కాంగ్రెస్ ఎమ్మెల్సీ పై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ విమర్శలు.. అందుకే గెలిచారు..!
posted on Dec 31, 2015 @ 3:11PM
రాజకీయాల్లో గెలిచిన పార్టీ నేతపై.. ఓడిపోయిన పార్టీ నేతలు విమర్శలు చేయడం సహజమే. ఇప్పుడు టీఆర్ఎస్ నేతలు కూడా అదే పని చేస్తున్నారు. తెలంగాణలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు గాను ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ 12 స్థానాల్లో ఆరు ఎన్నికలు జరగకముందే టీఆర్ఎస్ పార్టీ ఆరు స్థానాలను ఎకగ్రీవంగా కైవసం చేసుకుంది. ఇక పోటీ జరిగిన ఆరు స్థానాల్లో నాలుగు స్థానాలను టీఆర్ఎస్ గెలుచుకోగా ఊహించని విధంగా రెండు స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. అయితే కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది రెండు స్థానాలే అయినా గెలిచిన అభ్యర్ది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపైన టీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ రాజేశ్వర్ రెడ్డి విమర్శలు చేస్తున్నారు. కోమటి రెడ్డి ఒక్కొక్క ఓటరుకు స్విఫ్ట్ కారు గిఫ్టుగా ఇచ్చారని.. మహిళ ఎంపీటీసీలు - జడ్పీటీసీలకు పది తులాల చొప్పున బంగారు గొలుసులు ఇచ్చారని విమర్శలు చేశారు. అంతేకాదు మొత్తం 12 స్థానాల్లో కాంగ్రెస్ గెలుచుకుంది రెండు సీట్లే గెలిచిందని.. రెండు సీట్లకే కాంగ్రెస్ పార్టీ విర్రవీగుతుందని ఎద్దేవ చేశారు.
ఇదిలా ఉండగా మరోవైపు రాజేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్ నేతలు అనవసర ఆరోపణలు చేస్తున్నారంటూ ఖండిచారు. అంతేకాదు రాజేశ్వరరెడ్డి చేసిన ఆరోపణను రుజువు చేస్తే కోమటిరెడ్డి తో తాము రాజీనామా చేయిస్తామని సవాల్ చేశారు. మరి రాజేశ్వర్ రెడ్డి తాను చేసిన ఆరోపణను నిరూపిస్తారో లేదో చూడాలి.