ఐదేళ్లు.. జస్ట్ ఐదేళ్లు.. పవన్ పురోగమనం.. జగన్ తిరోగమనం?
posted on Feb 26, 2024 @ 2:31PM
ఐదేళ్లు.. జస్ట్ ఐదేళ్లు.. అవును 2019 ఎన్నికల నుంచి 2024 ఎన్నికల వరకూ ఈ ఐదేళ్ల కాలంలో ఇద్దరు నాయకుల పరిస్థితి పూర్తిగా తారుమారైంది. ఒకరు రాజకీయ పరిణితితో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంటే.. మరో నాయకుడు తన పట్ల జనం చూపిన ఆదరణ, అభిమానాలను పూర్తిగా పోగొట్టుకుని వారి ఆగ్రహానికి గురై విఫల నేతగా మిగలడమే తరువాయి అన్న పరిస్థితికి చేరుకున్నారు. ఇంతకీ వారిరువురూ ఎవరంటే ఒకరు అధికార వై సీపీ అధినేత జగన్.. మరొకరు జనసేన అధినేత పవన్ కల్యాణ్. 2019 ఎన్నికలలో జగన్ అశేష ప్రజాభిమానంతో అధికారంలోకి వస్తే.. పవన్ కల్యాణ్ జనసేన పార్టీ కేవలం ఒకే ఒక్క స్థానంలో విజయం సాధించి చతికిల పడింది. పవన్ కల్యాణ్ స్వయంగా పోటీ చేసిన రెండు స్థానాలలోనూ పరాజయాన్ని మూటగట్టుకుని విఫల నేతగా మిగిలారు. అది పక్కన పెడితే ఈ ఐదేళ్ల కాలంలో జగన్ తన పట్ల ప్రజలు చూపిన అభిమానం, ఆదరణను ప్రజాగ్రహంగా మార్చుకుంటే.. అదే ఐదేళ్ల కాలంలో పవన్ కల్యాణ్ తన రాజకీయ పరిణితిని చాటుకుని ప్రజాభిమానాన్ని ప్రోది చేసుకున్నారు. వాస్తవ బలం, రాజకీయ పరిస్థితులు, రాష్ట్ర అవసరాలు, భివిష్యత్, ప్రజల ఆకాంక్షలు, ఆశలు, వారి నాడి అన్నిటినీ పరిగణనలోనికి తీసుకుని తమ పార్టీ ఈ ఎన్నికలలో ఎన్ని స్థానాలలో పోటీలో ఉండాలి, పొత్తులో భాగంగా ఏ మేరకు త్యాగాలకు సిద్ధపడాలి అన్న విషయంలో గ్రౌండ్ రియాలటీ మేరకు ఆచరణాత్మకంగా ఆలోచించి అడుగులు వేస్తుంటే.. జగన్ మాత్రం ప్రజాగ్రహాన్ని పట్టించుకోకుండా సిద్ధం అంటూ చొక్కాలు మడతపెట్టేయాలంటూ పార్టీ క్యాడర్ ను రెచ్చగొడుతున్నారు.
2019 ఎన్నికల సమయంలో పొత్తులకు నో చెప్పి పవన్ కల్యాణ్ తాను ఓడటమే కాకుండా, అప్పటి అధికార పార్టీ పరాజయానికి కూడా పరోక్షంగా కారకుడయ్యారు. కానీ ఆ తరువాత పొరపాటు గ్రహించి సరిదిద్దుకోవడానికి ఇసుమంతైనా వెనుకంజ వేయలేదు. అదే సమయంలో గత ఎన్నికలలో తనకు లభించిన ప్రజాదరణతో అహంకారం తలకెక్కిన జగన్, హామీలను విస్మరించి, అధికారమంటే రాజకీయ ప్రత్యర్థులను వేధించడమే అన్నట్లుగా వ్యవహరించి ప్రజాగ్రహాన్ని మూటగట్టుకున్నారు.
