మోడీపై పరకాల విమర్శలు.. ఇరకాటంలో కేంద్ర విత్త మంత్రి
posted on May 19, 2023 @ 9:51AM
కేంద్రంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇరకాటంలో పడ్డారు. ఆమె భర్త పరకాల ప్రభాకర్ ఒక టీవీ ఇంటర్వ్యూలో ప్రధాని మోడీ టార్గెట్ గా విమర్శలు గుప్పించడంతో.. భార్యా భర్తలిరువురూ చెరోదారిలో నడుస్తున్నారా అన్న అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. పరకాల ప్రభాకర్ గతంలో మోడీ సర్కార్ పై విమర్శలు చేసినా.. తాజాగా ఆయన నేరుగా మోడీ లక్ష్యంగానే తన విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. దీంతో ప్రధాని మోడీ సీరియస్ అయినట్టు సమాచారం.
కేంద్రం, మోడీ తీరుపై తాజాగా పరకాల రాసిన పుస్తకంలో.. గత 9 ఏళ్లలో భారత్ ఎలా నాశనం అయిందో వివరించారు. ఈ క్రమంలో మోడీ విధానాలపై పరకాల తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. 2024 ఎన్నికల్లో మోడీ మళ్లీ గెలిస్తే వినాశనమే అని పరకాల ప్రభాకర్ వ్యాఖ్యానించారు. మోడీ పాలన ప్రజల్లో ద్వేష భావాన్ని, విభజనను భావాలను ప్రేరేపించడానికే పరిమితమైందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాగే ఆర్థిక వ్యవస్థ, ఇతర విషయాల్లో మోడీ విధానాలు అస్తవ్యవస్థంగా ఉన్నాయని పరకాల ప్రభాకర్ తాజా పుస్తకం 'ది క్రూకెడ్ టింబర్ ఆఫ్ న్యూ ఇండియా: ఎస్సేస్ ఆన్ ఎ రిపబ్లిక్ ఇన్ క్రైసిస్' ను ఈ నెల 14న బెంగళూరులో ఆవిష్కరించారు. దీనిపై నిర్వహించిన టీవి ఇంటర్వ్యూలో పరకాల మోడీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
పరకాల నూతన పుస్తకంలో దేశ ఆర్థిక వ్యవస్థ రాజకీయాలు ఇతర సమస్యలపై మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై వరస వ్యాసాలు ఉన్నాయి. 2014 ఎన్నికల్లో అభివృద్ధిపై విజయం సాధించినా, తరువాత నుంచి బీజేపీ హిందుత్వవాదాన్ని అనుసరిస్తోందని లౌకికవాదాన్ని పూర్తిగా విస్మరించిందని పేర్కొన్నారు. 2024 లో మోడీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తే...కేవలం దేశ ఆర్థిక వ్యవస్థకే కాకుండా.. యావత్తు దేశానికే విపత్తు అని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రజల మధ్య విభజనతో లాభం పొందాలని మోడీ ప్రభుత్వం చూస్తోందని విమర్శించారు. తన పోరాటం హిందువులు, ముస్లింల మధ్య కాదని పేదరికం నిరుద్యోగానికి వ్యతిరేకంగా హిందువులు ముస్లింలు కలిసి చేసే పోరాటమని ప్రభాకర్ తెలిపారు. బీజేపీ మోడీలు హిందుత్వం కోసం పాకులాడుతుంటే వారిని ప్రతిఘటించాల్సిన అవసరం ఉందని ప్రభాకర్ పిలుపునిచ్చారు. పెద్ద నోట్ల రద్దు విషయంలో మోడీ ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుపట్టారు.
అర్థిక శాస్త్రంలో ప్రాథమిక శిక్షణ పొందిన ఏ ఆర్థిక వేత్తయినా.. ఇంత పెద్ద స్థాయిలో ఇంత తక్కువ వ్యవధిలో పెద్ద నోట్ల రద్దుకు సిఫార్సు చేసి ఉండరని విమర్శించారు. నోట్ల రద్దు పెద్ద తప్పిదమని.. తదనంతరం తీసుకున్న తప్పుడు విధానాలు ఈ తప్పిదాన్ని మరింతగా పెంచి సంక్షోభాన్ని తీవ్రతరం చేశాయని ప్రభాకర్ వివరించారు. అయితే.. మరోవైపు కర్ణాటక ఎన్నికల సందర్భంగా సీతారామన్.. మోడీని ఆకాశానికి ఎత్తేశారు. మొత్తంగా భార్య ఒకవైపు.. భర్త మరోవైపు.. అన్నట్లుగా పరకాల ప్రభాకర్, నిర్మలాసీతారామన్ తీరు ఉందని, దీనిపైనే మోడీ సీరియస్ అయ్యారనీ, అసలు ఏం జరుగుతోందో ఆరాతీస్తున్నారనీ ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.
సాక్షాత్తు బినెట్ లో అత్యంత కీలకమైన ఆర్థిక మంత్రి భర్త.. ప్రధాని మోడీపై ఆర్థిక విధానాలపైనే తీవ్ర విమర్శలు గుప్పించడం పట్ల కేంద్రం నిర్మలా సీతారామన్ పై గుర్రుగా ఉంది. మోడీ కూడా ఈ విషయంలో సీరియస్ గా ఉన్నారని అంటున్నారు. దీంతో కిరణ్ రిజుజులాగే నిర్మలా సీతారామన్ కు కూడా మంత్రి పదవి తప్పదేమో అన్న చర్చ అయితే బీజేపీ వర్గాల్లో జోరుగా సాగుతోంది.