అప్పుడు చెప్పింది నేనే.. ఇప్పుడు ఏం చేయలేను..
posted on Sep 14, 2016 @ 11:53AM
కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు విశాఖలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక హోదా గురించి మరోసారి ప్రస్తావించారు. ఆనాడు హోదా ఇవ్వాలని పట్టుబట్టింది నిజమే కానీ ఇప్పుడు మాత్రం హోదా ఇచ్చే పరిస్థితి లేదు అని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదాకి పారిశ్రామిక రాయితీలకు సంబంధం లేదని.. హోదాకి సమానమైన నిధులను మాత్రం ప్యాకేజీ రూపంలో విదేశాల నుంచి రుణం తీసుకుని ఇప్పిస్తానని అన్నారు. ప్రత్యేక హోదా వస్తే 90 శాతం నిధులు కేంద్రం, 10 శాతం నిధులు రాష్ట్రం ఖర్చు చేయాల్సి వుంటుందని, హోదా లేకుంటే 60:40 నిష్పత్తిలో నిధుల ఖర్చు ఉంటుందని గుర్తు చేసిన ఆయన, తేడాగా ఉన్న 30 శాతం నిధులు ఎంతయినా కేంద్రం ఇస్తుందని అన్నారు. ఇంకా పోలవరం గురించి మాట్లాడుతూ.. పోలవరం అంశం ఇప్పటిది కాదు.. గత కొన్నేళ్ల నుండి నడుస్తున్న వ్యవహారం.. 35 ఏళ్లలో కాంగ్రెస్ పోలవరాన్ని పూర్తి చేయలేకపోయింది.. అలాంటిది ఈ రెండేళ్లలో మోడీ ప్రభుత్వం ఎలా పూర్తి చేయగలుగుతుంది అని ప్రశ్నించారు. ఇంకా ఏపీకి పోలవరం జీవనాడి.. పోలవరం ఖర్చును వందకి వంద శాతం కేంద్రమే భరిస్తుంది అని హామి ఇచ్చారు. అంతేకాదు ఏపీ రెవెన్యూ లోటు కేంద్రమే భరిస్తుంది అని అన్నారు.