నీ సినిమాలు మీ వాళ్ళు మాత్రమే చూస్తారా.. హీరో రామ్ కు ఎమ్మెల్యే వంశీ సూటి ప్రశ్న
posted on Aug 21, 2020 @ 7:26PM
విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదంపై టాలీవుడ్ హీరో రామ్ చేసిన వ్యాఖ్యల పై తాజాగా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ స్పందించారు. హీరో రామ్ విజయవాడ రమేశ్ ఆసుపత్రికి సంబంధించిన వ్యవహారంలో ఎవరో రాసిచ్చిన స్క్రిప్టు చదివాడని అయన విమర్శించారు. అయితే రామ్ సినిమాలు కేవలం అతని సామాజిక వర్గం వాళ్లే చూస్తారా? వేరే సామాజిక వర్గం వాళ్లు చూడరా? అని ప్రశ్నించారు. వేరే సామాజిక వర్గం వాళ్లను తన సినిమాలు చూడొద్దని రామ్ చెప్పగలడా? అంటూ వంశీ నిలదీశారు.
కొద్ది రోజుల క్రితం రామ్ ట్విట్టర్ లో స్పందిస్తూ.. కులం అనే జబ్బు కరోనా కంటే వేగంగా వ్యాపిస్తుందని, ఇది కరోనా కంటే ప్రమాదకరమైనదని వ్యాఖ్యానించాడు. నిశ్శబ్దంగా విస్తరించే ఈ మహమ్మారి నుంచి దూరంగా ఉండాలని ప్రజలను కోరైనా సంగతి తెలిసందే.
ఇదే సందర్భంలో ఎమ్మెల్యే వంశీ టీడీపీ అధినేత చంద్రబాబు పైనా తీవ్ర విమర్శలు గుప్పించారు. తమ సామాజిక వర్గానికి చంద్రబాబు ఒక్కడే నాయకుడు కాదని, గతంలో చాలామంది నాయకులు తమ వర్గం కోసం పనిచేశారని తెలిపారు. అసలు తమ సామాజిక వర్గానికి చంద్రబాబుతోనే పెద్ద ప్రమాదం ఉందని, చంద్రబాబు తనకున్న సమస్యలన్నింటినీ తన కులంపై రుద్దుతాడని విమర్శించారు.