మరో వివాదంలో సిద్ధూ..!
posted on Apr 19, 2016 @ 1:37PM
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకి టైం అస్సలు బాగున్నట్టు లేదు. ఆయన ఏది పట్టుకున్నా రివర్స్ అవుతోంది. వాచీ, ఏసీబీ, కొడుకు కంపెనీకి లబ్థి.. ఇలా వరుస వివాదాలతో సతమతమవుతున్న సిద్దూ తనకు తెలియకుండానే పరోక్షంగా వివాదాన్ని కొని తెచ్చుకున్నారు. అసలు మ్యాటరేంటంటే కరువుతో అల్లాడుతున్న ఉత్తర కర్ణాటకని సీఎం సందర్శించాలని నిర్ణయించుకున్నారు. ముఖ్యమంత్రి వస్తున్నారంటే ఆ హాడావుడి మామూలుగా ఉండదు. సీఎం ప్రయాణించే మార్గంలో భద్రతా చర్యలు ఇలా ప్రతి దానిలోనూ హాడావుడే. అలాగే సీఎం కాన్వాయ్ ముందు దుమ్ము, ధూళి లేవకుండా ఉండేందుకు ట్యాంకర్లతో నీటిని పోశారు అధికారులు. దీనిపై ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. నీటి కొరతతో ప్రజలు అల్లాడుతుంటే..ముఖ్యమంత్రి మాత్రం నీటిని దర్జాగా దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు.