జాతీయ రాజకీయాల్లో పోటా పోటీ భేటీలు
posted on Jul 18, 2023 @ 12:01PM
వచ్చే ఎన్నికల్లో బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా విపక్షాలకు చెందిన 26 పార్టీలు బెంగళూరులో సమావేశమైన సంగతి తెలిసిందే. నిన్న ప్రారంభమైన ఈ సమావేశాలు ఈరోజు కూడా కొనసాగాయి. ఈరోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ కూటమికి చెందిన అగ్రనేతలు భేటీ అయ్యారు.
నిన్న సాయంత్రం విపక్షాలకు చెందిన అగ్ర నేతలంతా విందు సమావేశంలో పాల్గొన్నారు. ఈ నాటి సమావేశానికి చెందిన అజెండాపై చర్చలు జరిపారు. మరోవైపు విపక్ష కూటమి నాయకత్వ బాధ్యతలను యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీకి అప్పగించవచ్చని విశ్వసనీయంగా తెలుస్తోంది.
లోకసభ ఎన్నికలకు ముందు జరిగిన ఈ బేటీలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టిఎంసీ నేత మమతా బెనర్జీ , యుపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ కలుసుకున్నారు. దాదాపు రెండేళ్ల తర్వాత మొదటి సారిగా వీరిద్దరు ఒకే వేదిక మీద భేటి అయ్యారు. ఒకరి యోగ క్షేమాలు మరొకరు అడిగి తెలుసుకున్నారు.
విపక్షాల భేటీ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు.
ఈరోజు జరగనున్న భేటీ అత్యంత కీలకమైనది. ఈనాటి సమావేశానికి కేవలం అగ్ర నాయకత్వాలు మాత్రమే హాజరయ్యాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇది క్లోజ్డ్ డోర్ మీటింగ్. సోనియాగాందీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రులు స్టాలిన్, నితీశ్ కుమార్, కేజ్రీవాల్, హేమంత్ సొరేన్, మమతా బెనర్జీ, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తదితరులు ఈనాటి భేటీలో పాల్గొన్నారు.
ఫ్రంట్ పేరుపై సూచనలు చేయాలని నిన్నటి విందు సమావేశంలో అన్ని పార్టీలను కోరారు.
మరో వైపు ఎన్డీఏ కూటమి న్యూఢిల్లీలో సమావేశమైంది . యుపీఏ కూటమి ఎన్డీఏ కూటమి పోటా పోటీగా సమావేశాలు జరపడం ఆసక్తికరంగా మారింది. ఇవ్వాల్టి భేటీలో లోక జనశక్తి పార్టీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ కూడా హాజరయ్యారు. ఈయన మాజీ కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ తనయుడు. తండ్రి చనిపోయిన తర్వాత పార్టీ బాధ్యతలను తానే చూసుకుంటూ బీహార్ రాజకీయాలలో తన దైన ముద్ర వేసుకున్నారు.
జాతీయ రాజకీయాల్లో ఇవ్వాల్టి రోజు చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది. యుపీఏ, ఎన్డీఏ భేటీలు ఒకే రోజు సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఒకరకంగా చెప్పాలంటే శక్తి ప్రదర్శన అని అభివర్ణించవచ్చు.
కర్ణాటక రాజధాని బెంగుళూరులో జరిగిన విపక్ష భేటీలో దాదాపు రెండు డజన్ల పార్టీలు హాజరయ్యాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో కూడా దాదాపు అదే సంఖ్యలో పార్టీలు భాగస్వామ్యమయ్యాయి.
మహరాష్ట్ర కు చెందిన నేతలు షిండే , అజిత్ పవార్ తదితరులు హాజరయ్యారు.