మధుమేహం ఉన్నవారిలో హృదయసమస్యలా?? ఇవిగో అద్భుత చిట్కాలు..
posted on Aug 14, 2024 @ 9:30AM
ఆరోగ్యం అందరికీ అవసరమే అయితే ఆ ఆరోగ్యం అనేది కొందరి విషయం లో చాలా సమస్యాత్మకంగా మారుతోంది. ప్రస్తుతకాలంలో ఏదైనా ఒక సమస్య ఎదురైతే... దానికి అనుబంధంగా పెరుగుతూ పోతుంటాయి సమస్యలు. వాటి నుండి బయట పడటం అంత సులువైన విషయం ఏమీ కాదు. మరీ ముఖ్యంగా చిన్న పిల్లలలో, పెద్దవయసు వారిలో ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది. ఈ కారణం వల్ల ఆరోగ్య సమస్యల ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
ప్రస్తుతం అన్ని వయసుల వారికి చాలా తొందరదగా మధుమేహ సమస్య వస్తోంది. ఈ మధుమేహ సమస్య తగ్గడం కోసం ఎన్నో రకాల మందులు అందరికీ అందుబాటులోకి వచ్చినా ఈ మందులు మెల్లిగా గుండె కండరాలను బలహీనం చేసి గుండె పోటు సమస్యకు దారి తీస్తున్నాయనే విషయం చాలా విచారించాల్సిన విషయం. మధుమేహ సమస్య ఉన్న వారిలో గుండె పోటు సమస్యను తగ్గించేందుకు రోజువారి ఉపయోగించుకోగలిగే ఆయుర్వేద ఔషదాలు ఉన్నాయి. వాటిలో అద్భుతమైన అయిదు మూలికల గురించి తెలుసుకుదాం..
పునర్ణవ:-
దీన్నే తెల్లగలిజేరు అని అంటారు. తెల్లగలిజేరు ఆకును గ్రామీణ ప్రాంతాలలో ఆకుకూర స్థానంలో వాడుతుంటారు. ఇది ఎంతో మంచి ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన మొక్క. దీన్ని ఆహారంలో బాగంగా తీసుకోవడం వల్ల రక్తంలో చెక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను క్రమబద్దీకరిస్తుంది. మూత్రం సరిగా రాకుండా ఉన్నప్పుడు ఈ తెల్లగలిజేరు ఆకును వండుకుని తింటే మూత్రవిసర్జన సాఫీగా జరుగుతుంది. మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కంటిచూపును మెరుగుపరుస్తుంది. మధుమేహం వల్ల వచ్చే రెటీనోపతి, నెప్రోపతి మొదలయిన సమస్యలను నివారించడంలో చక్కగా పనిచేస్తుంది. జీవక్రియను కూడా మెరుగుపరుస్తుంది.
పునర్ణవను ఎలా తీసుకోవచ్చు..
పునర్ణవను గ్రామీణ ప్రాంతాల అలవాటుననుసరించి పప్పుగానూ, పొడికూర కానీ చేసుకుని తినవచ్చు. లేదంటే పునర్ణవను ఎండబెట్టి పొడి చేసి రోజూ 2నుండి 2.5 గ్రాము పొడిని వేడినీటితో తీసుకోవాలి.
శొంఠి:-
శొంఠి పొడి అనేది అందరికీ తెలిసిందే.. అల్లంను సున్నంలో ఉడికించి తరువాత ఎండబెట్టి పొడి చేస్తారు. దీన్ని మందుగా ఎప్పటినుండో వాడుతున్నారు. శొంఠి పొడి పాలు, శొంఠి, మిరియాల లేహ్యం వంటివి మాత్రమే కాకుండా శొంఠి పొడిని తేనె తోనూ ఇతర మూలికలతోనూ కాంబినేషన్ గా తీసుకుంటారు. ఇకపోతే శొంఠి గొప్ప ఇమ్యునిటీ బూస్టర్ గానే కాకుండా జీర్ణక్రియకు మంచి ఔషదంగా కూడా ఉపయోగపడుతుంది. దీనివల్ల శొంఠి అనేది మన భారతీయుల రోజువారి జీవితంలో భాగమయ్యింది.
