వెనక్కి తగ్గిన ట్రంప్ సర్కార్
posted on Jul 15, 2020 @ 10:02AM
ఆన్ లైన్ క్లాసులను ఎంచుకున్న విదేశీ విద్యార్థులు అమెరికాని విడిచి స్వదేశాలకు వెళ్లిపోవాల్సిందేనంటూ ఇటీవల ట్రంప్ సర్కార్ వివాదాస్పద నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే, యూనివర్శిటీలు, టెక్నాలజీ దిగ్గజాలు తీసుకువచ్చిన ఒత్తిడి, పెట్టిన కేసులతో ట్రంప్ సర్కార్ దిగి వచ్చింది.
అకాడమిక్ కోర్సులను పూర్తిగా ఆన్‌లైన్‌లో అభ్యసిస్తున్న విదేశీ విద్యార్థుల వీసాలన్నింటినీ రద్దు చేయాలని ట్రంప్ సర్కారు నిర్ణయం తీసుకుంది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకించిన హార్వార్డ్, మసాచుసెట్స్ ఆఫ్ టెక్నాలజీస్, ఐటీ సంస్థలైన గూగుల్, ఫేస్ బుక్, మైక్రోసాఫ్ట్, అలాగే 18 రాష్ట్రాలకు చెందిన అటార్నీ జనరల్స్ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. కోర్టు జోక్యంతో వీసాల రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ.. గతంలో రద్దు చేస్తున్నట్లు జారీ చేసిన ఆదేశాలను ఉపసంహరించుకుంది అమెరికా ఇమ్మిగ్రేషన్ విభాగం. ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేందుకు ప్రభుత్వం అంగీకరించిందని ఫెడరల్ న్యాయమూర్తి అల్లీసన్ బురోగ్స్ వెల్లడించారు.