వరంగల్ ఉపఎన్నిక... గెలుపు అధికారపక్షందేనా?
posted on Nov 17, 2015 @ 10:34AM
వరంగల్ ఉపఎన్నికల్లో ఎవరి వ్యూహాలు వారికి ఉన్నాయి. ప్రతిపక్షాలను విమర్శిస్తూ ఎవరి ప్రచారంలో వారు బిజీగా ఉన్నారు. అంతా బానే ఉన్నా ఎంతో ఆసక్తి రేపుతున్న ఈ వరంగల్ ఉపఎన్నికలో ఎవరు గెలుస్తారన్నది ప్రధాన చర్చ. అయితే దీనికి సంబంధించి ఎవరి సర్వేలు వారికి ఉన్నా.. ఫలితాలపై మాత్రం అటు మీడియా పరంగా కాని.. వివిధ పార్టీల పరంగా కాని తీసుకుంటే రెండింటిలోనూ ఒక విషయం మాత్రం స్ఫష్టంగా అర్ధమవుతోంది. అదేంటంటే తుది ఫలితం తెలంగాణ అధికారపక్షానికి సానుకూలంగా ఉన్నాయన్న మాట వినిపిస్తోంది. వరంగల్ ఉప ఎన్నికల్లో తెలంగాణ అధికారపక్షం గెలుపు ఖాయమంటున్నారు. తక్కువలో తక్కువ వేసుకుంటే.. 3.5లక్షల మెజార్టీ ఖాయమన్న మాట వినిపిస్తోంది. అయితే.. ఈ మధ్య టీఆర్ఎస్ కు కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిసిన విషయమే. అందరూ కాకపోయినా కొంతమంది మాత్రం టీఆర్ఎస్ పాలనపై అసంతృప్తిగానే ఉన్నారు. దీంతో మునుపటి కంటే మెజార్టీ కాస్త తగ్గొచ్చు అంటున్నారు.
కాగా వరంగల్ ఉపఎన్నికల్లో.. ఏడు నియోజక వర్గాల్లో రెండు నియోజక వర్గాల నుండి టీఆర్ఎస్ కు ఎటువంటి ఢోకా లేదని.. ఇక్కడి నుండే ఎక్కువ మెజార్టీ వస్తుందని.. ఇంకో రెండు నియోజక వర్గాల్లో కాస్త అటు ఇటుగా రావచ్చని.. ఇక మిగిలిన మూడు నియోజక వర్గాల్లో మాత్రం కాస్త ఇబ్బందికర పరిస్థితే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే గత సార్వత్రిక ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ ఇప్పుడు టీఆర్ఎస్ కు రాకపోవడం. మరి ఈ సర్వే ఎంతవరకూ నిజమో తెలియాలంటే ఎన్నికలు అవ్వాల్సిందే.. ఫలితాల వచ్చేంత వరకూ ఆగాల్సిందే.