ఎన్నికల్లో కులాల కుమ్ములాట.. కొంప ముంచిన పేపర్ టైగర్స్?
posted on Mar 15, 2021 @ 2:06PM
కృష్ణా జిల్లా తెలుగు దేశం పార్టీకి కంచుకోట. తెలుగు దేశం పార్టీ ఆవిర్భావం నుంచి విజయవాడ ఆ పార్టీకి ఆయువుపట్టులా నిలిచింది. టీడీపీ వ్యవస్థాపకులు, నందమూరి తారకరామారావు సొంత జిల్లా కావడంతో... టీడీపీకి ఈ జిల్లాలో ఎదురులేకుండా పోయింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రమంతా వైసీపీ హవా వీచినా.. విజయవాడ ఎంపీతో పాటు రెండు అసెంబ్లీ సీట్లను టీడీపీ గెలుచుకుంది. అలాంటి చోట ఇప్పుడు టీడీపీ గతంలో ఎప్పుడు లేనంతగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. రాజధాని అమరావతి సెంటిమెంట్ ఉన్నా.. మున్సిపల్ ఎన్నికల్లో కృష్ణా జిల్లాలో కనీసం ఖాతా తెరవలేకపోయింది టీడీపీ. ఖచ్చితంగా గెలుస్తామని భావించిన విజయవాడ కార్పొరేషన్ ను వైసీపీ కైవసం చేసుకోవడం తమ్ముళ్లను కలవరపరుస్తోంది. విజయవాడలో పార్టీ ఓటమికి.. నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలే కారణమని టీడీపీ కార్యకర్తలు భగ్గుమంటున్నారు. ఎంపీ కేశినేని నానిని వ్యతిరేకంగా గ్రూప్ నడుపుతున్న ముగ్గురు నేతల వల్లే పార్టీ ఓడిపోయిందని ఆరోపిస్తున్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో విజయవాడ అత్యంత కీలకంగా మారింది. అమరావతి రాజధాని నినాదానికి ఇది రెఫరెండం అనే చర్చ జరిగింది. అందుకే వైసీపీ.. విజయవాడపై స్పెషల్ ఫోకస్ చేసింది. జిల్లా ఇన్‌చార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రభుత్వ సలహాదారుల సజ్జల రామకృష్ణారెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. అమరావతి రాజధానిగా కొనసాగడానికి ప్రజల మద్దతు లేదని నిరూపించడంతోపాటు, మూడు రాజధానులకు ప్రజల మద్దతు ఉందని నిరూపించుకునేందుకు విజయవాడలో గెలిచి తీరాలని డిసైడయ్యారు. అంతర్గత విభేదాలను పక్కనపెట్టి వైసీపీ నేతలంతా ఏకమయ్యారు. వార్డు వలంటీర్లను సమర్ధంగా ఉపయోగించుకుని వైసీపీకి ఓటేయకపోతే సంక్షేమ పథకాలను నిలిపివేస్తామన్న సంకేతాలను ప్రజల్లోకి పంపారు. కేటాయించిన ఇంటి స్థలం కూడా వెనక్కి వెళ్లిపోతుందని బెదిరించారు. డబ్బులు విచ్చలవిడిగా వెదజల్లారు. జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు తమ శక్తియుక్తులన్నింటినీ అభ్యర్థుల గెలుపుపై కేంద్రీకృతం చేశారు.
