విక్కీ.. మనసున్న అదృష్టవంతురాలు
posted on Jul 13, 2022 @ 5:03PM
ఊహించని మంచి జరిగితే అంతటి అదృష్టవంతులు లేరంటారు. అదృష్టానికి సంబంధించి అనేక కథనాలు, సంఘటనలు మనం చాలా వినే ఉంటాం, చూసే ఉంటాం. కానీ ఆ అదృష్టవంతులకు మంచి మనసు వుంటే ఊహించని మేలు అవతలివారికీ జరుగుతుంది. ఈ మాట విక్కీ ఉమోడుకి సరిగ్గా సరిపో తుంది. ఆమె తక్కువలో వస్తోందని రెండు సోఫాల్ని ఇంటికి తెప్పించింది. తీరా దాని కుషన్‌లు సరి చేస్తుంటే ఏకంగా 27 లక్షల డబ్బుతో ఉన్న రెండు కవర్లు దొరికాయి. అదృష్టమంటే ఇదేరా అనుకున్నా రంతా. ఇతరులెవరైనా అయితే ఆ డబ్బును గుట్టుచప్పుడు కాకుండా లాకర్‌లో పెట్టేసుకుంటారు. కానీ విక్కీ అలా చేయలేదు. ఆమె వెంటనే ఆ డబ్బును నిజంగా ఆ డబ్బు ఎవరిదో కనుక్కుని తిరిగి ఇచ్చే సింది. ఇలాటివారు ఈ రోజుల్లోనూ వుంటారా అనిపించవచ్చు.
కాలిఫోర్నియాకు చెందిన విక్కీ తన కొత్త ఇంటికి ఫర్నీచర్ కొనాలనుకుంది. ఆన్‌లైన్‌లో సోఫాలు బుక్ చేయడానికి ఒక వెబ్‌సైట్ వెతికింది. ఆమెకు కావాల్సిన ధరలో రెండు మంచి సోఫాలు, వాటికి తగిన కుర్చీలను వెతికింది. కానీ వాటిని ఒక వ్యక్తి పైసా చెల్లించకుండానే ఇస్తానని తన వద్ద వున్నాయని ఓ పెద్దమనిషి ఒక ప్రకటన ఇచ్చాడు. అది ఆమె దృష్టిలో పడింది. ముందు నమ్మలేదు. తర్వాత ఫోన్ చేసి ఆ వ్యక్తితో మాట్లాడింది. ఆ వ్యక్తి తమ బంధువు ఒకరు చనిపోవడంతో అతనికి సంబంధించిన వస్తువు లన్నీ ఉచితంగా ఇచ్చేసి ఇల్లు ఖాళీ చేయదలచిన్నట్టు తెలిసింది. విక్కీకి తన కొత్త నివాసంలో ఏమీ లేవు గనుక విడిగా కొనే బదులు ఆయనను కలిసి వాటిని తీసుకోవాలని అనుకుంది. వెంటనే ఆయన్ను కలిసి రెండు సోఫాలను, వాటికి తగిన రంగులోని రెండు కుర్చీలను కూడా తీసుకుంది. వాటిని ఇంటికి తెచ్చింది.
కొత్త సోఫాలను చూసి ఎంతో మురిసిపోయింది విక్కీ. తీరా వాటిని సద్దుతుంటే సోఫాలో ఇరుక్కుని రెండు కవర్లు కనిపించాయి. అదేమిటా అని చూస్తే వాటిలో డబ్బు కట్టలు వున్నాయి! చిన్నా, చితకా కాదు..ఏకంగా మన లెక్కల ప్రకారం 27 లక్షలు! ఆమె ఆశ్చర్యానికి అంతే లేదు. కానీ వాటిని తాను తీసి దాచుకోలేదు. దేవుడు మాకు జీవితానికి తగినంత ఆర్ధిక బలాన్ని, వృత్తి వుద్యోగాలనిచ్చాడు, ఈ డబ్బు వుంచుకోలేనని అనుకుందామె. వెంటనే సోఫాలు ఇచ్చిన వ్యక్తిని కలిసి ఆయనకి కవర్‌ని అలానే ఇచ్చేసిందామె. ఆయన కూడా ఆమె గొప్పతనాన్ని గ్రహించి కొత్త ఫ్రిజ్ కొనుక్కోమని రెండువేల డాలర్లు ఇచ్చాడు. ఇంతకంటే గొప్ప వ్యక్తులను మనం చూడగలమా?