పవన్ కళ్యాణ్ కు పీసీసీ చీఫ్ పదవి!!
posted on Dec 26, 2020 @ 3:23PM
మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా.. అసలే తెలంగాణలో వరుస ఓటములతో సతమతమవుతున్న కాంగ్రెస్ కు టీపీసీసీ చీఫ్ ఎంపిక కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది. తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడానికి పలువురు నేతలు పోటీపడుతున్నారు. ఈ రేసులో రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి, జగ్గారెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మరోవైపు, టీపీసీసీ చీఫ్ గా రేవంత్ పేరు ఖరారైనట్లు వార్తలొస్తున్నాయి. దీంతో ఆ పార్టీ సీనియర్లు తిరుగుబాటు స్వరం వినిపిస్తున్నారు. వి. హనుమంతరావు అయితే రేవంత్ కి పార్టీ పగ్గాలిస్తే తాను పార్టీని వీడతానని కూడా ప్రకటించారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు గ్రూపులుగా విడిపోయి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ తరుణంలో వి. హనుమంతరావు తెలుగు రాజకీయాల్లో మరో కొత్త చర్చకు తెరదీశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాంగ్రెస్‌లోకి వస్తే పీసీసీ చీఫ్ పదవి ఇప్పిస్తానని సంచలన ప్రకటన చేశారు.
సూర్యాపేట జిల్లా దొండపాడులో వంగవీటి రంగా విగ్రహాన్ని వీహెచ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వంగవీటి రంగా రానున్న రోజుల్లో సీఎం అవుతాడనే హత్య చేశారని అన్నారు. రాష్ట్రంలో 3 శాతం ఉన్న సామాజికవర్గం వారు కాంగ్రెస్ ను నాశనం చేశారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీసీలకు పీసీసీ చీఫ్ ఇవ్వాలన్నందుకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని, బెదిరింపులకు భయపడనని, పార్టీ కోసం ప్రాణం పోయినా ఫరవాలేదన్నారు. పవన్ కల్యాణ్ కాంగ్రెస్‌లోకి వస్తే పీసీసీ చీఫ్ పదవి ఇప్పిస్తానని ప్రకటించారు. ఏపీలో 27 శాతం ఉన్న కాపులు రాజ్యాధికారం సాధించాలని ఆకాంక్షించారు. వంగవీటి రంగా తర్వాత పవన్ కల్యాణ్‌కు మంచి వేవ్ ఉందని వీహెచ్ అన్నారు.