ఏపీ వాహనాలు పన్నుకట్టాలా?.. ఆలోచించుకోండి!
posted on Jul 30, 2014 @ 4:17PM
ఆంధ్రప్రదేశ్ వాణిజ్య రవాణా వాహనాలు తెలంగాణలోకి ప్రవేశించాలంటే ఇప్పటి నుంచి తెలంగాణ రవాణాశాఖకు మూడు నెలల పన్ను కట్టాల్సిందే. ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ తెలంగాణ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అజయ్‌మిశ్రా ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కాంట్రాక్టు, గూడ్స్ వాహనాలు, మోటార్ క్యాబ్స్, మాక్సీ క్యాబ్స్, కమర్షియల్ ట్రాక్టర్స్, ప్యాసింజర్ ఆటో రిక్షాలకు వర్తిస్తుందని తెలంగాణ రవాణా శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంఈ జీవో జారీ చేయడంతో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వాహనాలను తెలంగాణ సరిహద్దుల్లో నిలిపివేస్తున్నారు. నేషనల్ పర్మిట్ ఉన్న వాహనాలు, వ్యక్తిగత వాహనాలకు పన్ను నుంచి తెలంగాణ ప్రభుత్వం మినహాయించింది. తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించాలంటే పర్మిట్ ట్యాక్స్ చెల్లించాలంటూ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై ఆంధ్రప్రదేశ్ రవాణా మంత్రి శిద్దా రాఘవరావు స్పందించారు. పన్ను విధింపుపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించుకోవాలని శిద్దా రాఘవరావు అన్నారు. గవర్నర్ నిర్ణయం మేరకు 2015 మార్చి వరకు పన్ను విధించడం సరికాదన్నారు.