తూ ..తూ మంత్రంగా బడ్జెట్ సమావేశాలు ?
posted on Mar 4, 2021 @ 1:09PM
మార్చి నెల వచ్చేసింది. కానీ ఇంకా తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఎప్పుడు అనే విషయంలో మాత్రం స్పష్టత రాలేదు. సహజంగా మార్చి మొదటి వారంలో బడ్జెట్ సమావేశాలు జరగడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ సంవత్సరం ఎమ్మెల్సీ ఎన్నికలు అడ్డురావడంతో ఎన్నికలు ముగిసిన తర్వాత.. మార్చి మూడవ వారంలో బడ్జెట్ సమావేశాలు ఉంటాయని ప్రభుత్వ వర్గాలు కొద్ది రోజుల క్రితం ప్రకటించాయి. అయితే ఇప్పుడు అందుతున్న తాజా సమాచారం ప్రకారం, నాగార్జున సాగర్ ఉపఎన్నిక నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే బడ్జెట్ సమావేశాలు ఎప్పుడు, ఎలా,ఎన్ని రోజులు అనే విషయంలో స్పష్టత వస్తుందని తెలుస్తోంది.
కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 15 వ తేదీలోగా నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తే.. మార్చి మూడవ వారం మొదట్లో క్లుప్తంగా రెండు రోజులు సభను సమావేశపరిచే అవకాశం ఉందని తెలుస్తోంది. మొదటి రోజు గవర్నర్ ప్రసంగం, రెండవ రోజు బడ్జెట్ ప్రవేశ పెట్టి సాగర్ ఉపఎన్నిక ముగిసే వరకు సభను వాయిదా వేయాలని ప్రభుత్వం తొలుత భావించింది. అయితే ఇప్పుడు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలుతో పాటు నాగార్జున సాగర్ నోటిఫికేషన్ రాకపోవడంతో.. మార్చి చివరి వారంలో ఒకే సారి ఓ వారం రోజుల పాటు సమావేశాలు నిర్వహించి, ఏప్రిల్ 1 న కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యేలోగా బడ్జెట్ కథకు ముగింపు చెప్పాలని ప్రభుత్వం తలపోస్తోందని విశ్వసనీయ వర్గాల సమాచారం.
గతంలో కనీసం పది పనిదినాలు ఉండేలా 15 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ పై చర్చ ఆమోదంతో పాటు, గవర్నర్ ప్రసంగం, గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం పై చర్చ ఉంటుంది. ప్రభుత్వ సమాధానం, ప్రశ్నోత్తరాలు, స్వల్ప వ్యవధి చర్చ, ఇలా వివిధ నిబధనల పరిధిలో.. అనేక ప్రజాసమస్యలు చర్చకు వస్తాయి. కానీ ఈ సారి గవర్నర్ ప్రసంగం, బడ్జెట్ పై చర్చకు కూడా అంతగా అవకాశం ఉండక పోవచ్చని తెలుస్తోంది.
గత సెప్టెంబర్ లో జరిగిన వర్షాకాల సమావేశాల్లో కొందరు సభ్యులు, సిబ్బందికి కొవిడ్ సోకడంతో అర్ధాంతరంగా వాయిదా వేశారు. వర్షాకాల సమావేశాల్లో రెవెన్యూ బిల్లు సహా కొన్ని కీలక బిల్లులు అయితే ఆమోదం పొందాయి. కానీ ప్రజా సమస్యలు అంతగా చర్చకు రాలేదు. ఆ తర్వాత అక్టోబర్ 13, 14 తేదీలలో రెండు రోజులపాటు జరిగిన ప్రత్యేక సమావేశాల్లో కేవలం హై కోర్టు ఆదేశాల మేరకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టసవరణ బిల్లు, యాసంగి పంటలు, ధాన్యం కొనుగోలు విధానం మాత్రమే చర్చకు వచ్చాయి.
రాష్ట్రం ఎదుర్కుంటున్న సమస్యలు ముఖ్యంగా.. రోజు రోజుకు దిగజారుతున్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పెరుగుతున్న అప్పులు, తరుగుతున్న ఆదాయం, ఆందోళనకు గురి చేస్తున్న శాంతి భద్రతల పరిస్థితిపై చర్చ జరగాల్సి ఉందని విపక్షాలు భావిస్తున్నాయి. నిరుద్యోగం, కేంద్ర ప్రభుత్వం నుంచి అందవలసిన సహాయం అందకపోవడం ఇలా రాష్ట్రాన్ని వేధిస్తున్న వివిధ అంశాలపై చర్చించేందుకు బడ్జెట్ సమావేశాలు కొంత ఎక్కువ కాలం నిర్వహించ వలసి ఉందని ప్రతిపక్ష పార్టీలు చెబుతున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం ఎదో విధంగా బడ్జెట్ పద్దు ‘మమ’ అని పించుకుంటే చాలనే ఉద్దేశంతో ఉన్నట్లు, అధికార వర్గాల సమాచారం బట్టి తెలుస్తోంది.