పవన్ కల్యాణ్ 2019 ఎన్నికలలో పరాజయం తరువాత ప్రజలలోనే ఉంటూ, ఓటమికి కారణాలను విశ్లేషించుకున్నారు. పొరపాట్లను సవరించుకుంటూ వేగంగా వాస్తవ పరిస్థితులను ఆకళింపు చేసుకున్నారు. ఎక్కడ నెగ్గాలో మాత్రమే కాదు ఎక్కడ తగ్గాలో కూడా తెలియాలని అర్ధం చేసుకున్నారు. అధికారమంటే ప్రజలను పీల్చి పిప్పి చేయడం, తనను వ్యతిరేకించే వారిపై కక్ష సాధింపులకు పాల్పడటం, ప్రజాగళం వినిపించకుండా నిర్బంధ కాండను ప్రయోగించడమే అన్నట్లుగా వ్యవహరిస్తున్న జగన్ ను గద్దె దింపడమే ఏపీ రాష్ట్రానికి, ప్రజలకు మేలు అన్నది గ్రహించి ఆయన గత ఎన్నికలలో ససేమిరా అన్న పొత్తుకు ఇప్పుడు స్వయంగా పవన్ కల్యాణే స్వాగతం పలికారు. అదే విధంగా సీట్ల పంపకాల విషయంలోనూ ఎక్కడా తూకం చెడకుండా, అలాగే తన గౌరవానికి భంగం కలగకుండా వ్యవహరించారు. అంతే కాకుండా పొత్తు పెట్టుకున్న తెలుగుదేశం పార్టీ అధినేతతో కలిసి ఉమ్మడిగా అభ్యర్థుల ప్రకటనకు అంగీకరించారు. వాస్తవ బలం మేరకే సీట్లు కోరుతానని చెప్పిన ప్రకారమే ఆయనే స్వయంగా తమ పార్టీ 24 అసెంబ్లీ నియోజకవర్గాలలో పోటీ చేస్తుందని ప్రకటించారు. తన నిర్ణయంతో విభేదించే ఎవరైనా సరే నిరభ్యంతరంగా జనసేనను వీడి వెళ్లిపోవచ్చని పార్టీ శ్రేణులకు ఎలాంటి శషబిషలకూ తావు లేకుండా కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు.
టిడిపి, జనసేనల పొత్తులో భాగంగా జనసేనకు కేవలం 24 సీట్లు తీసుకోవడంపై ఏపీ కాపు సంక్షేమ సంఘం నేత హరిరామ జోగయ్య తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ మళ్ళీ పవన్ కళ్యాణ్‌కు ఓ లేఖ రాశారు. ఆ లేఖలో స్వయం ప్రకటిత కాపు నేత హరిరామ జోగయ్య ప్రస్తావించిన ప్రతి అంశానికీ జగన్ గతంలో ఎప్పుడో, అంటే చేగొండి హరిరామ జోగయ్య ప్రశ్నించకముందే, పొత్తులో భాగంగా తాను కోరబోయే సీట్ల సంఖ్య గురించి ప్రస్తావిస్తూన్న సందర్భంగానే బదులిచ్చేశారు. రెండుమూడు పార్టీలు పొత్తులు పెట్టుకున్నప్పుడు వాటిలో పెద్ద పార్టీకి ఎక్కువ సీట్లు లభించడం సహజం. కనుక సీట్ల సర్దుబాట్లు అనివార్యం. ఆ విషయం గుర్తించిన జనసేనాని వాస్తవ అంచనాలకు లోబడే సీట్ల పంపకంతా తమ పార్టీ వాటా తీసుకున్నారు. దీనిని గుర్తించకుండా హరిరామ జోగయ్య చేస్తున్న విమర్శలను ఖాతరు చేయాల్సిన అవసరం లేదని పవన్ భావిస్తున్నారు. కాపు సామాజిక వర్గం కూడా పవన్ నిర్ణయాన్ని స్వాగతిస్తోంది. హరిరామ జోగయ్య వంటి నేతలు పొత్తు విచ్ఛిన్నం చేయడం కోసం వైసీపీ తరఫున పని చేస్తున్న కోవర్టులా అన్న అనుమానాలు కలుగుతున్నాయంటూ పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. ఈ దశలో వాస్తవాన్ని గుర్తించి కాపు సామాజికవర్గం పవన్ నిర్ణయానికి మద్దతు పలుకుతున్నదని అంటున్నారు.