హైబ్రీడ్ లైన్లతో తాత్కాలిక ఉపశమనం... నెలరోజుల తర్వాత మాత్రం బాదుడే..
posted on Dec 16, 2019 @ 1:17PM
జాతీయ రహదారులపై దేశవ్యాప్తంగా ఫాస్టాగ్ అమల్లోకి వచ్చింది. నేషనల్ హైవేస్ పై వాహనదారులు టోల్ చెల్లించడానికి ఈ ఫాస్టాగ్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. రేడియో ఫ్రీక్వెన్సీ గుర్తింపు పరికరం ద్వారా ఈ విధానం పనిచేస్తోంది. అయితే, ఫాస్టాగ్ విధానంలోకి వాహనదారులు ఇంకా మారకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాహనదారులు నగదు చెల్లించడానికే ఆసక్తి చూపడంతో టోల్ గేట్ల దగ్గర భారీ ట్రాఫిక్ జామ్స్ ఏర్పడుతున్నాయి. ఫాస్టాగ్ కు అధిక లైన్లు ఏర్పాటు చేయడం... అలాగే నగదు చెల్లింపు లైన్లను కుదించడంతో టోల్ గేట్ల దగ్గర పెద్దఎత్తున వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది.
అయితే, ఫాస్టాగ్ విధానంలోకి మారడానికి ఇప్పటికే తగినంత సమయమిచ్చి, ఒకట్రెండుసార్లు గడువు పొడిగించినా, అధిక వాహనదారులు ఇంకా కొత్త విధానంలోకి మారకపోవడంతో తాత్కాలిక ఉపశమనంగా టోల్ గేట్ల దగ్గర హైబ్రీడ్ లైన్లను ఏర్పాటు చేశారు. ఈ హైబ్రీడ్ లైన్లలో ఫాస్టాగ్ రహిత వాహనాలకు ఎలాంటి పెనాల్టీలు లేకుండా సాధారణ టోల్ వసూలు చేస్తారు. అయితే, ఈ హైబ్రీడ్ లైన్లు కూడా కేవలం నెలరోజులు మాత్రమే పనిచేస్తాయని, అప్పటిలోపు ఫాస్టాగ్ లోకి మారాలని, ఒకవేళ మారకపోతే ఫాస్టాగ్ లేని వాహనాలకు రెట్టింపు ఫీజు ఉంటుందని కేంద్రం ప్రకటించింది.
రేడియో ఫ్రీక్వెన్సీ పరికరం ద్వారా వాహనదారుల నుంచి ఆటోమేటిక్‌గా టోల్ వసూలు విధానం అమల్లోకి రావడంతో కేవలం ఐదే ఐదు సెకన్లలో టోల్ గేటును దాటి వెళ్లిపోతున్నారు. దాంతో, ఫాస్టాగ్ విధానంలోకి మారిన వాహనదారులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. కానీ, ఫాస్టాగ్ విధానంలోకి మారని వాహనదారులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే, అధికశాతం వాహనదారులు ఫాస్టాగ్ లోకి మారలేదని గుర్తించిన కేంద్రం... మరో నెలరోజులపాటు ఉపశమనం కల్పిస్తూ టోల్‌గేట్ల దగ్గర హైబ్రీడ్ లైన్ సౌకర్యం కల్పించింది.