Read more!

మహాత్మా గాంధీ జీవితాన్ని మార్చిన సంఘటన!

ఓ పదిహేనేళ్ళ కుర్రాడు వ్యసనాలకు అలవాటు పడ్డాడు. అనుకోని పరిస్థితుల్లో ఓ రోజు అన్న చేతి  బంగారాన్ని దొంగిలించాడు. తన అవసరాలను తీర్చుకొని తిరిగి ఇంటికి వచ్చాడు. ఆ రాత్రి నుంచి అతని మనస్సు మనస్సులో లేదు. తప్పు చేశానన్న భావం అతణ్ణి నిలువునా తొలిచివేసింది. జీవితంలో ఎన్నడూ చేయకూడదనుకున్న పని చేశానన్న పశ్చాత్తాపభావం ఆ యువకుణ్ణి కుదురుగా ఉండనీయలేదు. ఇంకెప్పుడూ దొంగతనం చేయకూడదని నిర్ణయించుకున్నాడు.

అయినా మనస్సు శాంతించలేదు. చేసిన తప్పును తండ్రికి చెప్పాలనుకున్నాడు. కాళ్ళపై పడి క్షమించాల్సిందిగా కోరాలనుకున్నాడు. కానీ నోరువిప్పి చెప్పే సాహసం చేయలేకపోయాడు. జరిగిన తప్పంతా చివరకు ఒక చీటీ పై రాశాడు. భవిష్యత్తులో ఇంకెప్పుడూ ఇలాంటి పాపాన్ని చేయనని మాట ఇస్తున్నాననీ, ఎంతటి శిక్షకైనా నేను సిద్ధంగా ఉన్నాననీ వణుకుతున్న అక్షరాలను ఆర్ద్రతతో పేర్చాడు. ఒకానొక సాయంత్రం ఆ ఉత్తరం పట్టుకొని, వ్యాధితో మంచాన పడ్డ తండ్రి వద్దకు వెళ్ళాడు. బాధపడుతూ తలదించుకొని తండ్రి చేతిలో ఆ కాగితం పెట్టాడు.

ఉత్తరమంతా చదివి కన్నతండ్రి కళ్ళు జలపాతాలయ్యాయి. నిమిషం పాటు కళ్ళు మూసుకొని ఏదో ఆలోచించాడు. కొడుకు చేసిన తప్పు కన్నా, దాన్ని స్వచ్ఛందంగా అంగీకరించి, పశ్చాత్తాపం పడుతున్న తీరు ఆ తండ్రి హృదయాన్ని కదిలించింది. తరువాత చీటీని చింపేసి, కొడుకును దగ్గరకు తీసుకొని గుండెలకు హత్తుకొని, ఆనందబాష్పాలు కార్చాడు. తండ్రి పెట్టిన ఆ కన్నీటి క్షమాభిక్షకు కొడుకు కంటికీ మింటికీ రోదించాడు. అలా ఆ కుమారుడి పశ్చాత్తాపం, ఆ తండ్రి పితృవాత్సల్యం భవిష్యత్తులో లోకానికి ఓ మహనీయుణ్ణి అందించాయి. మారిన ఆ యువకుణ్ణి మహాత్మా గాంధీగా తీర్చిదిద్దాయి. పొరపాట్లు చేయనివారు కాదు, పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చి పైకెదిగినవారే మాననీయులని ఋజువు చేశాయి.

 ఎంతటి విజేతలకైనా వారి ప్రస్థానంలో తప్పులు, తడబాట్లు సహజాతిసహజమే. కానీ వారు ఆ పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకున్నారు. వాటినే సోపానాలుగా చేసుకొని పై పైకి నడిచారు. అయితే మనలో చాలామంది తడబాట్లకు కుంగిపోతారు. ప్రపంచమంతా మనల్నే పట్టించుకుంటుందనీ, మన పొరపాట్ల గురించే చర్చించుకుంటుందనీ అనవసరంగా ఆలోచిస్తూ ఆందోళనపడుతూ ఉంటారు. జరిగిన తప్పిదాలను సరిదిద్దుకోవాలే కానీ, వాటినే మనస్సులో తలచుకుంటూ మథనపడకూడదు. నిజానికి ఈ ప్రపంచంలో ఎవరూ పూర్ణపురుషులు కారు! పొరపాటు చేయనివారంటూ ఉండరు. ఎవరో, ఏదో అనుకుంటారని జరిగిన తప్పిదానికి తలుపులు బిగించుకొని కూర్చోవలసిన అవసరం లేదు. మరో ప్రయత్నం చేయకుండా ఉండాల్సిన పని లేదు. అందుకే పరమ కిరాతకంగా జీవించిన అంగుళీమాలుణ్ణి మంచివాడిగా మార్చి ఓదారుస్తూ...

యస్య పాపం కృతం కర్మ కుశలేనపిధీయతే! 

స ఇమం లోకం ప్రభాసయత్యభ్రాన్ముక్త ఇవ చంద్రమా||

'గతంలో చేసిన పాపాన్ని ఎవడైతే పుణ్యం ద్వారా అణగదొక్కుతాడో, అతడు ఆ లోకానికి సన్మార్గాన్ని చూపే జ్యోతి అవుతాడు. కారుమబ్బుల నుంచి బయటకు వచ్చిన పూర్ణచంద్రుని లాంటి వాడవుతాడ'ని బోధిస్తాడు గౌతమ బుద్ధుడు. ఇలా మారడానికి మనస్సు సిద్ధంగా ఉంటే, ఘోరమైన తప్పిదాల నుంచి కూడా కొత్త కొత్త పాఠాలు నేర్చుకుంటూ ఎవరి భవితను వారే నిర్మించుకోగలుగుతారు.


                                   *నిశ్శబ్ద.