టి.టి.డి. సిబ్బందికి విదేశీ యోగం ...!
posted on Apr 17, 2012 @ 11:31AM
టి.టి.డి. ఉద్యోగులు, పాలకమండలి సభ్యులకు విదేశీయాన యోగం పట్టబోతోంది. సహజంగా ప్రభుత్వంలోని వివిధ శాఖల అధికారులు అధ్యయనం, పరిశీలన పేరుతొ ప్రభుత్వ నిధులతో విదేశీ పర్యటనలు చేస్తుంటారు. విదేశాలలో రోడ్లు ఎలా వున్నాయి, టౌన్ ప్లానింగ్ ఎలా వుంది, విద్యావిధానం ఎలా వుంది వంటి అనేక అంశాలపై పరిశోధనలంటూ విమానాలు ఎక్కేస్తారు. అయితే దేవాదాయ ధర్మాదాయ శాఖలో పనిచేసే ఉద్యోగులు, అధికారులు, పురోహితులకు మాత్రం విదేశాలలో పర్యటించే అవకాశం వుండదు.
ఈ శాఖ పూర్తిగా హిందూధర్మంపై ఆధారపడి వుంటుంది. ప్రపంచం మొత్తం మీద అతిపెద్ద హిందువులు కలిగిన దేశం భారతదేశమే. ఈ మతం గురించి అధ్యయనం చేయాలంటే ఇతర దేశాలకు చెందినవారు భారతదేశం రావాల్సిందే గాని భారతీయులు ఇతర దేశాలకు వెళ్ళే అవకాశ లేదు. పైగా హిందూ ధర్మశాస్త్ర ప్రకారం సముద్రందాటి ప్రయాణం చేయడం నిషిద్ధం. కాని ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం ఈ నిబంధనలన్నీ పక్కనపెట్టి అమెరికా, జపాన్, సింగపూర్ లలో శ్రీవేంకటేశ్వరుని కళ్యాణ ఉత్సవాలు నిర్వహించడానికి ప్రణాళిక రూపొందించారు. ఈ ప్రణాళిక ప్రకారం ఏప్రిల్ 28వ తేదీ నుంచి రెండు నెలలపాటు అమెరికాలో 18 ప్రాంతాలలో శ్రీవారి కళ్యాణోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించింది. మొదట జరిగే కళ్యాణ ఉత్సవాలకు టిటిడి చైర్మన్ కనుమూరి బాపిరాజు అధికారికంగా అమెరికా వెళుతున్నారు. ఆ తర్వాత అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో జరిగే ఒక్కొక్క ఉత్సవానికి ఒక్కొక్క పాలకవర్గ సభ్యుడు లేదా సభ్యురాలు హాజరవుతారు. వీరందరూ దేవస్థానంవారి ఖర్చులతోనే అధికారికంగా పర్యటనలు చేసివస్తారు. ఇదే విధంగా అమెరికా తర్వాత జపాన్, సింగపూర్ దేశాలలో కూడా స్వామివారి కళ్యాణం కోసం పర్యటనలు చేస్తారు. ఇదంతా ... ఆ వేంకటేశ్వరుని మహిమ ... కరుణ అని విదేశీయానం చేయబోయేవారు సంతోషపడుతున్నారు.