శొంఠి ఎలా తీసుకోవచ్చు..
శొంఠి పొడి రూపంలో ప్రతిరోజూ ఆహారం తీసుకోవడానికి ముందు అరస్పూన్ మోతాదులో తీసుకోవటచ్చు. దీన్ని గోరువెచ్చని నీటితో తీసుకుంటే మంచి ఫలితాన్ని ఇస్తుంది.
మిరియాలు:-
ఎంతో సులభంగా లభించే మిరియాలు వంటలకు ఇచ్చే రుచి, ఘాటు అంతా ఇంతా కాదు. మరీ ముఖ్యంగా ఈ చలి, వర్షపు వాతావరణానికి మిరియాలు కాసింత ఎక్కువ వాడుకున్నా ఎంతో బాగుంటుంది. కేవలం అలా వంటల్లోకే కాకుండా సలాడ్ లు, సూప్ లు, చాట్స్ ఇలా అన్నిటిలోకి మిరియాల పొడిని జల్లుకోవడం వల్ల రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం సొంతమవుతుంది. అయితే మధుమేహం ఉన్నవారికి మిరియాలు ఒక వరం అని చెప్పుకోవచ్చు.
మిరియాలు ఎలా తీసుకోవాలి అంటే….
ప్రతి రోజూ ఉదయాన్నే ఒక నల్ల మిరియం తీసుకోవాలి. దీన్ని నమిలి తినవచ్చు కారంగా అనిపించినా మంచి ప్రయోజనం చేకూరుస్తుంది.
యాలకులు:-
తీపి పదార్థాలు, బిర్యానీ వంటి వంటకాలలోకి ఎక్కువగా ఉపయోగించే యాలకులు మంచి సువాసనతో ఎంతో ఆహ్లాదంగా ఉంటాయి. వీటిని ఎక్కువగా తీపి పదార్థాలకు జతచేయడం మనకు అనుభవంలోనిదే. మధుమేహం ఉన్నవారిలో వారి సమస్యను బట్టి సహజంగానే తీపి పదార్థాల వైపు మనసు మల్లుతుంది. అలాంటి వారికి ఈ యాలకులు మంచి ఉపశమనాన్ని ఇస్తాయి. తీపి తినాలని అనిపించినప్పుడు యాలకులు తింటే తీపి తినాలనే కోరికలు సాధారణంగానే తగ్గుతాయి. యాలకులు తీసుకుంటే శరీరంలోని నరాలను ఉద్దీపన చెందించవచ్చు. మధుమేహం ఉన్నవారు యాలకులు తీసుకుంటే చాలా మంచి ఫలితం ఉంటుంది.
యాలకులు ఎలా తీసుకోవచ్చంటే…
దీన్ని సాధారణంగా టీలో జతచేసి తీసుకోవచ్చు. లేదంటే ప్రతి రోజు కనీసం ఒక యాలకుల పొడిని భోజనానికి గంట ముందు గోరువెచ్చని నీటితో తీసుకోవాలి.
అర్జున పత్రం:-
అర్జున పత్రం అనగానే చాలామంది కన్ఫ్యూజ్ అవ్వచ్చు. అయితే ఈ అర్జున పత్రాన్ని తెల్లమద్ది అని కూడా అంటారు. ఈ చెట్టు ఆకులు, బెరడు మొదలైనవి ఆయుర్వేదంలో ఎంతో బాగా ఉపయోగిస్తారు. గుండె పనితీరు మెరుగుపరచడానికి, గుండె ఆరోగ్యానికి, రక్తపోటు, కొలెస్ట్రాల్ వంటి సమస్యలకు అర్జున పత్రం మంచి ఔషధంగా పనిచేస్తుంది.
అర్జున పత్రాన్ని ఎలా తీసుకోవాలంటే…
దీన్ని ప్రతిరోజు రాత్రి సమయం నిద్రించే ముందు నీళ్లలో వేసి ఉడికించి టీ లాగా చేసుకుని తాగాలి. దీనివల్ల గుండె పనితీరు మెరుగుపడటమే కాకుండా మధుమేహం కూడా నియంత్రించవచ్చు.
◆నిశ్శబ్ద.