నిర్మలమ్మ బడ్జెట్లో ఎన్నికల తాళింపులు
posted on Feb 2, 2021 @ 2:03PM
పిండి కొద్దీ రొట్టె ... ఇది అందరికీ తెలిసిన సామెత. ఇప్పుడు ఈ సామెతను ఎందుకు ప్రస్తావించవలసి వచ్చిందో వేరే చెప్పనక్కర లేదు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం పార్లమెంట్ ‘లో ప్రవేశ పెట్టిన 2021-22 వార్షిక బడ్జెట్’ ఈ సామెతను గుర్తుకు తెచ్చింది. ఆర్థిక మంత్రి తొలి సరిగా బడ్జెట్’ను డిజిటల్ రూపంలో ప్రవేశ పెట్టారు.అయితే ఇదేదో సాంకేతికంగా సాధించిన విజయానికి సంకేతం కాదు .. . తగ్గుముఖమ పట్టినా ఇంకా వెంటాడుతున్న కరోనా భయంతోనే కాగితాన్ని పక్కన పెట్టి డిజిటల్ మార్గం పట్టారు. ఇలా కాగితం ముక్క లేకుండా బడ్జెట్ ప్రవేశ పెట్టడం, బడ్జెట్ నేపధ్యాన్ని భవిష్యత్’ను కళ్ళముందు నిలబెడుతోంది.పదినెలలకు పైగా,దేశ ఆర్థిక వ్యవస్థనే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను చావుదెబ్బ తీసిన కొవిడ్ మహమ్మారి నేపధ్యంగా,ఇంకా తొలగని, కొవిడ్ ప్రభావం నుంచి ఆర్ధిక వ్యవస్థ ఎదుర్కుంటున్న భయంకర సవాళ్ళను ముందుంచుకుని, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్,బడ్జెట్’ను రూపొందించారు.
ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగాన్ని జాగ్రత్తగా గమనిస్తే, ఎక్కడాకూడా నెల విడిచి సాము చేసే ప్రయత్నం అయితే చేయలేదు. ప్రస్తుత (2020-21)ఆర్థిక సంవత్సరంలో మూడు మినీ బడ్జెట్లను ప్రవేశ పెట్టామని మని ఆర్థిక మంత్రి తమప్రసంగంలో పేర్కొన్నారు. అంటే, నడుస్తున్న ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థకు ఒక దిశా నిర్దేశం లేకుండా పోయిందని, కొవిడ్ కారణంగా అవసరాలకు అనుగుణంగా బడ్జెట్ అంచనాలను మార్చుకోవలసిన అగత్యం ఏర్పడిందని ఆమె చెప్పకనే చెప్పారు. అలాగే, నడుస్తున్న ప్రస్తుత బడ్జెట్ అంచనాలకు, సవరించిన అంచనాలకు మధ్య అగాధమంత వ్యత్యాసం ఉంది. ఆ వివరాలను ఆర్థిక మంత్రి వివరించారు. ఈ పరిస్థితికి ఇంకా ఇతర కారణాలు, ప్రభుత్వ విధానాలు, వైఫల్యాలు కారణం అయితే కావచ్చును గానీ, ప్రధాన కారణం మాత్రం కరోనా... కొవిడ్ మహమ్మారి ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసింది. ఇది కాదనలేని నిజం. ఈ కోణంలో చూసినప్పుడు, ఇది సాధారణ బడ్జెట్ కాదు, అసాధారణ బడ్జెట్ అనే విషయం అర్థమవుతుంది. అలాగే, ప్రస్తుత విపత్కర పరిస్థితులలో ప్రవేశ పెట్టిన బడ్జెట్’ను ప్రత్యేక కోణంలో విశ్లేషించవలసి ఉంటుంది.
అయితే రాజకీయ కోణంలో చూసినప్పుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అధికార కూటమి, సహజంగానే, ఆర్థిక మంత్రి నిర్మలమ్మను అభినందనలతో ముంచెత్తారు. ఆహా వోహో అంటూ అభినందించారు. నిర్మలమ్మ బడ్జెట్ ఆత్మ నిర్భర్ భారత్’కు అడ్డం పడుతోందని కితాబు నిచ్చారు. నిజమే, ఆత్మ నిర్భర్ భారత్’ చాలా అందమైన నినాదం. కానీ, వాస్తవంలో ఆత్మ నిర్భర భారత్ ‘ లస్ఖ్యలను చేరుకోవడం అంట సులభం కాదు. ముఖ్యంగా, కొవిడ్ పుణ్యాన కోట్లాదిమంది కొలువులు కోల్పోయి, పూట గడవడమే కనాకష్టంగా ఉన్న ప్రస్తుత పరిస్తితులో ఆత్మ నిర్బర్ భారత్ సాకరమవుతుందో లేక ఒకప్పుడు ఇందిరమ్మ ఇచ్చిన ‘గరీబీ హఠావో’ నినడంలాగా మిగిలిపోతుందో చూడవలసి ఉంది.
