వరవరరావు వితండ వాదన
posted on Feb 9, 2013 @ 6:13PM
మేధావులుగా ముద్రలేసుకొని తిరుతున్న అనేక మందిలో విప్లవ రచయితల సంఘం నేత వరవరరావు కూడా ఒకరు. కానయితే, ఆయనకీ ఆముద్ర జనం వేసారు గనుక ఎవరికీ అభ్యంతరం ఉండదు. పోలీసు ఎన్ కౌంటర్లో నక్సలైట్లు చనిపోతే అక్కడ తక్షణమే ప్రత్యక్షమయి మానవ హక్కుల ఉల్లంఘన గురించి మాట్లాడే ఆయన, నక్సలైట్ల చేతిలో పోలీసులు, అమాయక గిరిజనులు, సామాన్య పౌరులు చనిపోతే మాత్రం ఆయన అటుపక్కకి రారు, ఆయనకీ ఏ మానవ హక్కులు అప్పుడు గుర్తుకు రావు.
మళ్ళీ ఈ మిస్టర్ మేధావిగారు పార్లమెంటు మీద దాడికి తెగబడిన అఫ్జల్ గురుని ఈరోజు ఉరితీసినందుకు నిరసన తెలియజేస్తూ వీదులకెక్కినప్పుడు మాత్రం జనం పకపకమని నవ్వుకొన్నారు. అఫ్జల్ గురును ఉరి తీయడాన్ని ఖండిస్తూ ఆయన ఒక సభలో మాట్లాడుతూ “గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి వందలమందిని మతకలహాలలో మట్టుబెట్టినప్పుడు, ప్రజలు ఆయనను మెచ్చుకొని ఆయనకే ఓటు వేసారు. అంతేకాక, అటువంటి వ్యక్తినే దేశప్రధాని కావాలని ఇప్పుడు కోరుకొంటున్నారు. దేశ వ్యాప్తంగా పోలీసులు నక్సలయిట్లను బూటకపు ఎన్ కౌంటర్లలో హత్యలు చేస్తే వారికి మెడల్స్ ఇచ్చి మెచ్చుకొంటారు. గానీ, ఒక ఉద్యమకారుడయిన ముస్లిం వ్యక్తిని ఉరితీసేందుకు మాత్రం వెనుకాడరు. దీనిని అందరూ ఖండించాలి” అంటూ తన మేధసుని ఉపయోగించి బోడి గుండుకు మోకాలుకు ముడేసేప్రయత్నం చేసారు. ఒక దేశ ద్రోహికి మద్దతుగా ఆయన మాట్లాడుతూ, హైదరాబాదులో టాంక్ బ్యాండ్ వద్ద నిరసన కార్యక్రమం చెప్పట్టేసరికి పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి లోపలేసారు.
గుజరాత్ ముఖ్యమంత్రి మీద, పోలీసుల మీద ఆయనకీ అభ్యంతరాలున్నపుడు, ఈవిధంగా సభలు పెట్టి పనికి రాని ఉపన్యాసాలు ఇచ్చి ప్రజల మెదళ్ళుతినే బదులు కోర్టుకెళ్ళి కేసువేసి ఉంటే, ఆయనని ఎవరూ ఆపేవారు లేరు. అఫ్జల్ గురూకి ఉరిశిక్ష వేయకూడదనుకొంటే, దానికూడా కోర్టుకు వెళ్లి కేసువేసుకొని, తన మేధసుని ఉపయోగించి వాదించి విడిపించుకొని ఉండాల్సింది. గానీ, ఇటువంటి వ్యర్ధ ప్రసంగాలు చేసి మనదేశం సార్వభౌమత్వానికి చిహ్నమయిన పార్లమెంటు మీద దాడి చేసిన ఒక దేశద్రోహిని కమ్యునిస్టు భావాలుగల వరవరరావు సమర్దించడం చాలా అవివేకం.