మాస్కంటే ఇదే.. భలేగుంది కదూ!
posted on Dec 26, 2022 @ 3:12PM
కరోనా మహమ్మారి జనం జీవితాలలో మాస్క్ ను ఒక భాగం చేసేసింది. కష్టమైనా, నష్టమైనా ప్రాణానికి పూచీ ఉండాలంటే మాస్క్ తప్పని సరి అని చెప్పేసింది. దీంతో కరోనా ఆంక్షలు ఉన్నా లేకున్నా ఎక్కువ మంది మాస్కును ఒక అలవాటుగా మార్చేసుకున్నారు.
ఇక ప్రస్తుతం చైనాలో అయితే కరోనా విలయ తాండవమే చేస్తోంది. 20 రోజుల్లో పాతిక కోట్ల మందికి పైగా కరోనా సోకిందంటేనే అక్కడి పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. దీంతో చైనా కరోనా ఆంక్షలు ఎత్తివేసినా జనం మాత్రం జాగ్రత్తలు వదలడం లేదు. మాస్కులు ధరించే తిరుగుతున్నారు. ఈ మాస్కుల అనివార్యత కారణంగా ఓ వ్యక్తి సృజన బయటపడింది.
మాస్కు ధరించినా తినడానికీ, తాగడానికీ ఇబ్బంది లేకుండా ఓ ఏర్పాటు చేసుకున్నాడు. ఓ వెరైటీ మాస్కును తయారు చేసుకుని ధరిస్తున్నాడు. ఈ మాస్క్ వల్ల అతడికి తినడానికీ, తాగడానికీ మాస్కు తీయాల్సిన అవసరం లేకుండా పోయింది.
ఈ మాస్కు జనాలకు విపరీతంగా నచ్చేసింది. అందరూ ఇదెలా తయారు చేసుకోవాలి, మాక్కూడా అలాంటి మాస్కు కావాలంటున్నారు. ఈ మాస్కు ధరించి అతగాడు రెస్టారెంట్లో దర్జాగా ఫుడ్ లాగించేస్తున్న వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమలో తెగ వైరల్ అయిపోయింది. నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతూనే అతడి సృజనను తెగ పొగిడేస్తున్నారు.