వరంగల్ ఉపఎన్నిక.. బీజేపీ-టీడీపీ అభ్యర్ధిపై అసంతృప్తి?
posted on Nov 6, 2015 @ 4:08PM
వరంగల్ ఉపఎన్నిక నేపథ్యంలో బీజేపీ-టీడీపీ తరుపున దేవయ్య ను రంగలోకి దించుతున్న సంగతి తెలిసిందే. కానీ ఈ విషయంలో మాత్రం బీజేపీపై ఆపార్టీలో ఉన్న పలువురు నేతలే అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ముందు ఈ ఎన్నికకు టీడీపీ-బీజేపీ నేతలు మేమంటే మేము అని పోటీ పడినా మిత్రపక్షం ఉంది కాబట్టి.. టీడీపీ ఆ అవకాశం బీజేపీకే ఇచ్చింది. అయితే ఈ విషయంలో నెగ్గిన బీజేపీ మాత్రం.. బరిలో సరైన అభ్యర్ధిని ఎంపిక చేసే విషయంలో మాత్రం విఫలమైందని అనుకుంటున్నారు. పోటీకి ఎవరూ దొరకనట్టు ఎక్కడో అమెరికాలో ఉంటున్న ఎన్ఆర్ఐకు టికెట్ ఇవ్వడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అంతేకాదు టీడీపీ కూడా ఈ విషయంలో అసంతృప్తిగానే ఉన్నట్టు తెలుస్తోంది. అసలే తమకు రావాల్సిన సీటు బీజేపీ కి రావడంతో అసంతృప్తితో ఉన్న నేతలు.. ఏదో పైకి తాము అభ్యర్ధి పోటీకి కృషి చేస్తామని చెప్పినా.. బీజేపీ సరైన నాయకుడిని ఎంచుకోవడంలో పొరపాటు చేసిందని.. ఆ నాయకుడి కోసం ఎంత ప్రచారం చేసినా దండగే అని భావిస్తున్నారంట. అంతేకాదు ఆ స్థానంలో ఇంకా బలమైన నాయకుడికి అవకాశం ఇచ్చినట్టయితే టీఆర్ఎస్ కు గట్టి పోటి ఉండేదని భావిస్తున్నారు. మొత్తానికి బీజేపీ అత్యుత్సాహం వల్ల లేనిపోని ఇబ్బందులు తెచ్చుకునేలా ఉంది.