మరో వంక అంతే సహజంగా ప్రతిపక్షం పెదవి విరిచింది. ఇదేమి బడ్జెట్ సామాన్య మానవుడి నడ్డి విరిచింది అని, కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల గాంధీ సహా విపక్ష నేతలు విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ, చాలా కాలంగా చేస్తున్న క్రోనీ క్యాపిటలిజం ఆరోపణను మరో మారు చేశారు. రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా సంస్థలు సహా వివిధ సంస్థలలో ప్రభుత్వవాటాల విక్రయం ద్వారా రూ. 1.75 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో చేసిన ప్రతిపాదనను రాహుల్ గాంధీ తమ వాదనకు ఆధారంగా చూపించారు. అలాగే,కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ఆర్థికమంత్రి, చిదంబరం ఆర్థికమంత్రి నిర్మలా సీతరామన్ పెట్రోల్, దేజిల్ సహా వివిధ వస్తువులపై సుంకం /సెస్ విధించడం ద్వారా ప్రజలను మోసం చేశారని అన్నారు.
అయితే అధికార, విపక్షాల పొగడ్తలు, విమర్శలు ఎలా ఉన్నా, ఇంతటి వత్తిళ్ళ నడుమ బడ్జెట్ రూపొందించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం రాజకీయ అవసరాలను మాత్రం ఉపేక్షించలేదు. ఈ మరో రెండు మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే నాలుగు రాష్ట్రాలకు నిర్మలమ్మ నిధులను బానే వడ్డించారు.ముఖ్యంగా, మొత్తం బడ్జెట్లోనే వ్యవసాయమ తర్వాత పెద్దపీట వేసిన మౌలిక సదుపాయల రంగానికి కేటాయించిన నిధులలో సింహ భాగం ఆ నాలుగు రాష్ట్రాలకు కేటాయించారు. తమిళనాడుకు రూ.1:03 లక్షల కోట్ల విలువచేసే జాతీయ రహదారుల ప్రాజెక్టును ప్రకటించారు. ముంబై – కన్యాకుమారి కారిడార్ సహా కేరళలో జాతీయ రహదారుల నిర్మాణానికి ఏకంగా రూ.65,000 కోట్లు, పశ్చిమ బెంగాల్’కు రూ.25,000 కోట్లు జాతీయ రహదారుల నిర్మాణానికి కేటాయించారు. అదే విధంగా ఈ సంవత్సరం ఎన్నికలు జరిగే మరో కీలక రాష్ట్రం అస్సాంలో ఇప్పటికే రూ.19,000 కోట్ల విలువ చేసే రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయని నిర్మలా సీతారామన్ తమ బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. ఇలా మొత్తం ఎన్నికలు జరిగే నాలుగు రాష్టాలకు కలిపి మొత్తంగా రూ.2.27 కోట్లను ఎన్నికల కానుకగా ప్రకటించారు. సో ... తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే’ అన్నట్లుగా నిర్మలా సీతారామన్, కొవిడ్ కొవిడే.. ఎన్నికల రాజకీయం ఎన్నికల రాజకీయమే అన్నట్లుగా రాజకీయ అవసరాలను నెరవేర్చారు.
అయితే, ఇల్లలకగానే పండగ రాదు, అలాగే, బడ్జెట్లో కేటాయింపులు చేసినంతమాత్రాన ఓట్లు వర్షం కురవదు. నిజానికి ఎన్నికల్లో గెలుపు ఓటములను,నిర్ణయించే అంశాలలో బడ్జెట్ మంచి చెడుల ప్రభావం ఏ మేరకు ఉంటుందనేది, నిర్దిష్టంగా చెప్పడం అయ్యే పని కాదు. కేంద్రంలో లేదా రాష్ట్రాలలో ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, ఎన్నికల సంవత్సరంలో వరాల జల్లు కురుపిస్తుంది. షడ్రుచుల బడ్జెట్’నే వడ్డిస్తుంది. అయినా, అధికార పార్టీలు ఓడిపోతూనే ఉన్నాయి.సో .. బడ్జెట్ ఎన్నికల పై విశేష ప్రభావం చుపుతుందనేది కొన్ని సందర్భాల్లో నిజం కావచ్చును కానీ,అన్ని సందర్భాలలో నిజం కావాలనే నిబంధన అయితే లేదు. ముఖ్యంగా కేంద్ర బడ్జెట్, అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపుతుందని, కమల దళానికి ఓట్లేత్తి పోస్తుందని, ఎవరైనా అనుకుంటే అది పొరపాటే అవుతుంది, అదే విధంగా బడ్జెట్ సామాన్యుడి నడ్డి విరించిందనే అభిప్రాయంతో ఉన్న ప్రతిపక్షాలు, ఆ కారణంగా, విపక్షాలనే విజయం వరిస్తుందని అనుకున్నా,అదీ అంతే.
ముఖ్యంగా మరో రెండుమూడు నెలలలో ఎన్నికలు జరిగే నాలుగు రాష్ట్రాలలో రాజకీయ పరిస్థితులు, ఎన్నికల చరిత్రను గమనిస్తే,కేంద్ర బడ్జెట్ కంటే ఇంతర అంశాలే ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తాయి, ఇది చరిత్ర చెపుతున్నసత్యం.ఇక చివరకి ఓటరు దేవుడు ఏమి చేస్తాడు అనేది ... ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్న.