ముప్పు ముంగిట కడెం ప్రాజెక్టు..వరద ఉధృతి పెరిగితే డ్యాం డ్యామేజ్!
posted on Jul 13, 2022 @ 4:53PM
భారీ వర్షాల కారణంగా నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. వరద ఉధృతి మరింత పెరిగితే డ్యామ్ కు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
డ్యామ్ దిగువన ఉన్న 12 గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేశారు. మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి డ్యామ్ వద్దకు చేరుకుని అధికారులతో కలిసి పరిస్థితిని సమీక్షించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ కడెం ప్రాజెక్టు పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టుకు వచ్చి చేరుతున్న వరదనీటి ప్రవాహంపై ఆరా తీసేరు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి ఫోన్ చేసి అక్కడే ఉండి పర్యవేక్షించాలని ఆదేశించారు.
భారీ వరద కారణంగా రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా మారాయి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు కూడా వరద పోటెత్తింది. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు ఎస్సారెస్పీ ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. ఇన్ ఫ్లో 2లక్షల 35 వేల క్యూసెక్కులు ఉండగా లక్షా 50 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం 1087 అడుగులకు చేరింది.