Read more!

మేనత్త హఠాత్ ఎంట్రీ కారణమేంటి?

సెంటిమెంట్.. ఇది ఎంత ప్రభావమంతమో.. గత ఎన్నికలలో ఆ సెంటిమెంట్ ను అడ్డుపెట్టుకుని గెలిచిన జగన్ కంటే ఎక్కువగా ఇంకెవరికీ తెలిసే అవకాశం లేదు. అందుకే పులివెందుల గడ్డపై సొంత చెల్లెలు షర్మిల, చిన్నాన్న కూతురు సునీత  ప్రచారం, సంధిస్తున్న విమర్శలు, వివేకా హత్యను ప్రస్తావిస్తూ ప్రజలకు చేస్తున్న వేడికోలు జగన్ ను ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. పులివెందులలో షర్మిల, సునీతల ప్రచారం జగన్ కు ఓటమిని ముందే చూపించేస్తోందా అన్న అనుమానం కలిగిస్తున్నాయి ఆయన పార్టీ నేతలూ, క్యాడర్ చేస్తున్న హడావుడీ, పడుతున్న కంగారూ చూస్తుంటే. షర్మిల ప్రచారం సమయంలో  విద్యుత్ కట్ అవ్వడం, షర్మిలను అడ్డుకోవడానికి వైసీపీ మూకలు చేసిన విశ్వయత్నం జగన్ లో నెలకొన్న భయాన్నే ఎత్తి చూపాయి. ఇక వైసీపీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా దాడికి తెగబడేంత హడావుడి చేసినా షర్మిల ఎక్కడా తగ్గలే.  

షర్మిల ప్రచారంతో పులివెందులలో జగన్ కు ముచ్చెమటలు పడుతున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నాయి. రోజు రోజుకూ పదునెక్కుతున్న షర్మిల మాటలకు సెంటిమెంట్  కూడా జోడించి షర్మిల పులివెందుల ప్రజల మనస్సులను గెలుచుకుంటున్నారన్న భయం జగన్ లో ఏర్పడింది.  మీ వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి బిడ్డ‌… మీ వైఎస్ వివేకానంద రెడ్డి బిడ్డ‌తో క‌లిసి వ‌చ్చి  అర్ధిస్తోంది. ఆడ‌బిడ్డ‌గా కొంగుచాపి అడుగుతోంది. ఈ ఎన్నిక‌ల్లో హంత‌కుల‌ను ఓడించి, ష‌ర్మిల‌కు ఓటేయ్యండి అంటూ ఆమె చేసిన అప్పీల్ జగన్ లో గుండె గాభరా కలిగించిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగన్ లో భయం పెచ్చరిల్లడంతోనే హడావుడిగా మేనత్త విమల్మను రంగంలోకి దింపారంటున్నారు. ఆమె మేనత్తగా  పెద్ద రికాన్ని ప్రదర్శిస్తూ.. తాను వైఎస్ కుటుంబ ఆడపడుచుగా చెబుతున్నాను అంటూ షర్మిల, సునీతలకు సుద్దులు చెప్పారు. కుటుంబాన్ని పలుచన చేయవద్దని మందలించారు.  ప్ర‌త్య‌ర్థుల చేతుల్లోకి వెళ్లి చేస్తున్నవిమర్శలు కట్టిపెట్టి నోరు మూసుకోండంటూ హెచ్చరించారు.  

