బొచ్చు స్కాం? శ్రీవారి తలనీలాల స్మగ్లింగ్!
posted on Mar 30, 2021 @ 2:27PM
తిరుమల క్షేత్రం. పరమ పావన నిలయం. కలియుగ దేవుడు శ్రీ వేంకటేశ్వరస్వామి నిలయం. నిత్యం వేలాదిగా భక్తులు. తల నీలాలతో మొక్కులు. కట్ చేస్తే....
అది మిజోరంలోని ఇండియా-చైనా బోర్డర్. పక్కా ఇన్ఫర్మేషన్‌తో అస్సోం రైఫిల్స్, కస్టమ్ డిపార్ట్‌మెంట్ కలిసి సరిహద్దులో కాపు కాశారు. ఒక్కో వాహనం చెక్ చేస్తున్నారు. కాసేపటికి వారు వెతుకుతున్న వెహికిల్స్ అక్కడికి వచ్చాయి. వాటిని ఆపారు భద్రతా సిబ్బంది. డాక్యుమెంట్స్ చూపించమన్నారు. ఆ డ్రైవర్ ఏవో కాగితాలు ఇచ్చాడు. అనుమానంతో ఆ వాహనాలు చెక్ చేశారు అస్సోం రైఫిల్స్ జవాన్లు. వాటి నిండా సంచులు. ఆ బ్యాగుల్లో తల వెంట్రుకలు. ఒక్కో సంచిలో 50కేజీల వెంట్రుకలు. అలా మొత్తం 120 బ్యాగుల తలనీలాలు. ఆ వెంట్రుకలు తిరుమల నుంచి చైనాకు అక్రమంగా తరలిస్తుండగా అస్సోం రిఫిల్స్, కస్టమ్ డిపార్ట్‌మెంట్ కలిసి పట్టుకున్నారు. రెండు వాహనాలను, తల వెంట్రుకల బ్యాగులను సీజ్ చేశారు.
ఎక్కడి తిరుమల, ఎక్కడి మిజోరం. ఇక్కడ భక్తులు శ్రీవారికి భక్తితో ఇచ్చిన తలనీలాలను.. దొంగచాటుగా చైనాకు తరలిస్తున్నారు కేటుగాళ్లు. గతంలో ఎప్పుడూ ఇలా జరిగింది లేదు. వెంట్రుకలను సీజ్ చేసిన కస్టమ్స్ అధికారులే వాటిని చూసి అవాక్కయ్యారు. మిజోరాం బోర్డర్ మీదుగా చైనాకు వెంట్రుకలు అక్రమంగా స్మగ్లింగ్ చేస్తున్నారు. చైనాలో వాటిని శుద్ధి చేసి విదేశాలకు అమ్ముతుంటారు. ఆ జుట్టును విగ్గుల తయారీకి వాడుతుంటారు. వాటికి అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. సరిహద్దుల్లో సీజ్ చేసిన 120 బ్యాగుల వెంట్రుకల విలువ సుమారు కోటి 80 లక్షలు ఉంటుందని అంటున్నారు. వాటి ఫైనల్ ప్రొడక్ట్ కాస్ట్.. అంతకు పదింతలే పలుకుతుంది.
ఇక్కడ విషయం వెంట్రుకల గురించి కాదు.. తిరుమలలో శ్రీవారికి సమర్పించిన తలనీలాలు అన్ని రాష్ట్రాలు దాటి దేశ సరిహద్దుల వరకు ఎలా చేరిందనేది ఆసక్తికరం. తిరుమలలో కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. అడుగడుగునా సీసీకెమెరాలు, సెక్యూరిటీ తనిఖీలు ఉంటాయి. గుట్కా, మందు బాటిళ్ల లాంటి వాటినే సిబ్బంది కన్నుగప్పి తీసుకురాలేరు. అలాంటిది.. ఎలాంటి పత్రాలు లేకుండా అంత పెద్ద ఎత్తున తలనీలాలు ఎలా తరలించబడ్డాయి? 120 సంచుల వెంట్రుకలు తిరుమల కొండ దిగుతుంటే అధికారులు ఏం చేస్తున్నట్టు? వారికి తెలీకుండానే ఇదంతా జరుగుతోందా? లేక, అంతా వారి కనుసన్నల్లోనే నడుస్తోందా? పెద్దల నుంచి ఒత్తిడి ఉందా? ఆ పెద్దలు చెబితేనే అక్రమంగా తలనీలాలు తరలిపోయాయా? ఇలా అనేక ప్రశ్నలు. అంతకు మించి అనుమానాలు.
ఈ ఏడాది ఫిబ్రవరి 7న జరిగిందీ ఘటన. ఆ విషయం జాతీయ మీడియాలో ప్రముఖంగా వచ్చింది. ఏపీలో మాత్రం అంతా గప్‌చుప్. చాలా ఆలస్యంగా ఇప్పుడిప్పుడే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక్కడ మరో ఆసక్తికర సంఘటనా చోటు చేసుకుంది. ఫిబ్రవరిలో టీటీడీ అధికారికంగా 143.9 టన్నుల వెంట్రుకలను వేలం వేసి.. 11.17 కోట్ల రాబడి సంపాదించింది. ఇది అధికారిక లెక్క. మరి, మిజోరాం ఘటనతో అనధికారికంగా పెద్ద ఎత్తున వెంట్రుకలు అక్రమంగా సరిహద్దులు దాటుతున్నాయనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు శ్రీవారి భక్తులు. తలనీలాలతో పెద్ద ఎత్తున స్కాంకు తెగబడుతున్నారని అంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వెంట్రుకలను స్మగ్లర్ల సాయంతో దేశ సరిహద్దులు తరలిస్తున్నారని ఆరోపిస్తున్నారు. మరి, ఈ బొచ్చు స్కాం వెనుకున్న బడాబాబులు ఎవరు? ఇంత జరుగుతుంటే టీటీడీ ఏం చేస్తోంది? దీనిపై టీటీడీనే క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఇందులో నిజానిజాలు నిగ్గు తేలాల్సి ఉంది.
అయితే, ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాక తీరిగ్గా స్పందించింది టీటీడీ. మిజోరం సమీపంలోని మయన్మార్ సరిహద్దులో అస్సోం రైఫిల్స్ సీజ్ చేసిన 120 బ్యాగుల తలనీలాలతో తమకు ఎలాంటి సంబంధం లేదని టీటీడీ ప్రకటించింది. శ్రీవారికి సమర్పించిన తలనీలాలను ఈ-ప్లాట్ ఫామ్ ద్వారా నిర్వహించే అంతర్జాతీయ టెండర్ల ద్వారా విక్రయిస్తున్నామని తెలిపింది. టెండర్‌లో ఎక్కువ మొత్తం కోట్ చేసిన బిడ్డర్‌కు తలనీలాలు అప్పగిస్తామని, కొనుగోలు చేసిన బిడ్డర్‌కు అంతర్జాతీయ ఎగుమతి అనుమతులు ఉన్నాయా... లేక దేశంలోనే ఏ ప్రాంతంలో విక్రయిస్తారనేది టీటీడీకి సంబంధించిన విషయం కాదన్నారు. తలనీలాల అక్రమ రవాణాకు పాల్పడిన సంస్థల పేర్లు అధికారికంగా తెలియజేస్తే వాటిని బ్లాక్ లిస్ట్‌లో పెడతామని స్పష్టం చేసింది టీటీడీ.