బీహార్ లో ఏం జరిగింది.. వాళ్లు అధికారంలోకి రాలేదా..
posted on Nov 16, 2015 @ 3:08PM
బీహార్ ఎన్నికల్లో మహా కూటమి విజయం సాధించిన సంగతి తెలసిందే. ఇప్పుడు అదే తరహాలో ఎన్నికల్లో పోటీ చేయాలని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. 2017 లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు గాను వివిధ పార్టీలతో పొత్తు పెట్టుకుని.. మహాకూటమిగా ఏర్పడి బరిలోకి దిగుతామని అఖిలేష్ యాదవ్ అన్నారు. అయితే పొత్త పెట్టుకుంటామని చెప్పారు కాని ఏ పార్టీలతో పొత్తు పెట్టుకుంటారన్న విషయం చెప్పడానికి మాత్రం నిరాకరించారు. అయితే ఇదే విషయంతో మంత్రి ఫరీద్ మహపూజ్ కిద్వాయ్ మాట్లాడుతూ సమాజ్ వాదీ-బీఎస్పీల మద్య పొత్తు ఉంటుందని తెలిపారు. అయితే సమాజ్ వాదీ-బీఎస్పీ పార్టీల మధ్య ఉన్న సఖ్యత అందరికి తెలిసిందే. రెండు పార్టీల మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమనే పరిస్థితి. ఇదే విషయాన్ని మంత్రి గారి ముందు ఉంచగా బీహార్ లో ఇప్పుడు ఏమి జరిగింది.. బీహార్ లో జేడీయూ- అర్జేడీలు పరిస్థితి కూడా అంతే.. కానీ పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రాలేదా అని తిరిగి ప్రశ్నించి అందరూ షాకయ్యేలా చేశారు. ప్రజలు అభివృద్ధిని చూసి ఓట్లు వేస్తారని.. బీహార్ ఎన్నికల్లో అదే జరిగిందని.. మేము అభివృద్ది ఎజెండాతోనే ఎన్నికల బరిలోకి దిగుతామని అన్నారు. మొత్తానికి బీహార్ ఎన్నికలు మాత్రం రాజకీయాల్లో పలు మార్పులనే తీసుకొస్తున్నాయని చెప్పొచ్చు.