అత్యంత కీలకమైన విజయవాడలో గెలుపు కోసం వైసీపీ నేతలంతా ఏకమయితే.. విజయవాడ తెలుగు తమ్ముళ్లు మాత్రం రోడ్డున పడ్డారు. పార్టీ లైన్ తప్పి తెలుగు తన్నులాటకు దిగారు. కేశినేని నాని ఒకవైపు.. బొండా ఉమా, బుద్దా వెంకన్న, నాగూల్‌మీరాలు మరోవైపు. కేశినేని కూతురు శ్వేతను బెజవాడ మేయర్ అభ్యర్థిగా ఎంపిక చేయడంపై రగిలిపోయిన ముగ్గురు నేతలు.. బొండా ఉమా ఇంట్లో మీటింగ్ పెట్టుకొని.. కేశినేనిపై కస్సుమన్నారు. తమ పార్టీ నేతనే నోటికొచ్చినట్టు చెడామడా తిట్టేశారు. ఆధిపత్య పోరును కాస్తా, కులాల కుమ్ములాటలుగా మార్చేశారు. రంగా హత్య కేసులో ముద్దాయిని ఎన్నికల ప్రచారంలో తిప్పుతుంటున్నావంటూ నానిపై చిందులు తొక్కారు అసంతృప్త నేతలు. టీడీపీకి బీసీలను దూరం చేసే ప్రయత్నం చేస్తున్నాడంటూ నానిపై మండిపడ్డారు. కేశినేని కావాలా? అందరూ కావాలా? అంటూ చంద్రబాబుకే అల్టిమేటం ఇచ్చారు. తన కూతురుని మేయర్ చేయడం కోసం కేశినేని నాని. కులాల మధ్య, పార్టీ నేతల మధ్య చిచ్చు పెడుతున్నారన్నారు.
తెలుగుదేశంలో అంతర్గత పోరు రచ్చకెక్కడం కార్యకర్తలతోపాటు ఓటర్లపైనా ప్రభావం చూపింది. ఎన్నికలకు నాలుగైదు రోజుల ముందు ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, బొండా ఉమ, నాగుల్ మీరా రోడ్డుకెక్కడం పార్టీ గెలుపుపై ప్రభావం చూపింది. పశ్చిమలో బీసీ అభ్యర్థులకు బీఫాం ఇచ్చిన తర్వాత వారిని కాదని ఓసీ అభ్యర్థులను పెట్టడంపై ఎంపీ నానిని బుద్దా బహిరంగంగానే విమర్శించారు. అంతర్గతంగా పరిష్కరించుకోదగ్గ ఈ అంశంపై రోడ్డుకెక్కడంతో ఈ విషయం బీసీ ఓటర్లలోకి వెళ్లి వారి ఓటింగ్‌పై ప్రభావం చూపిందని టీడీపీ నాయకులు విశ్లేషిస్తున్నారు. టీడీపీ అభ్యర్థులకు దన్నుగా నిలిచే నాయకులు కరువయ్యారు. ఆర్థికంగా పోరాడలేక చాలామంది అభ్యర్థులు చేతులెత్త్తేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మంత్రి వెలంపల్లిపై ఉన్న వ్యతిరేకతను కూడా ఓట్లరూపంలోకి మలుచుకోలేకపోయారు.
నాయకులు అంతా కలిసి కట్టుగా ఉంటే మరో పది స్థానాల్లో సునాయాసంగా టీడీపీ గెలుపు సాధించేది. విజయవాడలో మంత్రి వెలంపల్లిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. కాని దాన్ని కూడా ఓట్ల రూపంలో మలచుకోలేక చతికిలపడింది టీడీపీ. దీంతో ఇక్కడ అత్యధికంగా 22 స్థానాలకుగాను 18కిపైగా స్థానాలను వైసీపీ గెలుచుకుంది. సెంట్రల్, తూర్పు నియోజకవర్గాల్లో టీడీపీ కాస్త పోటీ ఇచ్చింది. తూర్పులో మొత్తం 21 స్థానాలకుగాను ఏడు స్థానాల్లో టీడీపీ గెలిచింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌కు ఇక్కడ 18వేల మెజారిటీ వచ్చింది. తాజా ఎన్నికల్లో వైసీపీ సుమారు 12వేల ఓట్ల ఆధిక్యాన్ని దక్కించుకుంది. టీడీపీ నుంచి వైసీపీలో చేరిన యువనేత దేవినేని అవినాశ్ తూర్పులో వైసీపీ పుంజుకోవడంలో కీలకంగా వ్యవహరించారు. టీడీపీ నేతల వర్గపోరును వైసీపీ తమకు అనుకూలంగా మలుచుకోవడం వల్లే ... ఆ పార్టీకి అనూహ్య ఫలితాలు వచ్చాయని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
