వివేకా హత్య కేసు తెలంగాణకు బదలీ.. ఉత్తర్వులు జారీ చేసిన సుప్రీం కోర్టు
posted on Nov 29, 2022 @ 11:02AM
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు తెలంగాణకు బదిలీ అయ్యింది. ఈ మేరకు సుప్రీం కోర్టు మంగళవారం (నవంబర్ 29)ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు విచారణ ఇప్పటి వరకూ ఏపీలో కడప, పులివెందుల కోర్టులతో పాటు హైకోర్టు కూడా పర్యవేక్షిస్తోంది. అయితే ఈ కేసులో సాక్షులతో పాటు అప్రూవర్ గా మారిన దస్తగిరికి కూడా ఏపీలో భద్రత లేకుండా పోయింది. వీరు పలుమార్లు ఇదే విషయాన్ని బహిరంగంగానే చెప్పారు.
అలాగే సీబీఐ దర్యాప్తునకు కూడా అగుడడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఏకంగా సీబీఐ అదికారులపైనే కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో ఉన్న ఈ కేసు దర్యాప్తును ఇకపై తెలంగాణలోని సీబీఐ ప్రత్యేక కోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో జగన్ అక్రమాస్తుల కేసు తరహాలోనే సీబీఐ ప్రత్యేక కోర్టులో వివూరా హత్య కేసు విచారణ జరగ నుంది. ఇప్పటివరకూ ఏపీలో సాగుతున్న వివేకా హత్య కేసు దర్యాప్తుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ హతుడి కుమార్తె సునీతారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి విదితమే.
స్థానిక ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వివేకా హత్య కేసు దర్యాప్తులో జోక్యం చేసుకుంటున్నారని, ఏపీలో నిష్పక్షపాత విచారణ జరుగుతున్న నమ్మకం లేదని, కేసు విచారణ బయట రాష్ట్రాలకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టును సునీతా రెడ్డి కోరగా, ఈ కేసు విచారిస్తున్న సీబీఐ కూడా సునీత చెప్పిన ప్రతి విషయం అక్షర సత్యమని సుప్రీం కోర్టుకు తెలియజేసిన సంగతి విదితమే. దీంతో సుప్రీం కోర్టు వివేకా హత్య కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదలీ చేయడానికి అంగీకరించింది.
తన తండ్రి మరణం వెనుక ఎవరున్నారో తేలాల్సిందే అంటూ మొక్కవోని దీక్షతో అలుపెరగని న్యాయపోరాటం చేసిన వివేకా కుమార్తె సునీత ఈ కేసు వెనుక ఉన్న సూత్రధారులు, పాత్ర ధారులకు శిక్ష పడాలంటే ఈ కేసు దర్యాప్తు పారదర్శకంగా, నిష్పాక్షికంగా జరగాలని, ఏపీలో అటువంటి పరిస్థితులు లేవనీ డాక్టర్ సునీత పేర్కొన్నారు. విపక్షంలో ఉండగా తన బాబాయ్ హత్య కేసు సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేసిన జగన్.. రాష్ట్ర సీఎం అయిన తరువాత మాత్రం సీబీఐ దర్యాప్తు అవసరం లేదని కోర్టుకు చెప్పారు.
అయితే సునీత మాత్రం తన తండ్రి హత్య కేసుపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేసి సాధించారు. ఆ తరువాత సీబీఐ దర్యాప్తునకు ఏపీలో అడుగడుగునా అడ్డంకులు ఏర్పడుతున్నాయని పేర్కొంటూ కేసు విచారణ రాష్ట్రం బయట..అంటే వేరే రాష్ట్రంలో జరగాలని సుప్రీంను ఆశ్రయించారు. అందుకు సుప్రీం అంగీకరించింది. ఆ మేరకు ఈ కేసును తెలంగాణకు బదలీ చేస్తూ సుప్రీం కోర్టు మంగళవారం (నవంబర్ 29) ఉత్తర్వులు జారీ చేసింది.