జై ఆంధ్రప్రదేశ్: వెంకయ్య నాయుడు
posted on Jun 8, 2014 @ 9:17PM
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వేదిక మీద నుంచి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు స్ఫూర్తిదాయకమైన ప్రసంగం చేశారు. ‘‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్తగా ఏర్పడినందుకు నాకు ఒకవైపు బాధగా, మరోవైపు సంతోషంగా వుంది. తెలుగువారు రెండు రాష్ట్రాలుగా విడిపోవడం బాధని కలిగించే అంశం. కొత్త ఆంధ్రప్రదేశ్‌కి గత ప్రభుత్వం ఎంతో అన్యాయం చేసింది. ఆ విషయం గుర్తుకు వస్తేనే ఎంతో బాధ కలుగుతూ వుంటుంది. ఆంధ్రప్రదేశ్‌కి రాజధాని లేదు. బడ్జెట్ లోటుగా వుంది, విద్యాలయాలు లేవు, ప్రభుత్వ సంస్థలు లేవు. ఎన్నో ఇబ్బందులున్నాయి. అయినా అధైర్యపడాల్సిన అవసరం లేదని నా మనసు చెబుతోంది. ఎందుకంటే తెలుగువారికి వున్న తెలివి మరెవరికీ లేదు. ఏ రంగంలో అయినా తెలుగువారు పోటీ పడతారు. ముందడుగు వేస్తారు. మనకి పెద్ద సముద్ర తీరం వుంది. తడ నుంచి ఇచ్ఛాపురం వరకు జాతీయ రహదారి వుంది. పొడవైన రైలుమార్గం వుంది. ఇంటర్ లింక్ రైలు మార్గాలు వున్నాయి. రైలు వ్యవస్థ చాలా బాగా వుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇండియాలోనే నంబర్ వన్ కాంట్రాక్టర్స్ వున్నారు. హోటల్ బిజినెస్‌లో ఆంధ్రప్రదేశే నంబర్ వన్. ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో తెలుగువారే నంబర్ వన్. అందుకే మనం ఎంతమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్‌కి అనుభవజ్ఞుడు, సమర్థుడైన చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌ని అగ్రస్థానంలో నిలుపుతారన్న నమ్మకం వుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వున్నప్పుడు పార్లమెంటు సాక్షిగా ఆంధ్రప్రదేశ్ పొందిన హామీలను ఎన్డీయే ప్రభుత్వం తు.చ. తప్పకుండా అమలు చేస్తుంది. దానికి ఉదాహరణ కేంద్ర కేబినెట్ మొదటి సమావేశంలోనే పోలవరం ఆర్డినెన్స్ తేవడం. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోవడం బాధకరమే అయినప్పటికీ, కలసి వుండి కలహించుకోవడం కంటే, విడిపోయి సహకరించుకోవడం మేలు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి ఒక్కరూ శ్రమించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తారని ఆశిస్తు్న్నాను. జై ఆంధ్రప్రదేశ్’’ అన్నారు.