వేడెక్కుతున్న విజయనగరం రాజకీయాలు
posted on Mar 5, 2012 @ 10:23AM
విజయనగరం : విజయనగరం పట్టణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. మున్సిపల్ ఎన్నికలే లక్ష్యంగా ప్రధాన పార్టీలు పావులు కదుపుతున్నాయి. అధికార కాంగ్రెస్, టిడిపిలు రెండూ వలసల ప్రోత్సాహానికి శ్రీకారం చుట్టాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కూడా పట్టణంలో పట్టుసాధించేందుకు వ్యూహాలు సిద్దం చేస్తోంది. ఇటీవల కొంతమంది టిడిపి నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీనికి ధీటుగా స్పందించిన టిడిపి తన ప్రత్యర్ధి అయిన కాంగ్రెస్ పార్టీ నాయకులను తమ పార్టీలోకి ఆహ్వానించి తమ బలం చెక్కు చెదరలేదని నిరూపించింది. విజయనగరంలో పూర్తిపట్టును పొందేందుకు పిసిసి అధ్యక్షులు బొత్స సత్యనారాయణ కూడా ప్రత్యేక దృష్టి సారించారు. కాంగ్రెస్ పార్టీలోకి వలసలు వచ్చే నాయకుల సంక్షేమం తాను చూసుకుంటానని ఆయన హామీ ఇస్తున్నారు. లోక్ సత్తా పార్టీ వార్డుల వారీగా పార్టీ కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తోంది. ఆ పార్టీ అధ్యక్షుడు బాబ్జీ పట్టణంలోని వివిధ వార్డుల్లో కార్యకర్తల శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తూ వారిని మున్సిపల్ ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నారు.