జగన్ కు ‘కాపు’ కాయం.. తేల్చి చెప్పేసిన వంగవీటి రాధాకృష్ణ!
posted on Jan 16, 2024 4:03AM
జగన్ మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికలలో విజయం కోసం పేక మేడలు కడుతున్నారు. వాటినే కోటలుగా భావిస్తూ ఇష్టారీతిన సిట్టింగ్ అభ్యర్థులను మార్చేస్తున్నారు. దీంతో వైసీపీలో పరిస్థితి ఇప్పుడు చిన్న పాటి గాలి వీస్తే కుప్పకూలిపోయేలా మారిపోయింది. దీంతో పార్టీ నేతలలో, కేడర్ లో భయం, ఆందోళన, గందరగోళం ఏర్పడింది. ఉండేవాళ్ళు ఉండండి, వెళ్లే వాళ్లు వెళ్లండి అనే ధోరణిలో జగన్ వ్యవహరిస్తున్నారు. ఆ విషయం పక్కన పెడితే జగన్ కు ఒక విషయంలో మాత్రం ఆందోళన వెంటాడుతోంది. అదే రాష్ట్ర రాజకీయాలలో కీలకంగా ఉండే కాపు సామాజికవర్గాన్ని తన వైపు తిప్పుకోవడం. దీని కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా అన్నీ బెడిసికొడుతున్నాయి.
ఇప్పుడున్న పరిస్థితిలో వైసీపీకి కాపు సామజిక వర్గ ఓటర్లను ఆకర్శించే ఒక ఐకాన్ కావాలి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేనతో కాపు సామాజికవర్గాన్ని ఆకర్షిస్తుండగా.. వైసీపీ ఎలాగైనా దానిని అడ్డుకోవాలని టార్గెట్ చేసుకొని పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే జగన్ ఎన్నో ఎత్తులు వేశారు. ముందుగా జనసేనను తెలుగుదేశంతో కలవనీయకుడదన్న ఉద్దేశంతో ఎన్నెన్నో కుట్రలు చేశారు. కాపు సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు. అది కుదరకు చీల్చేందకు వ్యూహాలు పన్నారు. కానీ అవేమీ వర్కౌట్ కాలేదు. దీంతో కాపు ఉద్యమ మాజీ నేత ముద్రగడ పద్మనాభంను ఫోకస్ లోకి తీసుకొచ్చారు. ముద్రగడను పార్టీలోకి చేర్చుకొని కాపు సామాజిక వర్గాన్ని ఎంతోకొంత పవన్ వైపు వెళ్లకుండా నియంత్రించవచ్చని ఆశపపడ్డారు. కానీ ఇప్పుడు ముద్రగడ కూడా జనసేన నేతలలో టచ్ లో ఉన్నారు. ఇక యంగ్ క్రికెటర్ అంబటి రాయుడును వైసీపీలోకి చేర్చుకున్నారు. వచ్చే ఎన్నికల్లో గుంటూరు ఎంపీ స్థానం నుంచి రాయుడును పోటీ చేయించి.. రాష్ట్రమంతా ఆయనతో ప్రచారం చేయించాలని భావించారు. కానీ రాయుడు ఇలా చేరినట్లే చేరి అలా రాజీనామా చేసి జనసేన గూటికి చేరారు. ఆ తర్వాత సినీ దర్శకుడు వీవీ వినాయక్ ను రంగంలోకి దింపాలని శతవిధాలా ప్రయత్నించారు. గోదావరి జిల్లాలో వినాయక్ తో ప్రచారం చేయించాలని కలలు కన్నారు. కానీ, వినాయక్ కూడా ససేమీరా అన్నట్లు తెలిసింది.
దీంతో వంగవీటి మోహన్ రంగా తనయుడు వంగవీటి రాధాకృష్ణను తమ వైపు తెచ్చుకునేందుకు ప్రయత్నించారు. నిజానికి రెండు మూడేళ్లుగా వైసీపీ నేతలు వంగవీటి రాధా కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అవకాశం ఉన్న వరకూ ఈ ప్రయత్నాలు సాగాయి. ప్రస్తుతం రాధా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. రాధా వైసీపీలోకి వస్తే కనుక విజయవాడ సెంట్రల్ స్థానాన్ని కేటాయిస్తామని వైసీపీ ఆఫర్ ఇచ్చినట్లు కూడా తెలిసింది. రాధను వైసీపీలోకి తెచ్చుకునేందుకు ఆ మధ్యన మిధున్ రెడ్డి చర్చలు జరిపి రాయబారం నడిపారు. రాధాతో కాస్త అనుకూలంగా ఉండే మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నానిలతో.. టీడీపీ నుండి వెళ్లిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీలతో కూడా వైసీపీ రాయబారం నడిపింది. రాధా ఇటీవల తన తండ్రి రంగా వర్ధంతిని పురస్కరించుకుని కాశీకి వెళ్లి పిండ ప్రదానం చేశారు. రాధా వెంట కొడాలి నాని కూడా తోడు వెళ్లారు. దీంతో రాధా వైసీపీలోకి వెళ్లడం ఖాయమని అంతా అనుకున్నారు.
కానీ, రాధా ఊహించని విధంగా షాక్ ఇచ్చారు. తనకు పార్టీ మారాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పేశారు. అలాగే విజయవాడ వైసీపీ ఇంచార్జ్ బొప్పన భవకుమార్‌ను కూడా టీడీపీలోకి రావాలని రాధా ఆహ్వానించినట్టు ప్రచారం జరుగుతున్నది. మొత్తంగా తాను మాత్రం టీడీపీని వీడడం లేదన్న రాధా స్పష్టంగా చెప్పేశారు. దీంతో ఇప్పుడు జగన్ కాపు కల నెరవేరే పరిస్థితి లేదని తేలిపోయింది. రాధా కోసం ఇన్నాళ్లుగా వైసీపీ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని స్పష్టమైపోయింది. రాధాను వైసీపీ గూటికి చేర్చే ప్రయత్నాలలో భాగంగా కొడాలి నానీ కాశీ వరకూ వెళ్లినా అది శుష్క ప్రయత్నంగానే మిగిలిపోయింది. తెలుగుదేశం, జనసేన కూటమిలో పవన్ కళ్యాణ్ కాపు సామజిక వర్గానికి బిగ్ ఐకాన్ గా ఉండగా.. తెలుగుదేశం నుండి వంగవీటి రాధా ప్రభావం కూడా అదే స్థాయిలో ఉండనుంది. ఇక అంబటి రాయుడు కూటమికి మరో అడ్వాంటేజ్ అయ్యారు. అలాగే ముద్రగడ కూడా జనసేనలోకి వస్తే ఇక కంప్లీట్ కాపు సామజిక వర్గాన్ని జగన్ మర్చిపోవాల్సిందే. ఉత్తరాంధ్ర నుండి కోస్తాంధ్ర వరకూ.. గోదావరి నుండి రాయలసీమ వరకూ ఎటు చూసినా కాపు సామజిక వర్గం జగన్ కు దూరమైనట్లే. ఇది జగన్ మోహన్ రెడ్డికి తీరని నష్టమేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.