జ‌గ‌న్, అవినాష్ కు అండ‌గా ఉండాల‌ని పులివెందుల, కడప ప్రజలకు పిలుపునిచ్చారు. వాస్తవానికి షర్మిల కుటుంబ ప్రతిష్ఠకు భంగం వాటిల్లేలా వ్యవహరిస్తున్నారని భావిస్తే ఆ విషయం తల్లి విజయమ్మ చెప్పాలి. అలాగే సునీతను మందలిస్తే ఆమె  తల్లి సౌభాగ్యమ్మ మందలించాలి. కానీ వారిద్దరూ కూడా తమ కూతుళ్లకే మద్దతుగా ఉన్నారు. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహమూ లేదు. ఎందుకంటే నిన్నటి వరకూ షర్మిలతోనే ఉన్న విజయమ్మ.. ఇప్పుడు హఠాత్తుగా అమెరికా వెళ్లిపోయారంటే.. అది జగన్ ఒత్తిడి వల్లేనని ఆ కుటుంబ సన్నిహితులే చెబుతున్నారు. జగన్ తరఫున ప్రచారం చేయడానికి ఇష్టపడక, షర్మిలకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడడానికి మనస్కరించక ఆమె రాష్ట్రానికి దూరంగా విదేశాలకు వెళ్లారు. ఆ వెళ్లడం కూడా షర్మిల కుమారుడి వద్దకే వెళ్లారు. దీనిని బట్టే విజయమ్మ మద్దతు ఎవరికో అర్ధం అవుతుంది. ఇక సౌభాగ్యమ్మ అయితే షర్మిల, సునీతలకు అండగా ఉన్నారు. తన భర్త హత్యలో అవినాష్ ప్రమేయం ఉందని ఆమె మీడియా ఎదుటే కుండబద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు విమలమ్మ మేనకోడళ్లకు సుద్దులు చెప్పడం విషయానికి వస్తే..  విమలమ్మ తొలి నుంచీ జగన్ కు మద్దతుగానే నిలిచారు.

 క్రైస్తవ మత బోధకురాలిగా ఆమె ఏపీలో విస్తృతంగా పర్యటించి పాస్టర్లతో సమావేశాలు ఏర్పాటు చేసి జగన్ కు మద్దతు కూడగట్టడానికి శతధా ప్రయత్నించారు.  ఆ క్రమంలో ఆమె విఫలమయ్యారు. కాకినాడలో అయితే పలువురు ఫాదర్లు ఆమెకు ఎదురుతిరగడంతో దొడ్డి దారిన వెళ్లిపోయారు.  ఆ తరువాత ఆమె పెద్దగా బయటకు వచ్చి మాట్లాడిన దాఖలాలు లేవు. ఇప్పుడు మళ్లీ మేనగోడళ్లను జగన్ తరఫున మందలించడానికి వచ్చారు. 

వైఎస్ కుటుంబం అంతా జగన్ కు వ్యతిరేకంగా ఉన్నా విమలమ్మ మాత్రం జగన్ తో జగన్ కు మద్దతుగా నిలవడానికి కారణమేమిటో షర్మిల బయటపెట్టారు.  జగన్మాయలో పడి వైఎస్ వివేకా తన సొంత అన్న అన్న విషయాన్ని మేనత్త విమలమ్మ మరచిపోయినట్లున్నారని ఎద్దేవా చేశారు. సొంత అన్న వైఎస్ వివేకానందరెడ్డిని  కిరాతకంగా హత్య చేసిన వారి పక్షాన విమలమ్మ నిలవడానికి కారణం ఆమె కుమారుడికి జగన్ వర్క్స్ ఇవ్వడమేనని షర్మిల కుండబద్దలు కొట్టారు. వివేకా హత్య విషయంలో తామేమీ ఆధారాలు లేకుండా మాట్లాడడంలేదని, తాము ఆరోపణలు చేయడం లేదనీ చెప్పిన షర్మిల  సీబీఐ చూపిన ఆధారాలనే తాము చెబుతున్నామన్నారు. హత్యా రాజకీయాలకు వ్యతిరేకంగా గళమెత్తుతున్నామని చెప్పారు.   ఇకనైనా విమలమ్మ వాస్తవాలు తెలుసుకుని మసలుకోవాలన్నారు. సొంత అన్నను కిరాతకంగా హత్య చేసిన వాళ్ల తరఫున మాట్లాడటం మానుకోవాలని హితవు చెప్పారు.  మేనత్తను రంగంలోకి దించి షర్మిల, సునీతలను నిలువరించాలన్న జగన్ యత్నం షర్మిల స్ట్రాంగ్ కౌంటర్ తో విఫలమైందని పరిశీలకులు అంటున్నారు.