జగన్ కు మోగిన గంట! వైసీపీలో కుమ్ములాటలేనా?
posted on Mar 3, 2021 @ 2:42PM
విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. ఎమ్మెల్యే గిరికి రాజీనామా చేశారు. త్వరలోనే టీడీపీని వీడుతారంటూ ప్రచారం జరుగుతోంది. గంటా వైసీపీలో చేరే అవకాశముందని ఎంపీ విజయసాయిరెడ్డి కన్ఫామ్ చేసేశారు. లేటెస్ట్ గా గంటా అనుచరుడు కాశీ విశ్వనాథ్ విజయసాయి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. ముందు అనుచరుడు, ఆ వెనకాలే నాయకుడు కూడా అధికార పార్టీలో చేరుతారని చెబుతున్నారు. గంటా శ్రీనివాసరావు కొన్ని ప్రతిపాదనలు పంపారు, జగన్ ఆమోదం తర్వాత గంటా పార్టీలోకి వచ్చే అవకాశముందని విజయసాయిరెడ్డి ప్రకటించారు.
అయితే, గంటా చేరిక వైసీపీలో వర్గ విభేదాలకు కారణమవుతోంది. గంటా అంటే అస్సలు పడని మంత్రి అవంతి శ్రీనివాస్ ఆయన రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే మంత్రి అవంతి గంటాపై బహిరంగ విమర్శలు చేశారు. గంటాకు వ్యతిరేకంగా విశాఖలో ధర్నాలు కూడా నిర్వహించింది అవంతి వర్గం. లోకల్ మంత్రి కాదంటున్నా.. వైసీపీ అధిష్టానం గంటా ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది అంటున్నారు. ఒకవేళ గంటా వస్తే.. అవంతి పరిస్థితేంటి? పార్టీలో ఆయన ప్రాధాన్యం తగ్గుతుందా? హైకమాండ్ పై అవంతి అలుగుతారా? ఫ్యాన్ రెక్కలు తలో దిక్కుకు వీస్తాయా? విశాఖ వైసీపీలో వర్గ పోరు ముదిరి అసలుకే ఎసరు వస్తుందా? ఇలా రకరకాల ప్రశ్నలు. విశాఖ రాజకీయంపై జోరుగా చర్చలు.
ఇక గంటా శ్రీనివాసరావు తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. అధికారం లేని చోట ఆయన ఉండరు. ప్రజారాజ్యం నుంచి కాంగ్రెస్ కు.. ఆ తర్వాత టీడీపీకి.. ఇప్పుడు మళ్లీ వైసీపీ వైపు చూస్తున్నారు. టీడీపీలో ఆయనకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు చంద్రబాబు. మంత్రిని కూడా చేశారు. టీడీపీ అధికారం కోల్పోగానే.. పార్టీపై వెగటు పుట్టినట్టుంది. 20 నెలలుగా టచ్ మీ నాట్ అన్నట్టు ఉంటున్నారు గంటా. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణతో ఒక్కసారిగా యాక్టివ్ అయ్యారు. అది కూడా పార్టీ పరంగా కాకుండా వ్యక్తిగత ఎజెండాతో ముందుకు పోతున్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి విశాఖ ఉక్కు కోసం క్రెడిట్ పాలిటిక్స్ చేస్తున్నారని అంటున్నారు. ప్రస్తుతానికి ఆయన టీడీపీలోనే కొనసాగుతున్నా.. పార్టీలో ఇన్ యాక్టివ్ గా ఉంటూ.. విశాఖలో ఇప్పుడిప్పుడే యాక్టివ్ అవుతున్నారు. ఇదంతా వైసీపీలో చేరేందుకేనని అంతా అంటున్నారు. తాజాగా విజయసాయిరెడ్డి నోటి నుంచే ఈ మాట రావడంతో ఇక గంటా సైకిల్ దిగి.. ఫ్యాను గాలిలో కలిసిపోవడం ఖాయమంటున్నారు. అదే జరిగితే, అధికార పార్టీలో బద్ధ శత్రువులైన ఇద్దరు శ్రీనివాసులు ఇమడగలరా? వైసీపీలో వర్గ పోరు ఏ తీరాలకు..?