్తే అది మంచిది కాదు.. అలా సాధించిన విజయం గురించి ప్రస్తావించి ఇతరులకు క్షమాపణ చెబితే సాధించిన విజయానికి విలువ లేకుండా పోతుంది.
ఏదైనా విషయం గురించి స్నేహితులు, సన్నిహితులు, సహోద్యోగులు, కుటుంబ సభ్యులు మొదలైన వారి ముందు ఆరోగ్యకరమైన చర్చ చేస్తున్నప్పుడు మధ్యలో ఎవరికీ క్షమాపణ చెప్పకూడదు. మాట్లాడే విషయంలో స్పష్టత, నిజం ఉన్నప్పుడు ఏ విషయాన్ని అయినా నిస్సంకోచంగా చెప్పవచ్చు. అలా కాకుండా మధ్యలో క్షమాపణ చెప్పడం, చర్చ నుండి తప్పుకోవడం చేస్తే చర్చలో బలహీన వ్యక్తులుగా పరిగణింపబడతారు.
అభిప్రాయాలను పంచుకునే హక్కు అందరికీ ఉంటుంది . అలాగే ప్రతి ఒక్కరికీ సొంత అభిప్రాయాలు అనేవి ఉంటాయి. అవన్నీ కాకుండా ఇతరులతో సొంత అబిప్రాయాలు చెప్పినప్పుడు వాటి గురించి క్షమాపణ కోరడం కూడా మంచిది కాదు.. అలాగే ఎదుటి వారు తమ అభిప్రాయాన్ని చెబుతున్నప్పుడు వారికి సున్నితంగా క్షమాపణ చెప్పి వారు చెప్పే విషయాన్ని వినకుండా తప్పించుకోవడం కూడా మంచిది కాదు.
ఎవరైనా సహాయం కోసం అర్థిస్తున్నప్పుడు వారికి సారీ చెప్పి తప్పించుకోవడం చాలా తప్పు. అలాగే సహాయం అవసరమైనప్పుడు సారీ చెప్పి బంధాలు పునరుద్దించుకోవడం కూడా తప్పే.. తప్పును కప్పి పుచ్చుకుని ఆ తరువాత ఇలా చేయడం తప్పే..
పదే పదే క్షమాపణ చెప్పడం కొందరికి అలవాటుగా ఉంటుంది. బలహీన మనస్కులు, బంధాల విషయంలో భయపడేవారు.. ఎదుటివారి డ్యామినేషన్ ను భరించలేని వారు.. బంధం తప్పనిసరిగా కోరుకునే వారు.. ప్రేమ రాహిత్యంతో బాధపడేవారు తప్పు లేకపోయినా.. జరిగింది చిన్న తప్పు అయినా, ఎదుటివారి తప్పు ఉన్నా తామే పదే పదే క్షమాపణ చెబుతుంటారు. ఇలాంటి వారిని జోకర్ లు గా భావిస్తారు తప్ప.. వారి మనసును గుర్తించరు. అందుకే ఎవరికీ పదే పదే క్షమాపణ చెప్పకండి.
*రూపశ్రీ.