కారు ఓవర్ లోడు..!
posted on Jun 27, 2022 @ 11:53AM
కారు ఓవర్ లోడైందా? కొందరిని దింపేయక, లేకపోతే వారే దిగిపోక తప్పని పరిస్థితి ఏర్పడిందా? అంటే తెలంగాణలో టీఆర్ఎస్ వలసలు చూస్తుంటే ఔననక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు టీఆర్ఎస్ లో అసంతృప్తుల సంఖ్య వరదలా పోటెత్తుతోంది. రాష్ట్రం మొత్తం అదే పరిస్థితి నెలకొని ఉంది. కొందరు కారు దిగి హస్తం పంచన చేరుతుంటే.. మరి కొందరు టీఆర్ఎస్ లోనే ఉండి.. రానున్న ఎన్నికలలో తమకు ప్రత్యర్థులు అనుకున్న వారితో గొడవలు పడుతున్నారు.
గ్రూపు తగాదాలను ప్రోత్సహిస్తున్నారు. పరస్పరం గొడవలు పడుతూ పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కుతున్న వారు మరి కొందరు. మొత్తంగా చూస్తే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉందంటున్నారు పరిశీలకులు. పార్టీ అగ్రనేతల కనుసన్నలలో మెలిగిన, మెలిగే, మెలుగుతారనుకున్న వారికే తెరాసలో పార్టీ పదవులు దక్కాయి. అయినా అంతా బానే ఉందని అనుకోవడానికి లేకుండా విభేదాలు పెచ్చరిల్లుతున్నాయి. ఈ విభేదాలే తెరాస నుంచి కాంగ్రెస్ లోకి వరద గేట్లు తెరుచుకున్నట్లుగా వలసలు ప్రారంభమయ్యాయి. అధికార పార్టీ నుంచి ఈ స్థాయిలో వలసలు జరుగుతున్నాయంటే.. కచ్చితంగా తెరాసలో ఆల్ ఈజ్ నాట్ వెల్ అనుకోవలసిన పరిస్థితేనని పరిశీలకులు అంటున్నారు.
ఇక ఇంత కాలం కేసీఆర్ పై ఆరోపణలు విపక్షాలకే పరిమితమయ్యాయి. కానీ కుటుంబ పాలన, విధానాలపై పార్టీ వీడుతున్న నేతలు ఘాటు విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా అశ్వరావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వరరావు రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న అనంతరం పోడు భూములకు పట్టాల విషయంలో ఆయన కేసీఆర్ సర్కార్ పై చేసిన విమర్శలు కలకలం సృష్టించాయి. పోడు భూములకు పట్టాలు నిరాకరించడం వల్లలే తాను పార్టీ వీడుతున్నట్లు కూడా ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి రెండో సారి అధికారంలోకి రావడానికి ముందు ఎన్నికలలో అంటే 2018 ఎన్నికలలో పోడు భూములకు పట్టాలు అన్న హామీ ఇచ్చింది. స్వయంగా కేసీఆర్ నోటి వెంటే ఈ హామీ వచ్చింది. అయితే మూడేళ్ల తరువాత గిరిజనుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఆ తరువాత ఆ విషయమే పట్టించుకోకుండా గాలికి వదిలేయడంతో గిరిజనుల్లో ఆగ్రహం పెల్లుబుకుతొంది. ప్రజా ప్రతినిథులను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు.
రాష్ట్రంలో మహిళలు, బాలికలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టడంలో కేసీఆర్ సర్కార్ విఫలమైందనీ, పబ్బుల సంస్కృతికి, డ్రగ్స్ స్మగ్లింగ్ కు అడ్డుకట్ట వేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ విజయారెడ్డి తెరాసను వీడి కాంగ్రెస్ గూటికి చేరారు. విజయారెడ్డి దివంగత కాంగ్రెస్ నేత పీజేఆర్ తనయ కావడంతో ఆమె పార్టీ మారడం రాష్ట్రంలోనే పెద్ద నియోజకవర్గం అయిన ఖైరతాబాద్ లో టీఆర్ఎస్ పై ప్రభావం చూపడం ఖాయమని అంటున్నారు. ఇక ఏ జిల్లాకు ఆ జిల్లా గ్రూపు తగాదాల పంచాయతీలు నడుస్తూనే ఉన్నాయి. అయితే వాటిని పరిష్కరించి పార్టీని ఏకతాటిపై నడిపించేందుకు అధిష్టానం ఏ మాత్రం సమయం కేటాయించడం లేదన్న ఆరోపణలు, విమర్శలు కేడర్ నుంచే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న రోజులలో మరిన్ని వలసలు పెరిగే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అసలు కారులో ఈ పరిస్థితి రావడానికి కేసీఆర్ వైఖరీ, ఆపరేషన్ ఆకర్ష్ పేరిట విపక్షాల నుంచి నేతలను పెద్ద ఎత్తున పార్టీలోని ఆహ్వానించడమే కారణమని వారు పేర్కొంటున్నారు. ఇతర పార్టీల నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు వచ్చి చేరడంతో మొదటి నుంచీ పార్టీలో కొనసాగుతున్న వారికి అవకాశాలు దక్కని పరిస్థితి ఏర్పడిందని వివరిస్తున్నారు.