వివేకా వీలునామా?..ఆమె ఎక్కడ?
posted on Apr 20, 2023 @ 4:29PM
వైఎస్ కుటుంబం ఇదివరకెన్నడూ ఊహించని ఎదురుదెబ్బలు ఎదుర్కొంటోంది. 2009 సెప్టెంబర్ 2వ తేదీన హెలికాప్టర్ ప్రమాదంలో రాజశేఖరరెడ్డి మరణంతో వైఎస్ కుటుంబానికి కష్టాలు మొదలయ్యాయి. అప్పటి వరకూ ఏం చేసిన ఎవరూ అడగలేదు, అడిగినా వైఎష్ కుటుంబం సమాధానం చెప్పలేదు కూడా. రాజకీయంగా ఒక్క చంద్రబాబు తప్ప మరొ ఎదురు లేకుండా సాగింది వైఎస్ కుటుంబం హవా. 2009 తరువాత వైఎస్ కుటుంబానికి కాంగ్రెస్ చేయి ఇవ్వడంతో సొంత కుంపటితప్పలేదు. వైఎస్ కుటుంబం అంత వరకూ చేసిన తప్పులే వారిని కాంగ్రెస్ కు దూరం చేశాయని అప్పట్లో చెప్పుకున్నారు. ఇంతలో జగన్ కొత్త పార్టీ పెట్టడం, ఆయనపై సీబీఐ కేసులు, తదననంతరం జైలు జీవితం వైఎస్ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టినా పాఠాలు నేర్పించాయి.
2019లో జగన్ అత్యధిక మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అధికారం చేపట్టిన తరువాత మళ్లీ పాత గాయాలు ఇబ్బంది పెడుతూ వచ్చాయి. వివేకా హత్య కేసు వైఎస్ కుటుంబంలో చీలిక తెచ్చిందని కడప వాసులు అంటున్నారు. ఆ కేసులో పీకల్లోతు కూరుకుపోయిన వైఎస్ కుటుంబం తాజాగా వివేకా రెండో వివాహాన్ని తెరపైకి తెచ్చింది. షేక్ షమీమ్ అనే మహిళతో వివేకాకు సంబంధం ఉందంటూ ఓ ఫొటో జోరుగా ప్రచారంలో ఉంది. ఏప్రిల్ 24న తెలంగాణ హైకోర్టులో సునీతపై కేసు వేయబోతున్నట్లు ఒక వాస్త సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. తనవాటా, తన కుమారుడివాటాను తేల్చాల్సిందిగా షమీమ్ అనే మహిళ పేరుతో ఈ వార్త బయటకు వచ్చింది.
దీంతో వివేకా స్త్రీ లోలుడడని ప్రపంచానికి చెప్పడమే కాక, వారి ఆస్తిని అనుభవిస్తూ డాక్టర్ సునీత తన పిన్నికి, తమ్ముడికి అన్యాయం చేస్తోందని ఈ వార్త సారాంశం. హత్యకు ముందే వివేకాతన అస్తులపై వీలునామా రాశారనీ, అందులో రెండవ భార్యకు, కొడుకుకు వాటాలు స్పష్టంగాఉన్నాయనీ ప్రచారం జరుగుతోంది.
కానీ ఈ ప్రయత్నంతో సునీతకు వచ్చే నష్టం ఏమీ లేదని న్యాయ విశ్లేషకులు చెబుతున్నారు. వివేకా హత్య కేసు పరిశోధనకు షమీమ్ అనే మహిళ ఆరోపణలకు సంబంధం లేదనేది లాయర్ల వాదన. వివేకా హత్య జరిగి నాలుగేళ్లయితే ఇంత వరకూ షమీమ్ ఎందుకు తెరమీదకు రాలేదని ప్రశ్నించే వారూ లేకపోలేదు. వివేకాకు మరో కుటుంబం ఉందన్న ప్రచారం ఇప్పుడున్నపరిస్థితులలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి ఏ మాత్రం ఉపయోగపడదు. ఆస్తుల పంపకాల వివాదానికి హత్య కేసుకు సంబంధం లేదన్న లాజిక్ అందరికీ అర్ధమయ్యింది.
ఇలా ఉండగా కడప ప్రకాష్ నగర్ లో నివసించే షేక్ షమీమ్ ను వైఎస్ అవినాష్ రెడ్డి అనుయాయులు హైదరాబాద్ తరలించారు. సునీతను ఇబ్బంది పెట్టేందుకు షమీమ్ ను పావుగా వాడబోతున్నారన్నది విశ్వసనీయమైన సమాచారం. ప్రస్తుతం హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవైఎస్ అవినాష్ రెడ్డి ఇంట్లో షమీమ్ ప్రస్తుతం ఉందని ఆమె బంధువులు చెప్పడం కొసమెరుపు.