బీజేపీపై వైసీపీ ఎదురుదాడి వ్యూహం.. వారిని లక్ష్యంగా చేసుకుని...
posted on Apr 20, 2020 @ 3:15PM
ఏపీలో కరోనా వైరస్ కిట్ల వ్యవహారం బీజేపీ వర్సెస్ వైసీపీగా మారిపోయింది. కరోనా వైరస్ టెస్టింగ్ కు వాడే కొరియా ర్యాపిడ్ కిట్ల కొనుగోళ్లలో భారీగా డబ్బు చేతులు మారిందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో వైసీపీ నేత విజయసాయి రెడ్డి ఎదురుదాడి వ్యూహాన్ని ఎంచుకున్నారు. అదీ బీజేపీలో టీడీపీ నుంచి వచ్చిన నేతలను లక్ష్యంగా చేసుకుని. దీంతో కరోనా వైరస్ టెస్టింగ్ కిట్ల వ్యవహారం కాస్తా వాస్తవాలని దాటి ఫక్తు రాజకీయ కోణంలోకి మారిపోయింది. కొరియా కిట్ల ధరల్లో వ్యత్యాసం ఉందంటూ బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చేసిన ఆరోపణలు వైసీపీకి మింగుడు పడలేదు. వీటిపై వివరణ ఇచ్చేందుకు ప్రభుత్వంలోని ముఖ్య నేతలంతా రంగంలోకి దిగాల్సిన పరిస్ధితి.
అయితే కొరియా కిట్లను అడ్డుపెట్టుకుని తమను టార్గెట్ చేస్తున్న బీజేపీ నేత కన్నా లక్ష్మీ నారాయణ విషయంలో ఎలా స్పందించాలా అని ఆలోచించిన వైసీపీ చివరకు విభజించు పాలించు సిద్ధాంతాన్నే ఎంచుకుంది. ఎలాగో బీజేపీలో ఎప్పటి నుంచో ఉన్న నేతలకూ, టీడీపీ నుంచి వచ్చిన నేతలకూ మధ్య అభిప్రాయ భేదాలున్నాయి. వీటినే టార్గెట్ చేసుకుని ఎదురుదాడి మొదలుపెట్టాలని భావించిన వైసీపీ వ్యూహాత్మకంగా విజయసాయిరెడ్డితో విమర్శలు చేయించడం మొదలుపెట్టింది. ఏపీ బీజేపీ నేతలు ప్రశ్నిస్తే తాను సమాధానం చెబుతాను కానీ టీజేపీ నేతలు అంటే టీడీపీ నుంచి వచ్చిన బీజేపీ నేతలు ప్రశ్నిస్తే తాను సమాధానం చెప్పబోనంటూ విజయసాయిరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే కాషాయ పార్టీలో విభేధాలను వాడుకోవాలని భావిస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే ఈ విషయంలో విజయసాయి ట్రాప్ లో పడకూడదని భావిస్తున్న కన్నా లక్ష్మీనారాయణ అవినీతి కేసుల వ్యవహారాన్ని ప్రస్తావిస్తున్నారు. ఆ విధంగా చూసినా బీజేపీ నేతలను విజయవంతంగా దారి మళ్లించామని వైసీపీ సంబరపడుతోంది.