బాబుగారు నిజం చెప్పండి.. ఆ డాక్టర్ ను ఎక్కడ దాచారు.. విజయ్ సాయి ఫైర్
posted on Aug 24, 2020 @ 2:28PM
టీడీపీ నాయకులు చంద్రబాబు, లోకేష్ ల పై నిత్యం విరుచుకుపడే వైసీపీ ఎంపీ విజయ్ సాయిరెడ్డి కరోనా సోకిన తరువాత కొద్ది రోజులు సైలెంట్ అయిపోయారు. అయితే తాజాగా ఈరోజు మరోసారి ట్విట్టర్ వేదికగా బాబు పై తీవ్ర వ్యాఖ్యలు చేసారు. తాజాగా, కరోనా చికిత్స కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదం కేసులో విజయవాడ రమేశ్ హాస్పిటల్స్ అధినేత రమేశ్ బాబు కోసం పోలీసులు గాలిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు పై తీవ్ర విమర్శలు చేశారు. "చంద్రబాబూ నేరుగా అడుగుతున్నా. ఇంతకీ డాక్టర్ రమేశ్ ను మీ ఇంట్లో దాచారా? లేక, మీ కొడుకు ఇంట్లో దాచారా? ఇంతకీ నిమ్మగడ్డ రమేశ్, డాక్టర్ రమేశ్.. ఈ ఇద్దరితో మీకున్న అనుబంధం ఏమిటి?" అని అయన తన ట్వీట్ లో ప్రశ్నించారు.
కాగా, రమేశ్ హాస్పిటల్స్ వ్యవహారంలోనూ, నిమ్మగడ్డ వ్యవహారంలోనూ అధికార పార్టీ నేతలు పదేపదే కుల ప్రస్తావన తీసుకువస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా విజయ సాయి చేసిన ట్వీట్ లో కూడా 'ఈ ఇద్దరితో మీకున్న అనుబంధం ఏమిటి?' అని అడగటం ద్వారా పరోక్షంగా కుల ప్రస్తావన తీసుకువస్తూ చంద్రబాబుని టార్గెట్ చేసినట్టు అనిపిస్తోంది.