అబద్దం.. అంతా అబద్దం.. అసైన్డ్ భూముల కేసులో సంచలనం
posted on Mar 25, 2021 @ 12:25PM
అమరావతి అసైన్డ్ భూముల కేసులో అనేక తప్పిదాలు. ప్రతిపక్ష నేత చంద్రబాబును ఇరికించేందకు చేయని కుట్రంటూ లేదు. సీఐడీకి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చేసిన ఫిర్యాదులో ఉన్న కందా పావని, ఈపూరి సుబ్బయ్య, అద్దేపల్లి సాంబశివరావు తదితరులు సంచలన విషయాలు బయటపెట్టారు. తాము ఆ కేసు పెట్టలేదంటూ తేల్చి చెప్పారు. విచారణ పేరుతో తమ వద్దకు కొందరు వచ్చారని, భూమి అమ్మారా లేదా అని నిర్ధారించుకుంటున్నామంటూ సంతకాలు పెట్టించుకున్నారన్నారు. తాను ఓసీ అని చెప్పారు. భూమి తాము అమ్ముకున్నామని నిర్ధారిస్తున్నామంటే సంతకం చేశామన్నారు. దాన్ని కేసుగా నమోదు చేశారని చెప్పారు. కేసు కోసం అంటే అసలు తాము సంతకాలే పెట్టేవాళ్ళం కాదన్నారు కందా పావని.
సీఐడీ వాళ్లు వచ్చారు. మీరు పొలం ఇచ్చారా అని అడిగితే అమ్మినట్టు చెప్పామన్నారు అద్దెపల్లి సాంబశివరావు. కొన్నాయన తనకు మళ్లీ భూమి ఇవ్వలేదని, పార్టీ అంశమే తమ దగ్గరకు రాలేదన్నారు. బలవంతంగా లాక్కురన్న మాటలేదన్నారు. బలవంతంగా లాక్కున్నారా అని అడిగారు. అదేమీ లేదని చెప్పామని, కొన్నవాళ్లు ఇస్తారేమోనని అడిగామని, కానీ ఇవ్వలేదన్నారు. తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో కూడా జరిగిందే చెప్పామన్నారు సాంబశివరావు.
వీరికి సంబంధించిన వీడియోలను టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర బయటపెట్టారు. అసైన్డ్ భూముల కేసులో వైసీపీ సర్కార్ కుట్రలకు పాల్పడిందని నరేంద్ర ఆరోపించారు. మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిపై.. రక్తకన్నీరు నాగభూషణాన్ని మించి నటిస్తున్నారని, అసైన్డ్ భూములుల విషయంలో ఆయన నటనకు ఆస్కార్‌ను మించిన అవార్డులు ఇవ్వొచ్చని ఎద్దేవా చేశారు. ఆళ్ల రామకృష్ణా రెడ్డి చేసిన ఫిర్యాదులో పేర్కొన్న కందా పావని, అద్దెపల్లి సాంబశివరావు తదితరులకు మాయమాటలు చెప్పి సంతకాలు సేకరించారంటూ వీడియోలను ధూళిపాళ్ల బయటపెట్టారు. జగన్ బృందం తప్పుడు సాక్ష్యాలు సృష్టించిందన్నారు. ఆర్కే ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఎస్సీలు ఎవరు లేరని, బాధితులు లేరని ఆయన తెలిపారు. సీఐడీ యంత్రాంగంలో ఉన్నవారు వైసీపీ కార్యకర్తల కంటే ఎక్కువ పని చేస్తున్నారని విమర్శించారు ధూళిపాళ్ల నరేంద్ర.