వామనరావు కేసులో మరో ట్విస్ట్!
posted on Feb 25, 2021 @ 9:03PM
దేశ వ్యాప్తంగా కలకలం రేపిన హైకోర్డు అడ్వకేట్ దంపతుల హత్య కేసులో మరిన్ని సంచలన విషయాలు బయటికి వచ్చాయి. వామనరావు దంపతుల హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జిల్లా జడ్పీ చైర్మెన్ పుట్ట మధు మేనల్లుడు బిట్టు శ్రీను... పోలీసుల విచారణలో కీలక విషయాలు వెల్లడించాడని తెలుస్తోంది. బిట్టు శ్రీనుకు సంబంధించిన పోలీసుల రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు ఉన్నాయి.
హైకోర్టు న్యాయవాది వామనరావు హత్యకు నాలుగు నెలల క్రితమే బిట్టు శీను ప్లాన్ చేసినట్లు రిపోర్టులో పేర్కొన్నారు. వామనరావ్ బతికుంటే తమకు ఎప్పుడైనా సమస్యనే అని బిట్టు శీను, మరో నిందితుడు కుంట శీను భావించినట్లు చెబుతున్నారు. బిట్టు శీను చైర్మన్‌గా ఉన్న పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్టుపై వామనరావు అనేక కేసులు వేశారు. నాలుగు నెలల క్రితం గుంజపడుగులోనే పాత స్కూల్ బిల్డింగ్ నుంచి శీను గ్యాంగ్ రెక్కీ చేసినట్లు రిమాండ్ రిపోర్టులో తెలిపారు.అయితే అప్పుడు వామనరావు వెంట చాలా మంది ఉండటంతో హత్యా ప్రయత్నాన్ని విరమించుకున్నారని పోలీసులు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు.
అదను కోసం ఎదురు చూస్తున్న నిందితులకు.. ఈనెల 17న వామనరావు ఒంటరిగా దొరకడంతో వామనరావు హత్యకు బిట్టు శీను, కుంట శీను ప్లాన్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. వామనరావు హత్య తర్వాత బిట్టు శీనుకు కుంట శీను ఫోన్ చేసినట్లు రిపోర్టులో పేర్కొన్నారు. వామనరావు దంపతులు చనిపోయారని బిట్టు శీనుకు కుంట శీను సమాచారం అందించాడు. హత్య తర్వాత కుంట శీను అండ్ గ్యాంగ్‌ను మహారాష్ట్రకు వెళ్లిపోమని బిట్టు శ్రీను సలహా ఇచ్చినట్లు రిమాండ్ రిపోర్టులో తెలిపారు.