సంక్షోభంలో చిన్నతరహా పరిశ్రమలు
posted on Mar 5, 2012 @ 10:51AM
కొత్త పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు రాని ఔత్సాహికులు
తెలుగువన్.కామ్ ప్రత్యేక కథనం
హైదరాబాద్: రాష్ట్రంలో చిన్నతరహా పరిశ్రమలు ఎన్నడూ లేని విధంగా సంక్షోభంలో చిక్కుకున్నాయి. ముడివనరుల కొరత, మార్కెటింగ్ అవకాశాలు లేకపోవడం, పలురకాల పన్నులు, అధికారులు ప్రభుత్వ ఉద్యోగుల అవినీతితో ఇప్పటికే కుదేలయిన ఈ పరిశ్రమకు మరో విఘాతం కలిగింది. విద్యుత్ కోత కారణంగా ఈ పరిశ్రమలు మూతపడుతున్నాయి. సాధారణంగా వేసవికాలంలో విద్యుత్ హాలిడే విధించేవారు. కానీ ఇంకా వేసవి సమీపించకుండానే వారంలో రెండురోజులపాటు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తుండటంతో చిన్నతరహా పరిశ్రమల యజమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ అడ్డగోలు కోతలతోపాటు సాంకేతిక అంతరాయాల పేరుతో రోజుకు సగటున రెండు గంటల విద్యుత్ ను నిలిపివేస్తున్నారు. చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటుచేస్తే విద్యుత్ సబ్సిడి ఇస్తామని ప్రభుత్వం ఊరించింది. అసలు విద్యుత్తే లేకపోవడంతో సబ్సిడి ఇచ్చి ఉపయోగం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. చిన్న పరిశ్రమలు రన్నింగ్ లో ఉండగా విద్యుత్ నిలిచిపోతే పూర్తిస్థాయిలో సరుకును తయారు చేయలేరు. దీనికి తోడు విద్యుత్ వచ్చిన వెంటనే చాలా పరిశ్రమల్లో వెంటనే ఉత్పత్తి జరగదు. దీనివల్ల ఈ పరిశ్రమల్లో ఉత్పత్తి గణనీయంగా పడిపోతుంది. ఒకవైపు విద్యుత్ కొరతతో చిన్న తరహా పరిశ్రమలు అల్లాడుతుంటే విద్యుత్ రాయితీలిస్తాం, పరిశ్రమలు నెలకొల్పండంటూ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను పరిశ్రమలశాఖ ఊరిస్తోంది. అయితే పరిస్థితులను గమనిస్తున్న వారు రాష్ట్రంలో చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు రావడం లేదు. రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటుచేసి చాలా తప్పు చేశామన్న భావనను కొంతమంది పారిశ్రామికవేత్తలు వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకు రుణాలుపొంది పరిశ్రమలు ఏర్పాటుచేస్తే ఉత్పత్తి లేక వాణిజ్య బ్యాంకుల నోటీసులు అందుకుని వడ్డీలు, పెనాల్టీలు రూపంలో లక్షలాది రూపాయలు చెల్లించాల్సి వస్తున్నదని పారిశ్రామికవేత్తలు గొల్లుమంటున్నారు.