ముగ్గురు వ్యక్తులు తోడుంటే చాలు.. జీవితంలో ఎంత కష్టమైనా అధిగమించవచ్చట..!
posted on Jun 27, 2024 @ 9:30AM
జీవితం ఎవరికీ వడ్డించిన విస్తరి కాదు. జీవితమనే విస్తరిలో ప్రతీది సంపాదించుకోవాల్సిందే. ఈ ప్రయత్నంలో కష్టాలనేవి వస్తూనే ఉంటాయి. అయితే కష్టాలకు భయపడటం తెలియని వారికి విజయాలు ఖాయమని చాణక్యుడు చెప్పాడు. చాణిక్యుడు జీవితం గురించి, జీవితంలో ఎన్నో విషయాల గురించి చాలా స్పష్టమైన విషయాలు చెప్పాడు. మనిషి విజయం నుండి అపజయం వరకు.. మనిషి పుట్టుక నుండి మరణం వరకు ప్రభావితం చేసే అంశాలను వివరించాడు. మనిషి గెలిచినా ఓడినా అది మనిషి ఆలోచనపై ఆధారపడి ఉంటుంది. దానిని ఓటమిగా అంగీకరించాలి. కానీ దృఢంగా అనుకుంటే ఓటమికి బదులుగా తప్పకుండా గెలుస్తారు.
మనిషి జీవితంలో మంచి రోజులతో పాటు కష్ట సమయాలు కూడా వస్తాయి. అయితే ఈ కష్టాలను సులభంగా అధిగమించేవాడే నిజమైన యోధుడు. ముగ్గురి సాంగత్యం జీవితంలో అత్యంత ముఖ్యమైనదని, వారితో ఉండటం వల్ల ప్రతి సంక్షోభాన్ని, సమస్యను చిరునవ్వుతో అధిగమిస్తాడని చాణక్యుడు చెప్పాడు. కష్ట సమయాల్లో ఏ వ్యక్తులు తోడుండటం అవసరమో.. చాణక్యుడు ఇలా చెప్పాడు.
తెలివైన జీవిత భాగస్వామి..
సుఖ దుఃఖాలలో నీడలా ఒకరికొకరు అండగా నిలిచే భార్యాభర్తలకు కష్టకాలంలో కూడా ఎలాంటి సమస్యలు ఎదురుకావు. కష్ట సమయాల్లో తెలివైన జీవిత భాగస్వామి తోడు ఉండటం కవచంలా పనిచేస్తుంది. సంస్కారవంతులైన అర్థం చేసుకునే భాగస్వామి సహాయంతో ఖచ్చితంగా విజయం సాధించగలుగుతారు.
సత్ప్రవర్తన కలిగిన పిల్లలు..
పిల్లలే తల్లిదండ్రులకు గొప్ప మద్దతు. మంచిగా ప్రవర్తించే పిల్లవాడు తన తల్లిదండ్రులను ఎప్పుడూ దుఃఖానికి లోను కానివ్వడు. తల్లితండ్రుల ప్రతి చిన్నా, పెద్దా సమస్యలలోనూ, ఆపద వచ్చినప్పుడు చిన్నపాటి బాధ కూడా పడనివ్వకుండా చూసుకునే పిల్లలు చాలా మంది ఉంటారు. అలాంటి పిల్లలు తల్లిదండ్రుల సమస్యలను తామే ముందుండి పరిష్కరిస్తారు.
వ్యక్తి ప్రవర్తన.. పెద్దవారి సాంగత్యం..
ఒక వ్యక్తి ప్రవర్తన, ఇతరులతో అతనెలా నడుచుకుంటాడనే విషయాలు అతని విజయంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మంచి సాంగత్యం ఆకాశమంత ఎత్తును తాకడానికి అడుగడుగునా స్ఫూర్తినిస్తుంటే, చెడ్డవారి సాంగత్యం మేధస్సును పాడుచేసి వినాశనపు అంచుకు తీసుకువస్తుంది. పెద్దమనుషుల సహవాసంలో జీవించడం ద్వారా జీవితం ఆనందంతో గడిచిపోతుంది. ఆ ఇంటికి బోలెడు సంతోషాన్ని చేకూరుస్తుంది.
*నిశ్శబ్ద.