చరిత్రలో ఊహించని విధంగా పరాజయం పాలయిన తెలుగుదేశం పార్టీలో పోస్ట్ మార్టమ్ మొదలైంది. తన స్వంత ఇంటిని చక్కదిద్దుకుంటుందా..? ఎన్నికల్లో ఎదురైన ఓటమిపై సమీక్ష నిర్వహించుకుంటుందా..?పార్టీకి ద్రోహం చేసిన పార్టీ నాయకులపై చర్యలు తీసుకునే ధైర్యం అధినేతకు ఉందా..? అన్న చర్చ ఇప్పుడు తమ్ముళ్లలో నడుస్తోంది. పార్టీ కార్యకర్తలు, సానుభూపతిపరులు ధైర్యంగా ముందుకు వచ్చి పనిచేస్తుంటే, పదవులు అనుభవించి, ఇంకా పదవులపై కూర్చున్న నేతలు పలాయనం చిత్తగించారని కేడర్ మండిపడుతోంది. మాజీ మంత్రి దేవినేని ఉమ తీరుపైనా కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పదవిలో ఉన్నప్పుడు ఎవరిని లెక్కచేయని ఉమ.. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎక్కడికి వెళ్లారని నిలదీస్తున్నారు. వైసీపీ నేతలు భారీగా డబ్బులు ఖర్చు పెడుతున్నా... టీడీపీ అభ్యర్థులకు ఏమాత్రం సాయం చేయలేదని మండిపడుతున్నారు.
ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్న విజయవాడ, గుంటూరు లో పార్టీ ఓటమికి కారకులైన వారిపై చర్యలు తీసుకుంటారా..? విజయవాడలో పార్టీకి ద్రోహం చేసిన ద్రోహులపై అధినేత చంద్రబాబు' చర్యలు తీసుకుంటారా..? లేక వదిలేస్తారా..? అనే దానిపై పార్టీ నాయకులు, కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. పోలింగ్‌కు రెండు రోజుల ముందు కుల ప్రస్తావన తెచ్చి పార్టీకి ద్రోహం చేసిన విజయవాడ పేపర్ టైగర్స్‌పై చర్యలు తీసుకోవాలని కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. పార్టీ మంచి స్వింగ్‌లో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న సమయంలో టిడిపి ఒక కులానికే చెందిందని వ్యాఖ్యలు చేసిన 'బుద్ధా వెంకన్న, నాగుల్‌మీరా, బోండా ఉమామహేశ్వరరావు'లపై చర్యలు తీసుకుని 'చంద్రబాబు' పార్టీని గాడిలో పెట్టాలని వారు కోరుకుంటున్నారు. ప్రత్యర్థుల వద్ద నుంచి సొమ్ములు తీసుకున్నారనే ఆరోపణలు ఆ ముగ్గురిపై వస్తున్నాయి. పార్టీ అంతర్గత సమావేశాల్లో ప్రస్తావించాల్సిన విషయాలను బహిరంగంగా మాట్లాడి పార్టీకి ఘోరఓటమికి కారణమైన వారిని ఉపేక్షించాల్సిన అవసరం లేదంటున్నారు తమ్ముళ్లు. పట్టుమని పది ఓట్లు తేలేని వారిని పార్టీ అందలం ఎక్కించిందని, దాని ఫలితాలను ఇప్పుడు చూస్తున్నామని చెబుతున్నారు. ఇప్పటికైనా ఇటువంటి జాతి రత్నాలపై వేటు వేయాలని విజయవాడ టిడిపి కార్యకర్తలు, నాయకులు కోరుతున్నారు. మరీ ఇప్పుడు చంద్రబాబు ఏం చేస్తారన్నది చూడాలి మరీ...