తెలుగువారి ఉక్కు సంకల్పం.. విశాఖ ఉక్కు
posted on Apr 13, 2023 @ 4:50PM
విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అనే నినాదం పుట్టి ఇప్పటికి 50 ఏళ్లు. ప్రస్తుత పరిణామాలు అందరికీ తెలిసినా 50 ఏళ్ల కిందటి విషయాలు కొందరికే తెలుసు. అసలు విశాఖ ఉక్కు వెనుక కథ ఎన్ని మలుపులు తిరిగిందో తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. అది 1963 సంవత్సరం సంగతి. అంగ్లో అమెరికన్ కన్సార్టియమ్ విశాఖలో ఓ భారీ పరిశ్రమకు అవకాశాలు మెండుగా ఉన్నాయని నివేదిక తయారు చేసి కేంద్రం ముందు ఉంచింది.
విశాఖలో నైకా కేంద్రం ఉండటం ఒక కారణమైతే.. ఉత్తరాంధ్ర వెనుకబాటు ఇంకో కారణం. ఇక్కడ ఉపాధి అవకాశాలు పెంచడం ఆ నివేదిక ఉద్దేశం. అనేక సమావేశాల తరువాత విశాఖలో ఉక్కు కర్మాగారం స్థాపనకు కన్సార్టియం మొగ్గు చూపింది. ఈ ప్రతిపాదనపై 1965 జులై 3న భారత పార్లమెంటులో చర్చ జరిగింది. 1966 జులై నెలలో కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం విశాఖ ఉక్కు ప్రతిపాదనపై ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. అయితే అసెంబ్లీతీర్మానంపై తిరిగి పార్లమెంటులో జరిగిన చర్చలో అప్పటి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ప్లాంట్ స్థాపన సాధ్యం కాదని ప్రధాని ఇందిగా గాంధీ ప్రకటించారు.
ప్రధాని ప్రకటనతో ఆంధ్రప్రదేశ్ భగ్గుమంది. రాష్ట్రం నలుమూలలా ఆందోళనలు ప్రారంభం అయ్యాయి. తెన్నేటి విశ్వనాథం, పుచ్చలపల్లి సుందరయ్య, గౌతు లచ్చన్న, చండ్ర రాజేశ్వరరావు, నల్లమల గిరిప్రసాద్, తరిమెల నాగిరెడ్డి, వావిలాల గోపాలకృష్ణయ్య లాంటి మహామహులు ఆందోళనలకు నాయకత్వం వహించారు. ప్రజలు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినదించారు. ఆందోళనకారులపై తుపాకులు గర్జించాయి.
పోలీసుల తూటాలకు 32 ప్రాణాలు నేలకొరిగాయి. విజయవాడ, గుంటూరులలో ఐదుగురు చొప్పున మరణించగా, విజయనగరంలో ఇద్దరు, కాకినాడ, వరంగల్, రాజమండ్రి, సీలేరు, పలాస, జగిత్యాలల్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 32 మంది ప్రాణాలు వదిలారు. అక్టోబర్ 15, 1966న అమృతరావు ఆమరణ నిరాహార దీక్ తో ఆందోళనలు తారస్థాయికి చేరాయి.
దీంతో ఇందిరాగాంధీ ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. 21 రోజుల దీక్ష తరువాత విశాఖ ఉక్కుకు ఇందిర ఆమోదించారు. దీంతో తెలుగు ప్రజలు కలలు గన్న విశాఖ ఉక్కుకు 1971 జనవరి20న ఇందిరా గాంధీ శంకుస్థాపన చేశారు. ప్లాంట్ నిర్మాణంలో అప్పటి రష్యా సాంకేతికతను వినియోగించారు. ఇంత చరిత్రకలిగిన విశాఖ ప్లాంట్ కు కురుపాం రాజవంశీయులు ఆరువేల ఎకరాల స్థలాన్ని విరాళంగా ఇవ్వడం అప్పటి పాలక వర్గాల పెద్ద మనసుకు నిదర్శనం. తదనంతర పరిణామాలలో 1992లో విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రధాని పీవీ నరసింహరావు జాతియిక అంకితం చేశారు.